Share News

డీఆర్వో, ఆర్డీవో పోస్టుల భర్తీ ఎన్నడో?

ABN , Publish Date - Jan 17 , 2026 | 12:38 AM

జిల్లా రెవెన్యూశాఖలో కీలకమైన జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో), విశాఖ రెవెన్యూ డివిజనల్‌ అధికారి (ఆర్డీవో) పోస్టులు మూడు నెలలుగా ఖాళీగా ఉన్నాయి.

డీఆర్వో, ఆర్డీవో పోస్టుల భర్తీ ఎన్నడో?

మూడు నెలలుగా కొనసాగుతున్న ఇన్‌చార్జిల పాలన

విశాఖపట్నం, జనవరి 16 (ఆంధ్రజ్యోతి):

జిల్లా రెవెన్యూశాఖలో కీలకమైన జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో), విశాఖ రెవెన్యూ డివిజనల్‌ అధికారి (ఆర్డీవో) పోస్టులు మూడు నెలలుగా ఖాళీగా ఉన్నాయి. గత ఏడాది అక్టోబరు 20న డీఆర్వో భవానీశంకర్‌, విశాఖ ఆర్డీవో శ్రీలేఖను ప్రభుత్వం బదిలీచేసింది. అప్పటి నుంచి డీఆర్వో బాధ్యతలు జాయింట్‌ కలెక్టర్‌, ఆర్డీవో బాధ్యతలు హెచ్‌పీసీల్‌ భూసేకరణ విభాగం ఎస్డీసీకు అప్పగించారు.

ఇక్కడ జేసీగా పనిచేసిన మయూర్‌ అశోక్‌కు తాజాగా బదిలీ అయింది. ఆ స్థానంలో చిత్తూరు జేసీ గొబ్బిళ్ల విద్యాధరి ఈనెల 19న బాధ్యతలు స్వీకరించనున్నారు. జిల్లాకు ఆమె కొత్త కావడంతో విధులు, బాధ్యతలపై అవగాహన రావడానికి కొంతసమయం పడుతుంది. అందువల్ల ఆమెకు డీఆర్వో బాధ్యతలు తప్పించి పూర్తిస్థాయి అధికారికి అప్పగించాల్సి ఉంది. ఎయిర్‌పోర్టుకు నిత్యం వచ్చే ప్రముఖులకు స్వాగతం పలికే బాధ్యత విశాఖ ఆర్డీవోదే. విశాఖ జిల్లా 11 మండలాలకే పరిమితమైనా ప్రొటోకాల్‌ విధులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉద్యోగ నియామకాల కోసం నిర్వహించే పరీక్షలను పర్యవేక్షించేది జిల్లా రెవెన్యూ అధికారే. వచ్చేనెలలో ఐఎఫ్‌ఆర్‌, మిలాన్‌ నిర్వహించనున్న నేపథ్యంలో నగరానికి భారీగా అతిథులు రానున్నారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, సీఎం, కేంద్రమంత్రులు, ఉన్నతాధికారులు వస్తుండడంతో ప్రొటోకాల్‌ నిర్వహణ కీలకం. రాష్ట్రంలో పలు జిల్లాలకు జేసీలకు మార్చిన ప్రభుత్వం, జిల్లాలోని డీఆర్వో, ఆర్డీవో పోస్టులను మాత్రం భర్తీ చేయలేదు.


19న జేసీ విద్యాధరి బాధ్యతల స్వీకరణ

విశాఖపట్నం, జనవరి 16 (ఆంధ్రజ్యోతి):

బదిలీపై జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా నియమితులైన చిత్తూరు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ గొబ్బిళ్ల విద్యాధరి ఈనెల 18న నగరానికి చేరుకుంటారు. ఆ మరుసటిరోజు 19న బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక్కడి నుంచి బదిలీ అయిన జేసీ మయూర్‌ అశోక్‌ ఇప్పటికే బాధ్యతల నుంచి రిలీవ్‌ అయ్యారు.

Updated Date - Jan 17 , 2026 | 12:39 AM