అంతర్రాష్ట్ర రహదారి ఎప్పటికి పూర్తయ్యేనో?
ABN , Publish Date - Jul 14 , 2026 | 11:55 PM
పాడేరు ఆర్‌అండ్‌బీ డివిజన్ పరిధిలోని సీలేరు- పాలగెడ్డ అంతర్రాష్ట్ర రహదారి గోతులతో అధ్వానంగా ఉంది. పలుచోట్ల చెరువును తలపించేలా గోతులు ఉండడంతో వాహనచోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు.
- ఎన్నో ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన సీలేరు- పాలగెడ్డ రోడ్డు
- చెరువును తలపించే గోతులతో అధ్వానం
- రహదారి పునర్నిర్మాణానికి రూ.18.5 కోట్లు మంజూరు చేసిన కూటమి ప్రభుత్వం
- గత ఏడాది అక్టోబరులో పనులు ప్రారంభించి నిలిపివేసిన కాంట్రాక్టర్
- నాలుగు రాష్ట్రాల ప్రజల ఇబ్బందులు
సీలేరు, జూలై 14 (ఆంధ్రజ్యోతి): పాడేరు ఆర్‌అండ్‌బీ డివిజన్ పరిధిలోని సీలేరు- పాలగెడ్డ అంతర్రాష్ట్ర రహదారి గోతులతో అధ్వానంగా ఉంది. పలుచోట్ల చెరువును తలపించేలా గోతులు ఉండడంతో వాహనచోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు.
ఆంధ్రా, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాలను కలిపే అంతర్రాష్ట్ర రహదారి ఇది. ముఖ్యంగా సీలేరు జల విద్యుత్ ప్రాజెక్టుకు వెళ్లే మార్గమిది. ఈ మార్గం గుండా నాలుగు రాష్ర్టాలకు చెందిన వాహనాలు, ప్రయాణికులతో పాటు సీలేరు కాంప్లెక్సులోని జల విద్యుత్ కేంద్రాల సందర్శనకు, ధారకొండ ధారాలమ్మ అమ్మవారి ఆలయానికి నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. అలాగే తెలంగాణ, ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఆంధ్రా కశ్మీర్‌గా పేరొందిన లంబసింగి, అరకులోయ ప్రాంతాలకు పర్యాటకులు వాహనాలపై ఈ మార్గంలోనే ప్రయాణిస్తుంటారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ రహదారి ఎన్నో ఏళ్లు నిర్లక్ష్యానికి గురైంది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ రహదారి పునర్నిర్మాణానికి రూ.18.5 కోట్లు మంజూరు చేసింది. ఆర్వీనగర్ నుంచి పాలగెడ్డ వరకు మూడు రీచ్‌లుగా పనులు విభజించింది. గత ఏడాది అక్టోబరు నెలలో కాంట్రాక్టర్ పనులు ప్రారంభించి కేవలం ఆర్వీనగర్ నుంచి నూతివంద వరకు గల మొదటి రీచ్‌లో మాత్రమే పనులను పూర్తి చేశారు. రెండవ రీచ్‌లో సప్పర్ల రేయిన్‌గేజ్ నుంచి ధారాలమ్మ ఆలయం వరకు, మూడవ రీచ్‌లో సీలేరు నుంచి పాలగెడ్డ వరకు రహదారి పనులు చేపట్టాల్సి ఉండగా, రెయిన్‌గేజ్ వద్ద కొంత మేర మెటల్ వేసి వదిలేశారు. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో తారుకు కొరత ఏర్పడి పనులు నిలిపివేసినట్టు కాంట్రాక్టర్ చెబుతున్నారు. వాస్తవానికి అంచనా వ్యయం రూ.18.5 కోట్లకు అదనంగా రూ.4 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసినట్టు ఆర్‌అండ్‌బీ అధికారులు తెలిపారు. కానీ పనులు మాత్రం పునఃప్రారంభం కాలేదు. కాగా గత పది రోజులుగా ఈ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు సీలేరు- పాలగెడ్డ రహదారిలోని గోతుల్లో వర్షపు నీరు నిలిచిపోయి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికైనా ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించి కనీసం తాత్కాలికంగా గోతులను పూడ్చాలని వాహనచోదకులు కోరుతున్నారు. దీనిపై ఆర్‌అండ్‌బీ చింతపల్లి సబ్ డివిజన్ డీఈ శ్రీనివాసరావు వివరణ కోరగా, మెటీరియల్ కొరత వల్ల పనులు చేపట్టడం లేదని కాంట్రాక్టర్ చెబుతున్నారని, అతనికి నోటీసులు ఇచ్చి పనులు పునఃప్రారంభించాలని ఒత్తిడి చేస్తున్నామన్నారు. ఈ ఏడాది నవంబరులో పనులు పునఃప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపారు.