Share News

రైతు బజారు ఎప్పటికి అందుబాటులోకి వచ్చేనో?

ABN , Publish Date - Mar 29 , 2026 | 01:09 AM

జిల్లా కేంద్రం అనకాపల్లిలో రైతు బజారు నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. వాస్తవానికి గత ఏడాది డిసెంబరు నెలాఖరులోనే రైతు బజారు అందుబాటులోకి రావలసి ఉన్నా ఇప్పటి వరకు ఓ కొలిక్కి రాలేదు.

రైతు బజారు ఎప్పటికి అందుబాటులోకి వచ్చేనో?
ఎన్టీఆర్‌ మార్కెట్‌ యార్డులో సిద్ధమైన రైతు బజారు స్టాల్స్‌

- గత డిసెంబరులోనే ప్రారంభమవుతుందనుకున్నా ఇప్పటికీ కొలిక్కిరాని వైనం

- విద్యుద్దీకరణ పనుల్లో జాప్యం

- రైతులు, వినియోగదారుల తీవ్ర అసంతృప్తి

అనకాపల్లి టౌన్‌, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రం అనకాపల్లిలో రైతు బజారు నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. వాస్తవానికి గత ఏడాది డిసెంబరు నెలాఖరులోనే రైతు బజారు అందుబాటులోకి రావలసి ఉన్నా ఇప్పటి వరకు ఓ కొలిక్కి రాలేదు.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 2022 మార్చి నెలలో అనకాపల్లిలో రైతు బజారు మంజూరైనా దాని నిర్మాణంపై మాత్రం దృష్టి పెట్టలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత సుమారు ఏడు నెలల క్రితం రూ.14 లక్షల నిధులు విడుదల చేయడమే కాకుండా పనులను కూడా ప్రారంభించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కలెక్టర్‌ విజయకృష్ణన్‌, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణలు ఎన్టీఆర్‌ మార్కెట్‌యార్డును పరిశీలించి నాగదుర్గమ్మ ఆలయానికి ఆనుకొని నిరుపయోగంగా ఉన్న రెండు బ్లాక్‌లను గుర్తించారు. ఈ రెండు బ్లాక్‌ల్లో రైతుబజారు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వ్యవసాయ మార్కెటింగ్‌శాఖ ఏడీ అశోక్‌కుమార్‌ ఆధ్వర్యంలో గతేడాది చివరలో రెండు బ్లాక్‌ల్లో రైతులకు అవసరమయ్యే సౌకర్యాల కల్పనకు చర్యలు చేపట్టారు. వాస్తవానికి నిర్మాణ పనులు పూర్తయి డిసెంబరు నెలాఖరుకు రైతు బజారు అందుబాటులోకి రావాల్సి ఉంది. సంక్రాంతికి అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులు ప్రకటించినా ఉగాది దాటినా అందుబాటులోకి రాకపోవడం పట్ల రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ రెండు బ్లాక్‌ల్లో రైతుల కోసం ప్లాట్‌ఫారాలను అధికారులు సిద్ధం చేశారు. డ్వాక్రా మహిళలకు 25, కూరగాయల రైతులకు 75 ప్లాట్‌ఫారాలను సిద్ధం చేశారు. జిల్లా నలుమూలల నుంచి ఇప్పటి వరకు రైతులు వంద మంది వరకు రైతు బజారుకు వచ్చి కూరగాయలు అమ్మకాలు సాగించేందుకు దరఖాస్తులు చేసుకున్నారని మార్కెటింగ్‌శాఖ ఏడీ అశోక్‌కుమార్‌ తెలిపారు. రైతు బజారు స్టాళ్లు సిద్ధంగా ఉన్నప్పటికీ విద్యుద్దీకరణ పనులు జరగకపోవడంతో ప్రారంభానికి తీవ్ర జాప్యం జరుగుతోంది. దీనిపై వ్యవసాయ మార్కెటింగ్‌శాఖ ఏడీ అశోక్‌కుమార్‌ వివరణ కోరగా మార్కెట్‌యార్డులోని 17, 18 నంబర్ల బ్లాక్‌ల్లో రైతు బజారుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈ నెలాఖరులోనే రైతు బజారును రైతులు, కొనుగోలుదారులకు అందుబాటులోకి తీసుకురావాలని భావించా మని, అయితే ఇంజనీరింగ్‌ అధికారులు రెండు బ్లాక్‌ల్లో విద్యుద్దీకరణ పనులు చేపట్టకపోవడం వల్ల జాప్యం జరుగుతోందన్నారు. ఈ విషయాన్ని కలెక్టర్‌, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామని ఆయన చెప్పారు.

Updated Date - Mar 29 , 2026 | 01:09 AM