గిరిజనులకు ఉచితంగా విత్తనాలు ఇచ్చేదెప్పుడు?
ABN , Publish Date - Jun 28 , 2026 | 12:35 AM
జిల్లాలోని పలు మండలాల్లో ఉన్న గిరిజన రైతులకు ఉచితంగా అన్ని వరి విత్తనాలు అందజేయాలని మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, పలువురు జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు కోరారు. జడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన శనివారం సమావేశమందిరంలో జడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది.
- నిలదీసిన ఎమ్మెల్యే బండారు, జడ్పీ సభ్యులు
- ఎక్కువ ధరకు అమరావతి విత్తనాలు విక్రయిస్తున్నారని ఫిర్యాదు
- ఆ విత్తనాలను వ్యవసాయ వర్సిటీ ఇంకా గుర్తించలేదని వ్యవసాయాధికారిణి వెల్లడి
- వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశం
విశాఖపట్నం, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలు మండలాల్లో ఉన్న గిరిజన రైతులకు ఉచితంగా అన్ని వరి విత్తనాలు అందజేయాలని మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, పలువురు జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు కోరారు. జడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన శనివారం సమావేశమందిరంలో జడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది. వ్యవసాయశాఖపై చర్చ సందర్భంగా మాడుగుల ఎంపీపీ రాజారాం మాట్లాడుతూ తమ మండలంలో పలు గ్రామాల్లో ఉన్న గిరిజన రైతులకు ఉచితంగా విత్తనాలు సరఫరా ఎప్పుడు చేస్తారని ప్రశ్నించారు. దీనిపై ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి జోక్యం చేసుకుని గిరిజన రైతులకు ఉచితంగా వరి విత్తనాలను పాడేరు ఐటీడీఎ అందజేస్తోందని, అయితే ఈ ఏడాది ఎంతమందికి ఇచ్చారో చెప్పాలని కోరగా, ఐటీడీఎ పీవో, ఇతర అధికారులు లేకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్పీ సమావేశానికి ఐటీడీఎ పీవో ఎందుకు రాలేదని ప్రశ్నిస్తూ, వచ్చే సమావేశానికి రావాలని లేఖ రాయాలన్నారు. గొలుగొండ, చీడికాడ, దేవరాపల్లి, రావికమతం, రోలుగొంట మండలాల్లో గిరిజనులు విత్తనాల కోసం ఎదురుచూస్తున్నారని పలువురు సభ్యులు ప్రస్తావించి, వెంటనే వరి విత్తనాలు పంపిణీ చేయాలని కోరారు.
అనుమతి లేని విత్తనాలు విక్రయిస్తే చర్యలు
దేవరాపల్లి జడ్పీటీసీ సభ్యుడు కర్రి సత్యం మాట్లాడుతూ తమ మండలంలో ఎక్కువ ధరకు అమరావతి వరి రకం విత్తనాలు అమ్ముతున్నారని ఫిర్యాదు చేశారు. అమరావతి రకం వరి విత్తనాలను వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇంకా గుర్తించలేదని అనకాపల్లి జిల్లా వ్యవసాయాధికారి ఆషాదేవి తెలపగా, ఎమ్మెల్యే బండారు జోక్యంచేసుకుని అమరావతి రకం విత్తనాలు చోడవరం, మాడుగుల ప్రాంతాల్లో రైతులకు విక్రయిస్తున్నారని చెప్పారు. అనుమతి లేని విత్తనాలను అమ్ముతుంటే ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. దీనిపై అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్ జోక్యం చేసి అనుమతి లేని విత్తనాలను అమ్ముతున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని అఽధికారులను ఆదేశించారు. ఖరీఫ్ కోసం ఎరువులు సిద్ధంగా ఉంచాలని పలువురు సభ్యులు కోరారు.
పంచదార్ల కొండపై గ్రావెల్ అక్రమ తవ్వకాలు
రాంబిల్లి మండలం పంచదార్ల గ్రామంలో కొండపై అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయని రాంబిల్లి, అచ్యుతాపురం జడ్పీటీసీ సభ్యులు ధూళి నాగరాజు, లాలం రాంబాబు ఆరోపించారు. పాండవులు అజ్ఞాతవాసంలో ఇదే కొండపై కొన్నాళ్లు ఉన్నారని పురాణాల్లో ఉందని, అంతటి పవిత్రమైన కొండ నుంచి వచ్చే జలధారాలకు ఎంతో పేరు ఉందన్నారు. కొండ చరిత్రను ధ్వంసం చేసే పనులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేయగా, అనకాపల్లి గనుల శాఖాధికారి మజ్జి శ్రీనివాసరావు వివరణ ఇస్తూ 2023లో కొండపై రెండున్నర హెక్టార్లలో తవ్వకాలకు టెండర్లు పిలిచారని తెలిపారు. వెంటనే కలెక్టర్ జోక్యం చేసుకుంటూ అనుమతి ఇచ్చిన విస్తీర్ణం మేరకు తవ్వకాలు చేస్తున్నారా?, లేదా? విచారణ జరపాలని ఆదేశించారు. చీడికాడ జడ్పీటీసీ సభ్యురాలు లాలం శారదా జానకిరామ్ మాట్లాడుతూ మండలంలో వైద్యులు, నర్సుల కొరత ఉందని, ఇద్దరు వైద్యుల్లో ఒకరిని అనకాపల్లికి డిప్యూటేషన్ వేయడంతో రోగులకు సేవలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బుచ్చెయ్యపేట జడ్పీటీసీ సభ్యుడు దొండా రాంబాబు మాట్లాడుతూ జిల్లాలో ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించగా, కలెక్టర్ స్పందించి నిబంధనలకు విరుద్ధంగా రోగులను ఇబ్బందిపెట్టే ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌వో హైమావతిని ఆదేశించారు. పరవాడ జడ్పీటీసీ సభ్యుడు పైల సన్యాసిరాజు మాట్లాడుతూ పరవాడ పీహెచ్‌సీకి అంబులెన్స్ మంజూరుచేయాలని కోరగా, కలెక్టర్ అంగీకరించారు. గ్రామ పంచాయతీలో శానిటేషన్, మరమ్మతులకు నిధులు లేవని కార్యదర్శులు, స్పెషలాఫీసర్లు చెబుతున్నారని పరవాడ జడ్పీటీసీ సభ్యుడు పైల సన్యాసిరాజు ఫిర్యాదు చేయగా, అనకాపల్లి డీపీవో సందీప్ బదులిస్తూ నిధుల సమస్యలేదని వివరణ ఇచ్చారు. అసంపూర్తిగా ఉన్న అంగన్‌వాడీ భవనాలను వెంటనే పూర్తిచేయాలని కోరగా, ఇప్పటికే పలు భవనాలకు నిధులు ఇచ్చామని చైర్‌పర్సన్ సుభద్ర తెలిపారు. సమావేశంలో విశాఖ జాయింట్ కలెక్టర్ జి.విద్యాధరి, జడ్పీ వైస్‌చైర్మన్ సుంకరి గిరిబాబు, సీఈవో పి.నారాయణమూర్తి, రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్ పీవీజీ కుమార్, గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ల సురేంద్ర, తదితరులు పాల్గొన్నారు.