బూరుగుబయలు వంతెన పూర్తయ్యేదెన్నడో?
ABN , Publish Date - Aug 25 , 2026 | 12:14 AM
మండలంలోని బలపం పంచాయతీ బూరుగుబయలు వంతెన నిర్మాణంలో గిరిజన సంక్షేమశాఖ అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోయింది.
నిర్మాణంలో తీవ్ర జాప్యం
వర్షాలకు కొట్టుకుపోయిన అప్రోచ్ రోడ్డు
రాకపోకలు ఇబ్బందులు
చింతపల్లి, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): మండలంలోని బలపం పంచాయతీ బూరుగుబయలు వంతెన నిర్మాణంలో గిరిజన సంక్షేమశాఖ అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో ఈ మార్గంపై రాకపోకలు సాగించేందుకు గిరిజనులు అవస్థలు పడుతున్నారు. బలపం పంచాయతీలో కోరుకొండ- వీరవరం గ్రామాలను కలుపుతూ బూరుగుబయలు గ్రామంలో వంతెన నిర్మించేందుకు కూటమి ప్రభుత్వం రూ.90లక్షల ఎస్‌సీఏ నిధులను మంజూరు చేసింది. నిధులు విడుదలై ఏడాది కావస్తున్నది. నిర్మాణ బాధ్యతలు పొందిన కాంట్రాక్టర్ ఇరువైపులా సపోర్టింగ్ గోడలు నిర్మించి శ్లాబ్ వేయలేదు. వంతెన నిర్మాణ పనులు సుమారు ఆరు నెలలు క్రితం నిలిచిపోయాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు వంతెన వద్ద రాకపోకలకు అంతరాయం కలుగకుండగా, ఏర్పాటు చేసిన అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో ఈ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఆదివాసీలు కాలినడకన పొరుగు గ్రామాలకు వెళుతున్నారు. ఈ వంతెన నిర్మాణాన్ని ఎప్పుడు పునఃప్రారంభిస్తారు?, అప్రోచ్ రోడ్డు మరమ్మతులు ఎప్పుడు చేస్తారు? అనే సమాచారం కోసం గిరిజన సంక్షేమశాఖ ఏఈఈని ‘ఆంధ్రజ్యోతి’ ఫోన్‌లో సంప్రతించగా, ఆయన స్పందించలేదు. ఇప్పటికైనా కలెక్టర్, ఐటీడీఏ పీవో స్పందించి వంతెన నిర్మాణాలు వేగవంతం చేయాలని, రాకపోకలకు అంతరాయం కలగకుండా అప్రోచ్ రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని గిరిజనులు కోరుతున్నారు.