Share News

పాడేరు మెయిన్‌రోడ్డు విస్తరణ ఎప్పుడో?

ABN , Publish Date - Jun 16 , 2026 | 12:07 AM

జిల్లా కేంద్రం పాడేరులోని ప్రధాన రహదారుల విస్తరణ పనులు ముందుకు సాగడం లేదు. ఇవి ఎప్పటికి పూర్తవుతాయో అర్థంకాని పరిస్థితి ఉంది. దీంతో గతంలో తొలగించిన ఆక్రమణలు మళ్లీ పుట్టుకొస్తున్నాయి. ట్రాఫిక్‌ సమస్య జఠిలమవుతోంది.

పాడేరు మెయిన్‌రోడ్డు విస్తరణ ఎప్పుడో?
పాడేరు మెయిన్‌రోడ్డులో స్తంభించిన ట్రాఫిక్‌ (ఫైల్‌)

మూడేళ్లుగా కాలయాపన

మొక్కుబడిగా ఆక్రమణల తొలగింపు

ఇప్పటికే ఆక్రమణదారులకు నష్టపరిహారం చెల్లింపు

పనులు జరగకపోవడంతో మళ్లీ పుట్టుకొస్తున్న ఆక్రమణలు

ట్రాఫిక్‌ సమస్య తీవ్రతరం

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

జిల్లా కేంద్రం పాడేరులోని ప్రధాన రహదారుల విస్తరణ పనులు ముందుకు సాగడం లేదు. ఇవి ఎప్పటికి పూర్తవుతాయో అర్థంకాని పరిస్థితి ఉంది. దీంతో గతంలో తొలగించిన ఆక్రమణలు మళ్లీ పుట్టుకొస్తున్నాయి. ట్రాఫిక్‌ సమస్య జఠిలమవుతోంది.

మూడేళ్ల క్రితం అప్పటి కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ పాడేరు మెయిన్‌రోడ్ల విస్తరణకు చర్యలు ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటికి వరకు ముగ్గురు కలెక్టర్లు మారినా రోడ్డు విస్తరణ మాత్రం ఒక కొలిక్కి రాకపోవడం గమనార్హం. స్థానిక అంబేడ్కర్‌ సెంటర్‌ నుంచి విశాఖపట్నం, అరకులోయ, చింతపల్లి మార్గాల వైపు రెండేసి కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణ చేయాలని అప్పట్లో నిర్ణయించారు. అలాగే చింతపల్లి వైపు మార్గాన్ని నేషనల్‌ హైవే అఽథారిటీ ఆధ్వర్యంలో, అరకులోయ, విశాఖపట్నం వైపు మార్గాలను రోడ్లు, భవనాల శాఖ ద్వారా విస్తరణ చేయాలని గతంలోనే నిర్ణయించారు. ఆ మేరకు అంబేడ్కర్‌ సెంటర్‌ నుంచి అటు జి.మాడుగుల వైపు, ఇటు అరకులోయ వైపు ఆక్రమణలను తొలగించారు. కానీ రోడ్డు నిర్మాణానికి ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో ఆక్రమణలు మళ్లీ మొదటికే వచ్చాయి. దీంతో ఎప్పటిలాగానే ట్రాఫిక్‌ సమస్య కొనసాగుతున్నది. ఆఖరుకు కలెక్టర్‌ సైతం సైరన్‌ వేసుకోకుండా బంగ్లా నుంచి కలెక్టరేట్‌కు వెళ్లలేని పరిస్థితి కొనసాగుతున్నది. పాడేరు నుంచి చింతపల్లి వైపు ఉన్న మెయిన్‌రోడ్డు విస్తరణ పనులను నేషనల్‌ హైవే అథారిటికే అప్పగించడంతో ఇప్పటికే రోడ్డు విస్తరణకు అవసరమైన స్థలాల ఎంపిక, ఆక్రమణలు గుర్తింపు సైతం పూర్తి చేశారు. అలాగే ఆక్రమణల తొలగింపులో నష్టపోతున్న వారికి సైతం నష్టపరిహారం సొమ్మును ఏడాది క్రితమే వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.

మెయిన్‌రోడ్ల విస్తరణ ప్రతిపాదన ఇలా..

పాడేరు మెయిన్‌రోడ్ల విస్తరణలో భాగంగా స్థానిక అంబేడ్కర్‌ కూడలి సెంటర్‌ పాయింట్‌గా అటు అరకులోయ వెళ్లే మార్గం, ఇటు విశాఖపట్నం వెళ్లే రోడ్డు, మరో వైపు చింతపల్లి వెళ్లే రహదారి ఉంది. అంబేడ్కర్‌ సెంటర్‌ నుంచి ఆయా మూడు మార్గాల్లోని మెయిన్‌ రోడ్డును రెండు కిలోమీటర్ల దూరం వరకు విస్తరించాలని అధికారులు నిర్ణయించారు. అలాగే ప్రస్తుతం పాడేరు నుంచి చింతపల్లి వెళ్లే రోడ్డు 21 అడుగులుండగా, అరకులోయ, విశాఖపట్నం వెళ్లే రోడ్లు 30 అడుగులు చొప్పున వెడల్పు ఉన్నాయి. దీంతో మూడు రోడ్లను 54 అడుగులుగా విస్తరించాలని, దానిలో ఇరువైపులా ఆరేసి అడుగుల చొప్పున(మొత్తం 12 అడుగులు) నడకదారి, మధ్యలో 42 అడుగుల తారురోడ్డు వేయాలని అధికారులు భావించారు.

విస్తరణతోనే ట్రాఫిక్‌ సమస్యకు పరిష్కారం

పాడేరు మెయిన్‌రోడ్డు విస్తరణతోనే ట్రాఫిక్‌ సమస్యకు చెక్‌ పెట్టగలమని చాలా కాలంగా అధికారులు భావిస్తున్నారు. గతంలో రెవెన్యూ డివిజన్‌ కేంద్రం, ఐటీడీఏ ప్రధాన కేంద్రంగా ఉన్న పాడేరు 2022 ఏప్రిల్‌ నుంచి జిల్లా కేంద్రం కావడంతో వాహనాల రద్దీ పెరిగింది. అలాగే విశాఖపట్నం నుంచి ఒడిశా రాష్ట్రానికి రాకపోకలు సాగించాలంటే పాడేరు మీదుగా వెళ్లాలి. ఈ క్రమంలో పాడేరు పట్టణంలోని ప్రస్తుతం ఉన్న రోడ్లు ఇరుకుగా ఉండడంతో తరచూ ట్రాఫిక్‌ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పాడేరు మెయిన్‌ రోడ్లను విస్తరించాలనే డిమాండ్‌ చాలా బలంగా ఉంది.

Updated Date - Jun 16 , 2026 | 12:07 AM