రాజ్‌మా విత్తనాలేవి?
ABN , Publish Date - Aug 30 , 2026 | 11:18 PM
ఏజెన్సీలో రాయితీపై రాజ్‌మా విత్తనాల పంపిణీపై అయోమయం నెలకొంది. వాస్తవానికి ప్రతి ఏడాది జూలై నెలాఖరు లేదా ఆగస్టు నెలలో విత్తనాలు అందిస్తారు. కానీ ఈ ఏడాది ఆగస్టు నెలాఖరుకు సైతం విత్తనాల పంపిణీపై స్పష్టత లేకుండాపోయింది.
పంపిణీపై అయోమయం
చింతపల్లిలో పంపిణీ ప్రారంభం కాగా... పాడేరు, అరకులోయ సబ్ డివిజన్లలో జాప్యం
ఈ ఏడాది 4,500 క్వింటాళ్ల పంపిణీకి ప్రణాళిక
ఆచరణ శూన్యం
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
ఏజెన్సీలో రాయితీపై రాజ్‌మా విత్తనాల పంపిణీపై అయోమయం నెలకొంది. వాస్తవానికి ప్రతి ఏడాది జూలై నెలాఖరు లేదా ఆగస్టు నెలలో విత్తనాలు అందిస్తారు. కానీ ఈ ఏడాది ఆగస్టు నెలాఖరుకు సైతం విత్తనాల పంపిణీపై స్పష్టత లేకుండాపోయింది. ఇటీవల చింతపల్లిలో రాజ్‌మా విత్తనాల పంపిణీని లాంఛనంగా ప్రారంభించారు. కానీ పాడేరు, అరకులోయ వ్యవసాయ సబ్ డివిజన్లలో విత్తనాల పంపిణీపై కనీస స్పష్టత లేకుండా పోయింది.
వాస్తవానికి జిల్లాలోని 11 మండలాల పరిధిలో సుమారుగా 20 వేల హెక్టార్లలో రాజ్‌మా పంటను ప్రతి ఏడాది సాగు చేస్తున్నారు. అయితే ఎక్కువగా గిరిజన రైతుల వద్ద ఉన్న విత్తనాలతోనే జూలై, ఆగస్టు నెలల్లోనే విత్తుకుంటున్నారు. అయితే పరిస్థితులను బట్టి ఆగస్టు నెలాఖరు నుంచి సెప్టెంబరు రెండో వారంలోగా విత్తుకోవచ్చు. కానీ పూత, పిందె దశల్లో వాతావరణం అనుకూలించకపోతే పంట నష్టపోతారు. ఈ ఏడాది సైతం 4,500 క్వింటాళ్ల విత్తనాలను 90 శాతం రాయితీపై రైతులకు అందించాలని అధికారులు భావించినప్పటికీ, ఇప్పటికీ దానికి సంబంధించిన విషయాలను వ్యవసాయాధికారులు కనీసం వెల్లడించలేదు. దీంతో రాయితీ రాజ్‌మా విత్తనాల పంపిణీ ఈ ఏడాది జరుగుతుందా?, లేదా? అనే అయోమయం నెలకొంది. అయితే అవసరమైనన్ని విత్తనాలను సమకూర్చలేకపోవడం వల్లే ఈ ఏడాది విత్తనాల పంపిణీపై సరైన స్పష్టత లేకుండా పోయిందని తెలుస్తున్నది. రైతులకు అనుకూలంగా ఉన్న సమయంలో వాటిని అందించకపోతే 90 శాతం రాయితీపై విత్తనాలను తీసుకుని 50 శాతం సొమ్ముకు వారపు సంతల్లో విక్రయించే పరిస్థితి ఏర్పడుతుంది. గతంలోనూ అటువంటి ఘటనలు జరిగాయి.
అరకొరగా రాయితీ విత్తనాల పంపిణీ
గత కొన్నాళ్లుగా గిరిజన రైతులకు 90 శాతం రాయితీపై అందిస్తున్న రాజ్‌మా విత్తనాలు అరకొరగా పంపిణీ చేస్తున్నారని రైతులు చెబుతున్నారు. ప్రధానంగా రైతులకు అవసరమైనన్ని విత్తనాలు సమకూర్చకుండా విడతల వారీగా పంపిణీ అంటూ, అధికారులు రైతులను మోసం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉదాహరణకు ఒక రైతుకు 30 కిలోలు విత్తనాలు ఇవ్వాల్సి ఉంటే, 20 కిలోలు ఇచ్చి మొత్తం 30 కిలోలు అందినట్టుగా రికార్డుల్లో నమోదు చేస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఏజెన్సీ వ్యాప్తంగా సుమారుగా 30 వేల మంది రైతులు రాజ్‌మా పంటను సాగు చేస్తే, అందులో కొంత మందికే రాయితీ విత్తనాలను అందిస్తున్నారని అంటున్నారు. వాస్తవానికి 90 శాతం రాయితీపై అందిస్తున్న రాజ్‌మా విత్తనాల పంపిణీపై ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ చేపట్టి, లోపాలను సరి చేసి రైతులకు న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు.
జూలై నెలలోనే తమ వద్ద ఉన్న విత్తనాలు వేసుకున్న రైతులు
ఈ ఏడాది ఇప్పటికీ రాయితీ రాజ్‌మా విత్తనాలు పంపిణీ కాకపోవడంతో తమ వద్ద ఉన్న విత్తనాలను గిరిజన రైతులు వేసుకున్నారు. దీంతో ప్రస్తుతం ఏ గ్రామంలో చూసినా రాజ్‌మా పంట మొక్క దశలో దర్శనమిస్తున్నది. కేవలం 90 రోజుల్లో చేతికి వచ్చే ఈ పంటకు జూలై, ఆగస్టు నెలల్లోనే రైతులు విత్తనాలు వేస్తారు. దీంతో నవంబరు నాటికి పంట చేతికి వస్తుంది. అలాగే పంటకు వాతావరణం అనుకూలిస్తుంది. విత్తనాలు ఆలస్యంగా వేస్తే వాతావరణం అనుకూలించక పంట నష్టపోతామని రైతులు అంటున్నారు. ఈ విషయాన్ని వ్యవసాయాధికారులు గుర్తించకుండా విత్తనాల పంపిణీ ఆలస్యం చేయడం గమనార్హం.