స్పెషల్ డ్రైవ్ పరీక్షల ఫలితాలెన్నడో?
ABN , Publish Date - Nov 11 , 2026 | 01:06 AM
పరీక్షల నిర్వహణ, ఫలితాల విడుదలలో ఆంధ్ర విశ్వవిద్యాలయ అధికారుల తీరు విద్యార్థుల సహనానికి పరీక్ష పెడుతోంది.
నాలుగు నెలలుగా నిరీక్షిస్తున్న విద్యార్థులు
2010 నుంచి 2025 మధ్య బ్యాక్‌లాగ్స్ ఉన్నవారికి జూన్‌లో పరీక్షల నిర్వహణ
ఫలితాల కోసం పది వేల మంది ఎదురుచూపులు
విశాఖపట్నం, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి):
పరీక్షల నిర్వహణ, ఫలితాల విడుదలలో ఆంధ్ర విశ్వవిద్యాలయ అధికారుల తీరు విద్యార్థుల సహనానికి పరీక్ష పెడుతోంది. నోటిఫికేషన్‌లో పేర్కొన్న మేరకు పరీక్షలు నిర్వహించినా, ఫలితాల వెల్లడిలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది. ఈ ఏడాది జూన్‌లో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ పరీక్షల ఫలితాల కోసం వేలాది మంది ఎదురుచూస్తున్నారు.
వ్యక్తిగత కారణాలతో సబ్జెక్టులు క్లియర్ చేయలేకపోయిన అనేకమంది ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించాలని పదేపదే ఏయూ అధికారులను కోరుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో వీసీ ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్ ప్రత్యేక చొరవ చూపారు. దీంతో గత ఏడాది నోటిఫికేషన్ (2010-2025 మధ్యకాలంలో పరీక్ష తప్పిన డిగ్రీ, పీజీ, ఇతర ప్రొఫెషనల్ కోర్సుల వారికి ...) విడుదల చేసి, ఈ ఏడాది ఫిబ్రవరి వరకు రిజిస్ర్టేషన్‌కు అవకాశం కల్పించగా, సుమారు పది వేల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ ఈ ఏడాది జూన్‌లో స్పెషల్ డ్రైవ్ పరీక్షలను నిర్వహించారు.
ఫలితాల కోసం ఎదురుచూపులే
స్పెషల్‌డ్రైవ్ పరీక్షలకు హాజరయ్యే వారి నుంచి ఒక్కో సబ్జెక్టుకు రూ.1,500 చొప్పున ఫీజు వసూలు చేశారు. ఒక్కో విద్యార్థి రెండు నుంచి ఆరు సబ్జెక్టుల పరీక్షలకు హాజరయ్యారు. కాగా పరీక్షలు నిర్వహించి, సుమారు నాలుగు నెలలు గడుస్తోంది. అయినప్పటికీ ఫలితాలు విడుదల చేయకపోవడంతో అసహనం వ్యక్తంచేస్తున్నారు. దీనిపై అధికారులు స్పష్టమైన ప్రకటన చేయాలని కోరుతున్నారు.
మరింత సమయం
పరీక్ష ఫలితాల విడుదలపై వర్సిటీ అధికారులను సంప్రతించగా ప్రస్తుతానికి డిగ్రీ కోర్సులకు సంబంధించిన జవాబుపత్రాల మూల్యాంకనం పూర్తయిందని, పీజీ, ఇతర ప్రొఫెషనల్ కోర్సుల జవాబుపత్రాల మూల్యాంకనం చేపట్టాల్సి ఉందన్నారు. ఫలితాల విడుదలకు మరో నెల రోజులకుపైగా సమయం పడుతుందని తెలిపారు.
గుర్రంపాలెంలో ప్రైవేటు ఎంఎస్‌ఎంఈ పార్క్
ముందుకొచ్చిన జె.కుమార్ ఇన్‌ఫ్రా
రూ.237.71 కోట్ల పెట్టుబడి
ఐదు వేల మందికి ఉద్యోగ అవకాశాలు
లేఅవుట్ చార్జీలు మినహాయింపు
విశాఖపట్నం, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి):
పెందుర్తి మండలం గుర్రంపాలెంలో జె.కుమార్ ఇన్‌ఫ్రా కంపెనీ పబ్లిక్ పబ్లిక్ పార్టనర్‌షిప్ (పీపీపీ) విధానంలో ప్రైవేటు ఎంఎస్‌ఎంఈ పార్క్ ఏర్పాటు చేస్తోంది. ఈ మేరకు గత ఏడాదే ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. మొత్తం 63.37 ఎకరాల విస్తీర్ణంలో ప్రపంచస్థాయి పారిశ్రామిక పార్క్‌ను ప్లగ్ అండ్ ప్లే విధానంలో నిర్మిస్తామని పేర్కొంది. రూ.237.71 కోట్ల పెట్టుబడి పెడతామని, ఈ పార్క్ ద్వారా మొత్తం ఐదు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ప్రభుత్వంలో ఒప్పందం చేసుకుంది. ప్రైవేటు పారిశ్రామిక పార్కుల ప్రోత్సాహకాల కింద ఈ సంస్థకు 100 శాతం లేఅవుట్ ఫీజుల నుంచి మినహాయింపు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ మేరకు సుమారు రూ.1.6 కోట్లు వీఎంఆర్‌డీఏకి చెల్లించాల్సిన లేఅవుట్ ఫీజు నుంచి మినహాయింపు ఇస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
కిరండూల్ రైలుకు అదనపు విస్టాడోమ్ కోచ్
విశాఖపట్నం, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి):
పర్యాటకుల సౌకర్యార్థం విశాఖ-కిరండూల్ పాసింజర్ (58501)కు ఈ నెల 12 నుంచి డిసెంబరు 31 వరకు కొన్ని ప్రత్యేక తేదీల్లో...తిరుగు ప్రయాణంలో కిరండూల్-విశాఖ పాసింజర్‌కు (58502) ఈ నెల 13 నుంచి జనవరి 1 వరకు కొన్ని ప్రత్యేక తేదీల్లో అదనంగా ఒక విస్టాడోమ్ కోచ్‌ను జత చేస్తున్నామని రైల్వే అధికారులు ప్రకటించారు.
