అసంపూర్తి నిర్మాణాలకు మోక్షమెన్నడో?
ABN , Publish Date - Oct 01 , 2026 | 12:21 AM
అరకు నియోజకవర్గంలోని మూడు మండలాల్లో అసంపూర్తి నిర్మాణాలు దర్శనమిస్తున్నాయి. జన్‌మన్ పథకం కింద రెండేళ్ల క్రితం మంజూరైన పనులు ముందుకు సాగడం లేదు.
రెండేళ్ల క్రితం మూడు మండలాల పరిధిలో 27 రోడ్లు మంజూరు
జన్‌మన్ పథకం కింద రూ.46.34 కోట్లు విడుదల
మూడు నెలల క్రితం అర్ధంతరంగా నిలిచిపోయిన పనులు
పీఆర్ ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని విమర్శలు
అరకులోయ, అనంతగిరి, డుంబ్రిగుడ మండలాల వాసులకు తప్పని ఇబ్బందులు
అరకులోయ, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): అరకు నియోజకవర్గంలోని మూడు మండలాల్లో అసంపూర్తి నిర్మాణాలు దర్శనమిస్తున్నాయి. జన్‌మన్ పథకం కింద రెండేళ్ల క్రితం మంజూరైన పనులు ముందుకు సాగడం లేదు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమనే విమర్శలు వినవస్తున్నాయి. రహదారులు, వంతెనల నిర్మాణం పూర్తయి తమకు రవాణా కష్టాలు తీరతాయని ఆశించిన ప్రజలకు నిరాశే మిగిలింది.
నియోజకవర్గంలోని అరకులోయ, అనంతగిరి, డుంబ్రిగుడ మండలాల పరిధిలో రెండేళ్ల క్రితం 27 రహదారులు, పలు చోట్ల వంతెనల నిర్మాణానికి రూ.46.34 కోట్లు మంజూరయ్యాయి. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం పర్యవేక్షణలో సుమారు 50 కిలోమీటర్ల మేర బీటీ రోడ్ల నిర్మాణాలను ఈ ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతగిరి మండలం కోనాపురం గ్రామ పంచాయతీ పరిధి కోనాపురం వయా బొందుగుడ-సారగుడ లిడ్డంగి వరకు 5.35 కిలోమీటర్ల మేర రహదారికి సుమారు రూ.4.89 కోట్లు, గేటువలస- లోతేరు రోడ్డు నుంచి బొండ్యాగుడ మీదుగా బొండాం కొత్తవలస వరకు 2.95 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డుకు రూ.2.69 కోట్లు మంజూరయ్యాయి. ఈ రహదారుల పనులను కాంట్రాక్టర్ గత ఏడాదే ప్రారంభించి మూడు నెలల క్రితం కంకర వేసి తారు వేయకుండా వదిలేశారు. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు కంకర మొత్తం పైకి లేచి ప్రమాదకరంగా మారింది. అలాగే అరకులోయ మండలం లోతేరు గ్రామ పంచాయతీ పరిధి దంసానివలస నుంచి లండిగుడ గ్రామం వరకు 0.65 కిలోమీటర్ల మేర తారు వేయాల్సి ఉంది. లండిగుడ గ్రామ సమీపంలో వాగుపై వంతెన నిర్మాణం కూడా అసంపూర్తిగా ఉంది. లోతేరు పంచాయతీ పరిధి ముసిరిగుడ గ్రామం నుంచి దంసానివలస వరకు గల సుమారు 3.4 కిలోమీటర్లకు రూ.3.39 కోట్లు మంజూరు చేశారు. ఈ రోడ్డుపై మట్టి పని చేసి 8 నెలల క్రితం వదిలేశారు. అలాగే దూదుకొండివద్ద గెడ్డపై వంతెన నిర్మాణం అర్ధంతరంగా నిలిచి పోయింది. ఈ పనులన్నీ ఈ ఏడాది మార్చిలోనే పూర్తికావలసి ఉన్నా ఇప్పటికీ అసంపూర్తిగానే ఉన్నాయి. అనంతగిరి మండలం పినకోట, పెదకోట, కివర్ల పంచాయతీ పరిధిలో పలు రహదారులు నిర్మాణాలు కూడా పూర్తి కాలేదు. డుంబ్రిగుడ మండం పరిధిలో పీఎం జన్‌మన్ పథకంలో 13 రహదారుల పనులు జరుగుతున్నాయి. వీటిలో అధిక శాతం అసంపూర్తిగా ఉన్నాయి. దీని వల్ల ఆయా మండలాల ప్రజలు ఇబ్బందులు పడుతు న్నారు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి ఈ నిర్మాణాల పూర్తికి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. దీనిపై పంచాయతీరాజ్ ప్రాజెక్ట్స్ ఈఈ ఎస్.రామకృష్ణ వివరణ కోరగా, కొన్ని పనులు అక్టోబరు నాటికి, మరికొన్ని పనులు వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.