Share News

రేషన్‌ కష్టాలు తీరేదెన్నడో?

ABN , Publish Date - Aug 21 , 2026 | 12:19 AM

ఉమ్మడి అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో మినీ రేషన్‌ డిపోలను ఏర్పాటు చేయాలని పౌరసరఫరాల శాఖాధికారులు ప్రతిపాదనలు చేశారు. దీంతో తమ కష్టాలు తీరతాయని మారుమూల ప్రాంతాల గిరిజనులు ఆశించారు.

రేషన్‌ కష్టాలు తీరేదెన్నడో?
ముంచంగిపుట్టు మండలం దొరగూడ గిరిజనులు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్మీపురం డిపో నుంచి రేషన్‌ సరుకులు మోసుకు వస్తున్న దృశ్యం(ఫైల్‌)

ఉమ్మడి జిల్లాలో 69 మినీ రేషన్‌ డిపోల ఏర్పాటుకు ప్రతిపాదనలు

గతేడాది మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరని వైనం

మారుమూల ప్రాంత గిరిజనులకు తప్పని కష్టాలు

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

ఉమ్మడి అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో మినీ రేషన్‌ డిపోలను ఏర్పాటు చేయాలని పౌరసరఫరాల శాఖాధికారులు ప్రతిపాదనలు చేశారు. దీంతో తమ కష్టాలు తీరతాయని మారుమూల ప్రాంతాల గిరిజనులు ఆశించారు. కానీ ఇప్పటికీ మినీ డిపోల ఏర్పాటుపై కదలిక రాలేదు. దీంతో గిరిజనుల రేషన్‌ కష్టాలు కొనసాగుతున్నాయి.

మన్యంలోని గిరిజనులు చాలా ఏళ్లుగా రేషన్‌ సరుకులను పొందేందుకు అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా పాడేరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలోనే ఈ సమస్య అధికంగా ఉంది. రేషన్‌ డిపోలకు 2 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఆయా లబ్ధిదారుల గ్రామాలుండడంతో పాటు రోడ్డు, రవాణా సదుపాయాలు లేకపోవడంతో మరింత ఇబ్బందులకు గురవుతున్నారు. ఉమ్మడి అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మొత్తం 4,330 గ్రామాలకు 671 రేషన్‌ డిపోలు మాత్రమే ఉండడంతో ఈ సమస్య నెలకొంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రధాన రేషన్‌ డిపోలకు అనుబంధంగా గ్రామాలకు చేరువగా మినీ డిపోలను ఏర్పాటు చేస్తే కొంత వరకు లబ్ధిదారులకు ఇబ్బందులు తప్పుతాయని, కానీ అఽధికారులు మాత్రం సరుకుల పంపిణీతో తమ పనైపోయిందనే ధోరణితోనే ఉన్నారనే విమర్శలున్నాయి. అలాగే రేషన్‌ సరుకులను విడిపించిన గిరిజనులు వాటిని తమ ఇళ్లకు తీసుకువెళ్లేందుకు చాలా కష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో సరుకుల రవాణా మరింత ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రాణాలకు తెగించి గెడ్డలు, వాగులు దాటుకుని రేషన్‌ సరుకుల కోసం రాకపోకలు సాగించాల్సిన దుస్థితి కొనసాగుతున్నది. ఉదాహరణకు ముంచంగిపుట్టు మండలం లక్ష్మీపురం పంచాయతీ దొరగూడ గ్రామానికి చెందిన గిరిజనులు సుమారు పది కిలోమీటర్లు కాలినడకన రేషన్‌ డిపో ఉన్న లక్ష్మీపురం వచ్చి సరుకులు మోసుకుని వెళ్లాల్సిన వస్తోంది. ఈ పరిస్థితులు జిల్లా కేంద్రం పాడేరు మండలంతో సహా అన్ని మండలాల్లోనూ ఉంది. ఈ తరుణంలో పలు గ్రామాలు కేంద్రంగా మినీ రేషన్‌ డిపోలను ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ చాలా ఏళ్లుగా ఉంది.

నెరవేరని మంత్రి హామీ

జిల్లాలో ముఖ్యంగా పాడేరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలో పలు గ్రామాలకు రేషన్‌ డిపోలు దూరంగా ఉండడంతో గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో గతేడాది ఆగస్టు 4న రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్‌ పాడేరు పర్యటనకు వచ్చిన సందర్భంగా ఆయనకు పలువురు గిరిజనులు రేషన్‌ కష్టాలను తెలియజేశారు. ఇదే సమస్యపై ‘ఆంధ్రజ్యోతి’లో సైతం ‘ఎన్నాళ్లీ పరేషన్‌’ శీర్షికన కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. దీంతో పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహన్‌ స్పందించి గిరిజనుల రేషన్‌ కష్టాలను తీర్చేందుకు గాను మారుమూల ప్రాంతాల్లో మినీ రేషన్‌ డిపోల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాలని జిల్లా పౌరసరఫరాల శాఖాధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు ఉమ్మడి అల్లూరి జిల్లాలో రేషన్‌ డిపోలు దూరంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి, సుమారుగా 69 ప్రాంతాల్లో మినీ డిపోలను ఏర్పాటు చేయడం ద్వారా కొంత వరకు గిరిజనుల రేషన్‌ కష్టాలు తీర్చవచ్చునని ప్రతిపాదనలు తయారుచేసి ప్రభుత్వానికి గతేడాది అక్టోబరులోనే సమర్పించారు. ప్రభుత్వం నుంచి వాటి ఏర్పాటుకు అనుమతిస్తే, మారుమూల ప్రాంతాల్లోని లబ్ధిదారుల రేషన్‌ కష్టాలు తీరతాయని గిరిజనులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ నేటికీ దానిపై ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో మారుమూల గిరిజనుల రేషన్‌ కష్టాలు తీరడం లేదు.

ఉమ్మడి జిల్లాలో మినీ రేషన్‌ డిపోల ఏర్పాటు ప్రతిపాదనలివే...

వ.స మండలం మెయిన్‌ డిపోలు ప్రతిపాదిత మినీ డిపోలు

1. పాడేరు 45 7

2. పెదబయలు 39 7

3. అనంతగిరి 44 7

4. డుంబ్రిగుడ 42 1

5. జీకేవీధి 43 2

6. కొయ్యూరు 57 2

7. జి.మాడుగుల 43 8

8. ముంచంగిపుట్టు 46 3

9. అరకులోయలో 32 3

10. అడ్డతీగల 16 3

11. దేవీపట్నం 13 8

12. మారేడుమిల్లి 14 5

13. రాజవొమ్మంగి 16 2

14. రంపచోడవరం 17 11

-----------------------------------------------------------------------------------

మొత్తం 467 69

-----------------------------------------------------------------------------------

Updated Date - Aug 21 , 2026 | 12:19 AM