Share News

‘సర్‌’ ఎక్కడున్నారు..?

ABN , Publish Date - Jul 12 , 2026 | 12:43 AM

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) గడువు మూడు రోజులతో ముగియనుండడంతో శతశాతం పూర్తి చేసేందుకు అధికారులు నిర్వీరామంగా పనిచేస్తున్నారు. సవరణ గడువు పెంచే అవకాశాలు లేకపోవడంతో ఇంకా ఎన్యూమరేషన్‌ ఫారాలు ఇవ్వని వారి కోసం అధికారులు ఆరా తీస్తున్నారు. జిల్లా, మండల స్థాయి అధికారులు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు.

‘సర్‌’ ఎక్కడున్నారు..?
గ్రామ సచివాలయంలో గుర్తించని ఓటర్లపై గ్రామ పెద్దలతో చర్చిస్తున్న తహశీల్దార్‌ త్రివేణి

ఇంకా ఎన్యూమరేషన్‌ ఫారాలు

ఇవ్వని వారి కోసం బీఎల్‌వోల ఆరా

గ్రామాల్లో మరోసారి సందర్శన

రాజకీయ పార్టీల నేతలు, గ్రామస్థులతో మాట్లాడుతున్న బీఎల్‌వోలు

చింతపల్లి, జీకేవీధిలపై ప్రత్యేక దృష్టి

చింతపల్లి, జూలై 11 (ఆంధ్రజ్యోతి):

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) గడువు మూడు రోజులతో ముగియనుండడంతో శతశాతం పూర్తి చేసేందుకు అధికారులు నిర్వీరామంగా పనిచేస్తున్నారు. సవరణ గడువు పెంచే అవకాశాలు లేకపోవడంతో ఇంకా ఎన్యూమరేషన్‌ ఫారాలు ఇవ్వని వారి కోసం అధికారులు ఆరా తీస్తున్నారు. జిల్లా, మండల స్థాయి అధికారులు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. ఎవరు ఎక్కడ ఉంది గ్రామాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులు, గ్రామస్థులను కలిసి అడుగుతున్నారు. జిల్లాలో ఎన్యూమరేషన్‌ ఫారాలు ఓటర్లకు శతశాతం పంపిణీ చేశామని అధికారులు చెబుతున్నప్పటికీ నేటికి గుర్తించని ఓటర్ల జాబితా అధికంగానే ఉంది. గుర్తించని ఓటర్లు ఎక్కడ ఉన్నారో తెలుసుకునేందుకు బీఎల్‌వోలు ముల్లగుల్లాలు పడుతున్నారు. ఈ కారణంగా సమగ్ర సవరణ శతశాతం పూర్తి చేసేందుకు ఇబ్బంది ఏర్పడుతున్నది. శాశ్వత వలసదారులు, మృతుల ఓటర్లను తొలగిస్తున్నప్పటికీ గుర్తించని ఓట్లు ప్రతి బూత్‌ పరిధిలోనూ ఉన్నాయి. దీంతో బీఎల్‌వోలు గుర్తించని ఓటర్ల నుంచి సమాచారం తీసుకునేందుకు పలు మార్లు గ్రామాల చుట్టూ తిరుగుతున్నారు. ఒక బూత్‌ పరిధిలోను ఓట్లు వేర్వేరు గ్రామాల్లో ఉండడంతో సవరణ నిర్వహణకు బీఎల్‌వోలు ఇబ్బంది పడుతున్నారు.

చింతపల్లి, జీకేవీధిలపై ప్రత్యేక దృష్టి

జిల్లాలో అత్యధిక ఓట్లు కలిగిన చింతపల్లి, జీకేవీధి మండలాల్లో ప్రత్యేక సమగ్ర సవరణ పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టింది. జాయింట్‌ కలెక్టర్‌ వారం రోజులుగా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు చింతపల్లి, జీకేవీధి మండలాల్లో పలు గ్రామాలను సందర్శిస్తూ సమగ్ర సవరణను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులను అప్రమత్తం చేస్తూ డిజిటలైజేషన్‌ వేగవంతం చేయించారు. జిల్లాలో చింతపల్లిలో 65,465, జీకేవీధిలో 52,515 ఓట్లు ఉన్నాయి. రెండు మండలాల్లో పోలింగ్‌ బూత్‌లు అధికంగా ఉన్నాయి. ఒక బూత్‌ పరిధి ఓట్లు వేర్వేరు గ్రామాల్లో ఉన్నాయి. దీంతో సమగ్ర సవరణ వేగవంతం చేసేందుకు అధికారులు ఈ రెండు మండలాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రస్తుతం చింతపల్లి 85.56శాతం, జీకేవీధి 90.34 శాతం ఎన్యూమరేషన్‌ ఫారాలను డిజిటలైజేషన్‌ చేశారు.

జిల్లాలో మెరుగుపడ్డ సవరణ..

రాష్ట్రంలోనే అల్లూరి జిల్లా సమగ్ర సవరణలో అట్టడుగు స్థానంలో ఉన్నప్పటికీ కేవలం ఐదు రోజుల వ్యవధిలో జిల్లా అధికారులు పురోగతిని భారీగా పెంచారు. గిరిజన ప్రాంతంలో పలు సాంకేతిక సమస్యలు ఉన్నప్పటికీ శనివారం రాత్రికి నాటికి 90.9 శాతం డిజిటలైజేషన్‌ చేశారు. పెదబయలు గరిష్ఠంగా 99.95 శాతం, కనిష్ఠంగా అరకులోయ 80.65 శాతం సవరణ పూర్తి చేశారు. మూడు రోజుల్లో శతశాతం సవరణ పూర్తి చేసేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.

Updated Date - Jul 12 , 2026 | 12:43 AM