విశాఖ-పాట్నా మధ్య ప్రత్యేక రైలు
విశాఖ-పాట్నా మధ్య ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టామని అధికారులు తెలిపారు. విశాఖ-పాట్నా (08588) ప్రత్యేక రైలు ఈ నెల 15, 22 తేదీల్లో (ప్రతి ఆదివారం) రాత్రి 7.25 గంటలకు విశాఖలో బయలుదేరి సోమవారం రాత్రి ఎనిమిది గంటలకు పాట్నా చేరుతుంది. తిరుగు ప్రయాణంలో పాట్నా-విశాఖ (08587) ప్రత్యేక రైలు ఈ నెల 16, 23 తేదీల్లో (ప్రతి సోమవారం) రాత్రి 9.50 గంటలకు పాట్నాలో బయలుదేరి మంగళవారం అర్ధరాత్రి 12.30 గంటలకు విశాఖ చేరుతుందన్నారు.
అమనాంలో ఏఐ డేటా సెంటర్
విశాఖపట్నం, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్ర మంత్రివర్గంలో మంగళవారం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భీమునిపట్నం మండలం అమనాంలో ఏఎం ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ 512 మెగావాట్ల సామర్థ్యంతో గ్రీన్ ఇంటిగ్రేటెడ్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. దీనికి రూ.31,387 కోట్లు పెట్టుబడి కాగా వేయి మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అదానీ గ్రూపునకు క్లౌడ్ హబ్ పాలసీ కింద కార్యకలాపాలకు అనుమతి ఇచ్చింది. అదేవిధంగా అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో రూ.570.2 కోట్ల పెట్టుబడితో ఈ-ప్యాక్ మాడ్యులర్ ఎక్విప్‌మెంట్ తయారీ యూనిట్ ఏర్పాటుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
అప్పన్నకు రూ.2.22 కోట్ల ఆదాయం
సింహాచలం, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి):
వరాహ లక్ష్మీనృసింహస్వామికి భక్తులు గడచిన 36 రోజుల్లో ఆలయ హుండీల ద్వారా సమర్పించిన కట్న, కానుకల రూపంలో సుమారు రూ.2.22 కోట్ల ఆదాయం సమకూరింది. ఈవో జల్లేపల్లి వెంకటరావు ఆధ్వర్యంలో పరకామణి కేంద్రంలో మంగళవారం హుండీలను తెరిచి, ఆదాయం లెక్కించారు. ఇందులో రూ.2,22,13,651 నగదు, 64 గ్రాముల స్వర్ణం, 7.1 కిలోల రజితం ఆభరణాల రూపంలో లభించింది. ఇంకా యూఎస్ డాలర్లు, ఆస్ట్రేలియా, సౌదీఅరేబియా, ఖతార్, ఇంగ్లాండ్, యూఏఈ, ఒమన్, నేపాల్, సింగపూర్, మలేషియా, కువాయిట్, తదితర దేశాల కరెన్సీ సమకూరింది.
జడ్పీ చైర్మన్, ఎంపీపీల ఎన్నికకు నోటిఫికేషన్
19న మండలాధ్యక్షులు
20న జడ్పీ చైర్మన్ ఎన్నిక
విశాఖపట్నం, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి) :
జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్, మండల పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం నోటిఫికేషన్ జారీచేసింది. ఈ నెల ఐదో తేదీన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించగా, ఏడో తేదీన ఓట్ల లెక్కింపు జరిగింది. ఈ నేపథ్యంలో ఈ నెల 19న మండల పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, 20న జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించనున్నారు. ఇందుకోసం 14న సభ్యులకు సంబంధిత అధికారులు నోటీసులు జారీ చేయనున్నారు. విశాఖ జిల్లాలో నాలుగు మండలాలతో కూడిన జిల్లా పరిషత్‌కు చైర్మన్, వైస్ చైర్మన్‌ను ఎన్నుకుంటారు. అదే సమయంలో ఇద్దరు కో-ఆప్షన్ సభ్యులను ఎంపిక చేస్తారు. అలాగే, నాలుగు మండలాల్లో మండలాధ్యక్షులు, ఉపాధ్యక్షులు ఎన్నిక జరగనుంది. చేతులు ఎత్తే విధానం ద్వారా ఎన్నిక ప్రక్రియను పూర్తి చేయనున్నారు.