Share News

టెంట్‌ల దందాకు చెక్‌ పడేదెప్పుడో..?

ABN , Publish Date - Jan 03 , 2026 | 10:42 PM

మన్యంలోని పర్యాటక ప్రదేశాల్లో టెంట్‌లు అద్దెలకు ఇచ్చే నిర్వాహకుల దందాకు అధికారులు చెక్‌ పెట్టాలనే వాదన బలంగా వినిపిస్తున్నది. పక్కాగా నిర్ధేశించిన అద్దెలను మాత్రమే వసూలు చేసేలా చర్యలు చేపట్టాలని డిమాండ్‌ పెరుగుతోంది.

టెంట్‌ల దందాకు చెక్‌ పడేదెప్పుడో..?
ఏజెన్సీలో పర్యాటకులకు అద్దెకు ఇచ్చే టెంట్‌లు

పర్యాటకుల అవసరాన్ని ఆసరాగా

చేసుకుని ఇష్టారాజ్యంగా అద్దె వసూలు

జంటలు వస్తే చాలు అద్దె రెట్టింపు

ప్రభుత్వ భూముల్లో టెంట్లు

వేసుకొని నిర్వాహకులు వ్యాపారం

అధికారుల పర్యవే క్షణలేమి కారణం

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

ఏజెన్సీలో అనంతగిరి మండలం బొర్రా గుహలు, అక్కడికి సమీపంలో ఉన్న జలపాతాలు, అరకులోయలోని గిరిజన మ్యూజియం, పద్మాపురం గార్డెన్‌, రణజిల్లెడ జలపాతం, గిరిజన గ్రామదర్శిని, డుంబ్రిగుడలోని చాపరాయి, కొల్లాపుట్టు జలపాతాలు, పాడేరు మండలం వంజంగి హిల్స్‌, జి.మాడుగుల మండలం కొత్తపల్లి జలపాతం, చింతపల్లి మండలం లంబసింగి, తాజంగి, చెరువులవేనం ప్రాంతాలు, సీలేరు రిజర్వాయర్‌, తదితర సందర్శనీయ ప్రదేశాలకు ప్రతి ఏడాది అక్టోబరు నుంచి మార్చి వరకు వేల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు.

వసతి సమస్య ఆసరాగా దందా

పర్యాటక సీజన్‌లో అరకులోయ, పాడేరు, చింతపల్లి ప్రాంతాల్లో బస చేసేందుకు లాడ్జీలు, హోటళ్లు ఖాళీ ఉండడం లేదు. దీనిని ఆసరాగా చేసుకున్న టెంట్‌ల నిర్వాహకులు అధికంగా అద్దె వసూలు చేస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వీకెండ్‌ సమయాల్లో సందర్శకుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని రెట్టింపు వసూలు చేస్తున్నారని పర్యాటకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిసెంబరు, జనవరి నెలల్లో ఇద్దరు మాత్రమే వినియోగించుకునేలా ఉండే టెంట్‌ను ఒక రాత్రికి రూ.వెయ్యి వరకు వసూలు చేస్తున్నారు. ముఖ్యంగా జోడీగా వచ్చేవారికి వసతి లేని సమయాల్లో ఎంత అద్దెకైనా టెంట్‌లు తీసుకుంటారనే ఆలోచనతో అధికంగా వసూలు చేస్తున్నారు. అలాగే టెంట్‌ల నిర్వాహకులు ప్రభుత్వం నుంచి అనుమతి లేకపోగా, అటవీ, ప్రభుత్వ భూముల్లో సైతం టెంట్‌లు వేసుకుని ఇష్టానుసారంగా వ్యాపారం చేస్తున్నారు. దీంతో పర్యాటకులు తీవ్రంగా నష్టపోతున్నారు. పైగా టెంట్‌ నిర్వాహకులకు ఎటువంటి బాధ్యతా లేకుండా పోతోంది. అలాగే మద్యం, పేకాట వంటివి సైతం పరోక్షంగా అనుమతిస్తుండడం గమనార్హం.

టెంట్‌ల నిర్వహణ క్రమబద్ధీకరణకు చర్యలేవీ?

పర్యాటకం ముసుగులో జరుగుతున్న టెంట్‌ల నిర్వాహకుల దందాకు అడ్డుకట్ట వేయడంతో పాటు వాటి నిర్వహణను క్రమబద్ధీకరించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలనే డిమాండ్‌ బలంగా వినిపిస్తున్నది. గతంలో ఐటీడీఏ పీవోలు అన్ని శాఖల అధికారులకు సమావేశాలు నిర్వహించి, టెంట్‌ల నిర్వహణపై ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టేవారు. కానీ గత రెండేళ్లుగా వాటిపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. దీంతో టెంట్‌ల నిర్వాహకుల ఇష్టారాజ్యం కొనసాగుతుందని పర్యాటకులు ఆరోపిస్తున్నారు. ఇటువంటి చర్యలతో పర్యాటకుల జేబులకు చిల్లులు పడడంతో పాటు ఈ ప్రాంతానికి చెడ్డ పేరు వస్తుందని పలువురు సందర్శకులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి టెంట్‌ల నిర్వహణపై పర్యవేక్షణ చేపట్టి పర్యాటకులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Jan 03 , 2026 | 10:42 PM