Share News

విమాన ప్రయాణికులకు లాంజ్‌లు ఎక్కడ?

ABN , Publish Date - Aug 09 , 2026 | 01:01 AM

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికుల కోసం నగరంలో ప్రతిపాదించిన లాంజ్‌ల నిర్మాణం ఇప్పట్లో కార్యరూపం దాల్చే సూచనలు కనిపించడం లేదు.

విమాన ప్రయాణికులకు లాంజ్‌లు ఎక్కడ?

భోగాపురం వెళ్లే వారి కోసం నగరంలో లాంజ్‌లు నిర్మించనున్నట్టు ప్రకటనలు

స్థలం కేటాయించాల్సిందిగా జీవీఎంసీకి ప్రభుత్వం ఆదేశం

ఇప్పటివరకూ ఎక్కడా పనులు ప్రారంభించని జీఎంఆర్‌

మరో వారంలో ఎయిర్‌పోర్టు నుంచి కార్యకలాపాలు ప్రారంభం

కొంతకాలం తరువాత నిర్మించే యోచన

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికుల కోసం నగరంలో ప్రతిపాదించిన లాంజ్‌ల నిర్మాణం ఇప్పట్లో కార్యరూపం దాల్చే సూచనలు కనిపించడం లేదు. ఆ విమానాశ్రయం ఆపరేషన్‌లోకి రావడానికి సరిగ్గా ఇంకో వారం రోజులు సమయం మాత్రమే ఉంది. ఈ నెల 17 నుంచి విమానాలన్నీ అక్కడి నుంచే రాకపోకలు సాగిస్తాయి. పలు విమాన సంస్థలు షెడ్యూళ్లను కూడా మార్చుకున్నాయి. అక్కడి యూజర్‌ చార్జీల ప్రకారం టికెట్‌ ధరలు వసూలు చేస్తున్నాయి. విశాఖ నగరంలో వివిధ ప్రాంతాల నుంచి జాతీయ రహదారిని అనుసంధానం చేస్తూ చేపట్టిన మాస్టర్‌ ప్లాన్‌ రహదారుల నిర్మాణం కూడా ఒక కొలిక్కివచ్చింది. రెండు రహదారులు తప్ప మిగిలినవన్నీ వాహనాల రాకపోకలకు సిద్ధమయ్యాయి. అయితే నగరం నుంచి వెళ్లే విమాన ప్రయాణికుల కోసం జీఎంఆర్‌ యాజమాన్యం ప్రత్యేకంగా ఏర్పాటుచేస్తామని ప్రకటించిన ఎయిర్‌పోర్టు లాంజ్‌లు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు.

ఆంధ్రప్రదేశ్‌ విమాన ప్రయాణికుల సంఘం విజ్ఞప్తి మేరకు నగరంలో తొమ్మిది (ఆటోనగర్‌, ఎన్‌ఏడీ జంక్షన్‌, గురుద్వారా జంక్షన్‌, వెంకోజీపాలెం, హనుమంతవాక జంక్షన్‌, ఎండాడ జంక్షన్‌, వీఎంఆర్‌డీఏ పార్కు, ద్వారకా ఆర్టీసీ కాంపెక్స్‌తో పాటు శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో కూడా ఒకటి) ప్రాంతాల్లో ప్రత్యేక లాంజ్‌లు ఏర్పాటు చేస్తామని జీఎంఆర్‌ యాజమాన్యం ప్రకటించింది. అందుకు అవసరమైన స్థలాన్ని కేటాయించాలని జీవీఎంసీకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఆయా ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న బస్టాపులకు కొంచెం దూరాన కనీసం 100 గజాల స్థలం కేటాయించాల్సిందిగా సూచించింది. అందులో 40/10 అడుగుల విస్తీర్ణంలో కంటెయినర్లు పెడతామని జీఎంఆర్‌ తెలిపింది. ఏసీ, కూర్చోవడానికి ఏర్పాట్లు, చిన్న రెస్టారెంట్‌ సదుపాయం ఉంటాయి. ఏడాదికి ఆయా స్థలాలకు ఎంత లీజు చెల్లించాలో కూడా రెండు సంస్థలు ఒక అంగీకారానికి వచ్చాయి. ఆర్టీసీకి కొత్తగా వచ్చిన 20 ఎలక్ర్టిక్‌ బస్సులను భోగాపురం విమానాశ్రయానికే నడపాలని నిర్ణయించారు. వీటికి మార్గాలు కూడా నిర్దేశించారు. ఆ బస్సులన్నీ నగరానికి వచ్చేశాయి. ట్రయల్‌ రన్‌ వేస్తున్నారు. అయితే ఎయిర్‌పోర్టు లాంజ్‌ల నిర్మాణం మాత్రం ఇంకా మొదలు కాలేదు. ముందుగా ఆటోనగర్‌, ఎన్‌ఏడీ జంక్షన్‌, గురుద్వారా జంక్షన్‌, వెంకోజీపాలెం, వీఎంఆర్‌డీఏ పార్కుల వద్ద వాటిని పెడతామన్నారు. అక్కడ కూడా ఎటువంటి పనులు జరగడం లేదు. ఒక్కటి కూడా సిద్ధం కాలేదు. కనీసం ఆ కంటెయినర్లను కూడా చెన్నై నుంచి ఇంకా రప్పించలేదు. కొంతకాలం ఆగి నిర్మాణం చేపట్టాలనే యోచనలో ఉన్నట్టు తెలిసింది. ప్రయాణికుల స్పందన చూసుకుని ముందుకువెళ్లే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఆర్టీసీ యాజమాన్యం మాత్రం తాము ముందుగా నిర్దేశించుకున్న మార్గంలో ఎలక్ర్టిక్‌ బస్సులు నడుపుతామని చెబుతోంది.

Updated Date - Aug 09 , 2026 | 01:01 AM