Share News

రెవెన్యూ కార్యాలయ భవనం ఎప్పటికి పూర్తయ్యేనో?

ABN , Publish Date - Apr 23 , 2026 | 10:47 PM

మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయం నూతన భవన నిర్మాణం పునాదులకే పరిమితమైంది. ఎనిమిదేళ్లుగా అదే స్థితిలో దర్శనమిస్తోంది.

రెవెన్యూ కార్యాలయ భవనం ఎప్పటికి పూర్తయ్యేనో?
పునాదులకే పరిమితమైన రెవెన్యూ కార్యాలయ నూతన భవనం

ఎనిమిదేళ్ల క్రితం టీడీపీ ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరు

వైసీపీ ప్రభుత్వం వచ్చాక పనులు నిలిపివేత

ప్రస్తుతం శిథిల భవనంలో కొనసాగుతున్న కార్యాలయం

ఉద్యోగులకు తప్పని అవస్థలు

చింతపల్లి, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయం నూతన భవన నిర్మాణం పునాదులకే పరిమితమైంది. ఎనిమిదేళ్లుగా అదే స్థితిలో దర్శనమిస్తోంది. ప్రస్తుతం శిథిల భవనంలో రెవెన్యూ కార్యాలయం కొనసాగుతుండడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షమొస్తే శ్లాబ్‌ నుంచి నీరు కారిపోతుండడంతో ఫైళ్లు భద్రపరచుకోలేక అవస్థలు పడుతున్నారు.

మండల కేంద్రంలో నూతన రెవెన్యూ కార్యాలయ భవన నిర్మాణానికి 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం రూ.70లక్షలు మంజూరుచేసింది. నిర్మాణ బాధ్యతలు పొందిన కాంట్రాక్టర్‌ పునాదుల వరకు నిర్మించారు. ఆ తరువాత ఎన్నికలు జరిగి వైసీపీ అధికారంలో రావడంతో ఆ పనులను నిలిపివేసింది. కాంట్రాక్టర్‌ చేపట్టిన పనులకు బిల్లులు కూడా చెల్లించలేదు. బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్‌ పలుమార్లు అధికారులకు వేడుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. అత్యాధునిక వసతులతో నిర్మించ తలపెట్టిన ఈ భవనం పూర్తయి ఉంటే ఉద్యోగుల కష్టాలు తీరేవి.

వానొస్తే నరకమే..

ప్రస్తుతం రెవెన్యూ కార్యాలయం శిథిల భవనంలో కొనసాగుతుండడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షమొస్తే శ్లాబ్‌ నుంచి నీరుకారిపోయి ఫైళ్లు సైతం తడిసిపోతున్నాయి. ఆర్‌ఐ, డీటీ, జూనియర్‌, సీనియర్‌ అసిస్టెంట్లు కూర్చునేందుకు ప్రత్యేక గదులు కూడా లేవు. ఇరుకైన కేవలం నాలుగు గదుల్లోనే ఉద్యోగులు సర్దుకుని సేవలందిస్తున్నారు. ఇరుకైన గదిలో వీడియో కాన్ఫరెన్సు నిర్వహిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో నూతన భవనం పూర్తవుతుందని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Apr 23 , 2026 | 10:47 PM