డోలీ కష్టాలు తీరేదెన్నడో?
ABN , Publish Date - Aug 30 , 2026 | 11:12 PM
మండలంలోని పలు గ్రామాలకు రహదారి సౌకర్యం లేక ఇప్పటికీ డోలీమోతలు తప్పడం లేదు. అనారోగ్యానికి గురైన వారిని, నిండు గర్భిణులను అత్యవసర సమయాల్లో ఆస్పత్రులకు డోలీల్లో మోసుకెళ్లాల్సిన దుస్థితి కొనసాగుతోంది.
మండలంలోని పలు గ్రామాలకు రహదారులు లేని దుస్థితి
అత్యవసర సమయాల్లో రోగులు, గర్భిణులను ఆస్పత్రికి తరలించడానికి అవస్థలు
రేషన్ తెచ్చుకోవాలన్నా ఇబ్బందులు
అనంతగిరి, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పలు గ్రామాలకు రహదారి సౌకర్యం లేక ఇప్పటికీ డోలీమోతలు తప్పడం లేదు. అనారోగ్యానికి గురైన వారిని, నిండు గర్భిణులను అత్యవసర సమయాల్లో ఆస్పత్రులకు డోలీల్లో మోసుకెళ్లాల్సిన దుస్థితి కొనసాగుతోంది. స్వాతంత్య్రం వచ్చి 79 ఏళ్లు అవుతున్నా కనీసం రహదారి సౌకర్యానికి కూడా నోచుకోలేదని గిరిజనులు వాపోతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కొన్ని గ్రామాలకు రోడ్లు నిర్మించారని, ఇంకా పలు గ్రామాలకు రహదారులు నిర్మించాల్సి ఉందని చెబుతున్నారు.
మండలంలోని అనంతగిరి, పినకోట, పెదకోట, లుంగపర్తి, జీనబాడు, కొత్తూరు, కివర్ల, గుమ్మ పంచాయతీల్లోని పలు గ్రామాలకు ఇప్పటికీ రహదారి సౌకర్యం లేదు. అనారోగ్యానికి గురైన వారిని, నిండు గర్భిణులను అత్యవసర సమయాల్లో రాత్రి వేళల్లో సైతం డోలీల్లో ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో లుంగపర్తి పంచాయతీ మల్లిపాడు గ్రామానికి చెందిన పాంగి బాబూరావు తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో గ్రామస్థులు లుంగపర్తి పీహెచ్‌సీకి సుమారు నాలుగు కిలోమీటర్లు డోలీలో మోసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. అలాగే ఈ ఏడాది జూన్ నెలలో గుమ్మ పంచాయతీ కర్రిగుడ గ్రామానికి చెందిన బి.కుమార్ పిడుగుపాటుకు గురై గాయాల పాలుకావడంతో గ్రామస్థులు కర్రిగుడ నుంచి నిమ్మఊట వరకు ఆరు కిలోమీటర్లు డోలీలో ఆస్పత్రికి తరలించారు. రేషన్ సరుకులు తెచ్చుకోవాలన్నా అదే పరిస్థితి నెలకొందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పినకోట పంచాయతీలో...
కర్రిమామిడి గ్రామంలో 60 మంది, పందిరిమామిడి గ్రామంలో 80 మంది జనాభా ఉన్నారు. బొర్రాపాలెం వరకు 8 కిలోమీటర్లు రోడ్డు సౌకర్యం కల్పిస్తే ఆ రెండు గ్రామాలకు రవాణా కష్టాలు తీరతాయి. అలాగే తముటు గ్రామంలో 200 మందికి పైగా జనాభా ఉన్నారు. తముటు గెడ్డపై వంతెన, ఒక కిలో మీటరు రోడ్డును రేగుళ్లపాలెం వరకు నిర్మిస్తే వీరి కష్టాలు తొలగిపోతాయి.
పెదకోట పంచాయతీలో...
బూసిపుట్టు, చింతలపాలెం, గడ్డిబంధ గ్రామాల్లో 300 మందికి పైగా జనాభా ఉన్నారు. కొండిభకోట వరకు రోడ్డు సౌకర్యం కల్పిస్తే ఈ గ్రామాలకు డోలీమోతలు తప్పుతాయి.
లుంగపర్తి పంచాయతీలో...
మల్లిపాడు గ్రామంలో 110 మంది జనాభా ఉన్నారు. మల్లిపాడు నుంచి లుంగపర్తి వరకు నాలుగు కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మిస్తే గ్రామస్థుల కష్టాలు తీరతాయి. తీగలమామిడిలో 40 మంది జనాభా ఉన్నారు. పెదబయలు రోడ్డు నుంచి తీగలమామిడి వరకు రెండు కిలోమీటర్లు రోడ్డు నిర్మించాలి. ఓనుకొండ గ్రామంలో 200 మంది జనాభా ఉన్నారు. ఓనుకొండ నుంచి మెట్టపాలెం వరకు రెండు వంతెనలు, నాలుగు కిలోమీటర్ల మేర రోడ్డు సౌకర్యం కల్పిస్తే రవాణా ఇబ్బందులు తొలగిపోతాయి.
జీనబాడు పంచాయతీలో..
బెంబీ గ్రామంలో వంద మంది వరకు గిరిజనులు ఉన్నారు. బెంబీ నుంచి వాలాబు వరకు రెండు కిలోమీటర్లు రోడ్డు నిర్మిస్తే డోలీమోతలు తప్పుతాయి.
కొత్తూరు పంచాయతీలో...
చిట్టలగరువు గ్రామంలో 120 మంది జనాభా ఉన్నారు. చిట్టగరువు నుంచి తీగలమాడ వరకు కిలో మీటరు మేర రోడ్డు నిర్మించాల్సి ఉంది. టెంకబూడ్డిలో 50 మంది జనాభా ఉన్నారు. టెంకబూడ్డికి కృష్ణాపురం నుంచి నాలుగు కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించాల్సి ఉంది.
అనంతగిరి పంచాయతీలో...
అమలగుడ గ్రామంలో 50 మంది పీవీటీజీ గిరిజనులు జీవిస్తున్నారు. అమలగుడ నుంచి తాటిగుడ వరకు మూడు కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మిస్తే డోలీమోతలు ఉండవు.
కివర్ల పంచాయతీలో...
నక్కులమామిడి గ్రామంలో 350 మంది వరకు పీవీటీజీ గిరిజనులు జీవిస్తున్నారు. నక్కులమామిడి నుంచి పందిరిమామిడి వరకు 5 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మిస్తే వారికి ఇబ్బందులు తొలగుతాయి. రేషన్ తెచ్చుకోవాలంటే ప్రతి నెలా పందిరిమామిడి వరకు 5 కిలోమీటర్లు నడవాల్సి వస్తోందని వారు వాపోతున్నారు.
గుమ్మ పంచాయతీలో...
కర్రిగుడ గ్రామంలో 200 మంది జనాభా ఉన్నారు. కడరేవ్ గ్రామంలో 90 మంది జనాభా ఉన్నారు. నిమ్మఊట నుంచి కర్రిగుడ, కడరేవ్ వరకు 8 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మిస్తే ఆ రెండు గ్రామాలకు మేలు జరుగుతుంది. కూటమి ప్రభుత్వంలోనైనా తమ గ్రామాలకు రహదారి సౌకర్యం ఏర్పడి రవాణా కష్టాలు తీరతాయని గిరిజనులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.