అధికారులపై చర్యలేవీ?
ABN , Publish Date - May 04 , 2026 | 01:01 AM
పేదల కోసం సెంటు స్థలంలో ఇళ్లు నిర్మించకుండా మధ్యలోనే ఉడాయించిన రాక్‌ట్రీ ఇన్‌ఫ్రా సంస్థ అక్రమాలకు అన్ని రకాలుగా సహకరించిన హౌసింగ్ అధికారులపై చర్యలు తీసుకోవడానికి ఉన్నతాధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రాక్‌ట్రీ వ్యవహారంలో వార్డు ఎమినిటీస్ కార్యదర్శులకు షోకాజ్
సంస్థపై రెండు పోలీస్ స్టేషన్‌లలో కేసులు
విశాఖపట్నం, మే 3 (ఆంధ్రజ్యోతి):
పేదల కోసం సెంటు స్థలంలో ఇళ్లు నిర్మించకుండా మధ్యలోనే ఉడాయించిన రాక్‌ట్రీ ఇన్‌ఫ్రా సంస్థ అక్రమాలకు అన్ని రకాలుగా సహకరించిన హౌసింగ్ అధికారులపై చర్యలు తీసుకోవడానికి ఉన్నతాధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు ఇచ్చిన వివరణలపై తదుపరి చర్యలు కనిపించడం లేదనే వాదన వినిపిస్తోంది.
జిల్లాలోని పైడివాడ అగ్రహారం, నంగినారపాడు, గొల్లలపాలెం, గంగవరం, నడుపూరులో 14,627 ఇళ్ల నిర్మాణ బాధ్యతలను రాక్‌ట్రీ సంస్థకు అప్పగించగా 14,021 నిర్మాణాలు ప్రారంభించింది. అయితే నిర్మాణ అవసరానికి మించి ఇనుము, సిమెంట్, ఇసుక సరఫరా చేయడంతో పాటు అధికంగా బిల్లులు చెల్లించారు. దీనిపై విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణచేసి అక్రమాలను నిర్థారించింది. దీంతో రాక్‌ట్రీ నుంచి రూ.22.72 కోట్లు రికవరీ చేయాలని నివేదికలో పేర్కొంది. అదే సమయంలో హౌసింగ్ అధికారులు, వార్డు ఎమినిటీస్ కార్యదర్శుల పాత్రను నివేదికలో ప్రస్తావించిన విజిలెన్స్ ఆయా శాఖల అధికారులు, సిబ్బంది నుంచి వివరణ తీసుకుంది. నాలుగు లేఅవుట్‌లలో అక్రమాలకుగాను హౌసింగ్ కార్పొరేషన్‌లో అప్పటి ఈఈ సత్యనారాయణ, డీఈలు బీఆర్వీ. ప్రసాదరావు, ఆర్.ప్రసంగరాజు, వి.రామకృష్ణ, కేవీ సూర్యారావు, ఏఈలు గోపాలకృష్ణ, ఎంఎం. నాయుడు, దీపక్‌లు ఇచ్చిన వివరణలపై విజిలెన్స్ అసంతృప్తి వ్యక్తం చేసింది.
అక్రమాలపై ఆగ్రహం
ఇళ్ల నిర్మాణంలో సిమెంట్, ఇసుక, ఇనుము సరఫరా నుంచి వినియోగంపై వరకు తమకు సంబంధంలేదని వివరణ ఇవ్వడంపై విజిలెన్స్ తప్పుబట్టింది. నిర్మాణ సంస్థకు ఇచ్చిన మెటీరియల్ కంటే తక్కువగా వినియోగం జరిగిన విషయాన్ని ధ్రువీకరించడంలో ఎమినిటీస్ కార్యదర్శులు, హౌసింగ్ అధికారులు విఫలమయ్యారని విజిలెన్స్ నిర్ధారించింది. క్షేత్రస్థాయిలో నిర్మాణాలను కచ్చితంగా గుర్తించకుండా ఇచ్చిన మెటీరియల్ మేరకు బిల్లులు అప్‌లోడ్ చేశారని, తద్వారా సదరు నిర్మాణ సంస్థకు మేలుచేశారని గుర్తించింది. రాక్‌ట్రీ సంస్థ నుంచి రూ. 22.77 కోట్లు రికవరీ చేయాలని నివేదికలో పేర్కొన్న నేపథ్యంలో హౌసింగ్ అఽధికారులు, వార్డు ఎమినిటీస్ కార్యదర్శులపై చర్యలకు సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలో 30 మంది వార్డు ఎమినిటీస్ కార్యదర్శులకు మునిసిపల్ పరిపాలనా శాఖ షోకాజ్‌లు జారీచేసింది. కాగా హౌసింగ్ అధికారులు తమకు సంబంధంలేదని ఉన్నతాధికారులకు వివరణ ఇచ్చి తప్పించుకున్నారనే వాదన వినిపిస్తోంది.