కాలనీ కష్టాలు తీరేదెన్నడో?
ABN , Publish Date - Jul 19 , 2026 | 12:38 AM
గత వైసీపీ ప్రభుత్వంలో జగనన్న కాలనీ పేరిట వేసిన లేఅవుట్లు (ప్రస్తుతం పీఎంఏవై కాలనీ)లో కనీస సదుపాయాలు లేక ఇళ్ల లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. కాలనీలో రహదారులు, డ్రైనేజీలు లేక వర్షం వస్తే అడుగు బయటకు పెట్టలేని దుస్థితిలో వారు ఉన్నారు.
గత వైసీపీ ప్రభుత్వంలో ఊరు చివర్లో లేఅవుట్లు
కనీస వసతులు కరువు
రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సదుపాయం లేక ఇక్కట్లు
వర్షమొస్తే నరకమే..
సగం మంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణంపై ఆసక్తి చూపని వైనం
కూటమి ప్రభుత్వంలోనైనా మంచిరోజులు వస్తాయని ఎదురుచూపులు
నర్సీపట్నం, జూలై 18 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వంలో జగనన్న కాలనీ పేరిట వేసిన లేఅవుట్లు (ప్రస్తుతం పీఎంఏవై కాలనీ)లో కనీస సదుపాయాలు లేక ఇళ్ల లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. కాలనీలో రహదారులు, డ్రైనేజీలు లేక వర్షం వస్తే అడుగు బయటకు పెట్టలేని దుస్థితిలో వారు ఉన్నారు.
గత వైసీపీ ప్రభుత్వంలో డివిజన్‌లో నర్సీపట్నం, పాయకరావుపేట నియోజవర్గాలతో పాటు రోలుగుంట, రావికమతం, మాడుగుల, చీడికాడ మండలాలు, నర్సీపట్నం మునిసిపాలిటీ కలిపి మొత్తం 9,388 మందికి ఇళ్ల స్థలాలు మంజూరు చేశారు. అయితే 4,708 మంది మాత్రమే ఇళ్లు నిర్మించున్నారు. పునాదుల స్థాయిలో 3045 ఇళ్లు ఉండగా, లింటల్ స్థాయిలో 211, రూఫ్ స్థాయిలో 355, శ్లాబ్‌లు వేసి 118 ఇళ్లు, వివిధ దశల్లో 88 ఇళ్లు ఉన్నాయి. అలాగే 863 మంది ఇళ్ల నిర్మాణాలు మొదలు పెట్టలేదు. ఊరికి చివర్లో ఈ కాలనీ లేఅవుట్లు ఉండడం, కనీస సదుపాయాలు కల్పించకపోవడంతో ఇళ్ల లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం వస్తే నరకం చూస్తున్నామని వారు వాపోతున్నారు. రోడ్లు, డ్రైనేజీలు నిర్మించకుండా, ఎటువంటి సదుపాయాలు కల్పించకుండా గత వైసీపీ ప్రభుత్వం తమకు తీరని అన్యాయం చేసిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలు శివారు ప్రాంతాల్లో ఉండడంతో ఇళ్ల నిర్మాణ సామగ్రి అపహరణకు గురవుతోందని చెబుతున్నారు.
మునిసిపాలిటీలో ఇళ్ల పరిస్థితి
మునిసిపాలిటీలోని బయపురెడ్డిపాలెం- కసిమి రోడ్డులో 915 మంది లబ్ధిదారులకు సెంటు స్థలం చొప్పున గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చింది. ఊరికి దూరంగా లేవుటు వేయడంతో ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు లబ్ధిదారులు పెద్దగా ఆసక్తి చూపలేదు. 915 మంది లబ్ధిదారుల్లో 494 మంది మాత్రమే ఇళ్లు నిర్మించుకున్నారు. 265 ఇళ్లు పునాదుల స్థాయిలో ఉండిపోయాయి. లింటల్ స్థాయిలో 39, రూఫ్ స్థాయిలో మరో 39, శ్లాబ్ లెవల్‌లో 2, ప్లింత్‌బీమ్ లెవల్ 8, వివిధ దశల్లో 68 ఉన్నాయి. ముఖ్యంగా నీటి సదుపాయం లేక ఇళ్లు కట్టుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదని కాలనీవాసులు తెలిపారు. మంచినీటి బోరు ఏర్పాటు చేసినా నీళ్లు పట్టుకోవడానికి వీలు లేకుండా ఉందని వాపోతున్నారు. గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఇబ్బందులు పడుతున్నామని, కూటమి ప్రభుత్వమైనా కాలనీలో వసతులు కల్పించాలని వారు కోరుతున్నారు.