Share News

బడి తెరుచుకునేదెన్నడో?

ABN , Publish Date - Jul 01 , 2026 | 12:06 AM

జిల్లాలోని పలు మారుమూల గిరిజన గ్రామాల్లో ఇప్పటి వరకు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు తెరుచుకోలేదు. విద్యాశాఖాధికారులు ఇప్పటి వరకు ఉపాధ్యాయులను నియమించకపోవడంతో వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు పునఃప్రారంభమై 19 రోజులు గడుస్తున్నా చాలా పాఠశాలలు మూతబడే ఉన్నాయి.

బడి తెరుచుకునేదెన్నడో?
ఉపాధ్యాయుడి కోసం నిరీక్షిస్తున్న లక్కవరం జీపీ పాఠశాల విద్యార్థులు

- జీకే వీధి మండలంలోని ఆకులూరు, లక్కవరం పాఠశాలలకు ఉపాధ్యాయులను నియమించని వైనం

- ఇప్పటికీ మూతబడి ఉన్న స్కూళ్లు

- రోజూ పాఠశాలలకు వచ్చి నిరాశతో వెనుదిరుగుతున్న విద్యార్థులు

- చదువుకు దూరమవుతున్న ఆదివాసీ బాలలు

- పిల్లల భవిష్యత్తుపై తల్లిదండ్రుల్లో ఆందోళన

గూడెంకొత్తవీధి/ సీలేరు, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలు మారుమూల గిరిజన గ్రామాల్లో ఇప్పటి వరకు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు తెరుచుకోలేదు. విద్యాశాఖాధికారులు ఇప్పటి వరకు ఉపాధ్యాయులను నియమించకపోవడంతో వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు పునఃప్రారంభమై 19 రోజులు గడుస్తున్నా చాలా పాఠశాలలు మూతబడే ఉన్నాయి. ఇదే పరిస్థితి జీకే వీధి మండలంలోని ఆకులూరు, లక్కవరం గ్రామాల్లో నెలకొంది. ఈ పాఠశాలలకు ఉపాధ్యాయులను నియమించకపోవడంతో విద్యార్థులు రోజూ స్కూళ్లకు వచ్చి నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఇప్పటి వరకు వీరికి విద్యార్థి మిత్ర కిట్లు అందలేదు. తమ పిల్లలు చదువుకు దూరమవుతున్నారని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గూడెంకొత్తవీధి మండలం దేవరాపల్లి పంచాయతీ లక్కవరం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల(గిరిజన సంక్షేమశాఖ), గాలికొండ పంచాయతీ ఆకులూరు మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి నుంచి ఐదవ తరగతి వరకు విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థినీ, విద్యార్థులు 30-32 మంది ఉన్నారు. ఈ రెండు పాఠశాలల్లో రెండేళ్లుగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా వున్నాయి. రెండూ ఏకోపాధ్యాయ పాఠశాలలు. గత ఏడాది లక్కవరం, ఆకులూరు ప్రభుత్వ పాఠశాలలకు ఇతర ప్రాంతాల నుంచి ఉపాధ్యాయులను డిప్యూటేషన్‌పై నియమించి విద్యాబోధన అందించారు. ఈ ఏడాది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు ఉపాధ్యాయుల కొరత లేకుండా విద్యాశాఖ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సర్దుబాటుకు అవకాశం కల్పించింది. విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేసి విద్యాబోధన అందించేందుకు కూటమి ప్రభుత్వం ఆవకాశం కల్పించింది. ఈ జీవో విడుదలై వారం రోజులు గడుస్తున్నప్పటికి విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులు లేని పాఠశాలలకు సర్దుబాటు చేయడంలో విఫలమయ్యారు. దీంతో వేసవి సెలవులు అనంతరం పాఠశాలలు పునఃప్రారంభమై 19 రోజులు గడుస్తున్నప్పటికి ఆకులూరు, లక్కవరం పాఠశాలల్లో విద్యాబోధన ప్రారంభం కాలేదు. ఈ సమస్యను విద్యార్థుల తల్లిదండ్రులు, స్కూల్‌ కమిటీ చైర్మన్‌, గ్రామ పెద్దలు పాంగి డొంబు, పలాసి ధారబాబు, వంతల మల్లేశ్వరరావు, కృష్ణారావు, గాలికొండ మాజీ సర్పంచ్‌ కాకూరి బుజ్జిబాబులు మండల పరిషత్‌, విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లినప్పటికి సమస్యను పరిష్కరించలేదు. ప్రస్తుతం విద్యార్థులు ప్రతి రోజు పాఠశాలకు వచ్చి ఆడుకుని మధ్యాహ్న భోజనం చేసి వెళ్లిపోతున్నారు. ఇప్పటికైనా కలెక్టర్‌, విద్యాశాఖ అధికారులు స్పందించి లక్కవరం, ఆకులూరు పాఠశాలలకు ఉపాధ్యాయులను నియమించి, తమ పిల్లలకు విద్యను అందించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

Updated Date - Jul 01 , 2026 | 12:06 AM