Share News

అసంపూర్తి నిర్మాణాలకు మోక్షమెన్నడో?

ABN , Publish Date - Jul 27 , 2026 | 11:23 PM

జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల అదనపు తరగతి గదుల నిర్మాణాలు నాలుగేళ్ల క్రితం అర్థంతరంగా నిలిచిపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. చాలీచాలని తరగతి గదుల్లో అవస్థలు పడుతున్నారు.

అసంపూర్తి నిర్మాణాలకు మోక్షమెన్నడో?
అసంపూర్తిగా ఉన్న కొయ్యూరు మండలం బాలారం జడ్పీ హైస్కూల్‌ అదనపు తరగతి గదుల నిర్మాణం

కొయ్యూరు మండలం బాలారం, అరకు మండలం లోతేరు హైస్కూళ్లలో పూర్తికాని అదనపు తరగతి గదుల నిర్మాణం

వరండాల్లోనే కొనసాగుతున్న విద్యాభ్యాసం

విద్యార్థులకు తప్పని కష్టాలు

కొయ్యూరు, జూలై 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల అదనపు తరగతి గదుల నిర్మాణాలు నాలుగేళ్ల క్రితం అర్థంతరంగా నిలిచిపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. చాలీచాలని తరగతి గదుల్లో అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా కొయ్యూరు మండలం బాలారం జడ్పీ హైస్కూల్‌, అరకులోయ మండలం లోతేరులోని టీడబ్ల్యూ ఆశ్రమోన్నత పాఠశాలలో సమస్య తీవ్రంగా ఉంది.

కొయ్యూరు మండలంలోని బాలారం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఎనిమిది అదనపు తరగతి గదుల భవన నిర్మాణానికి గత వైసీపీ ప్రభుత్వం రూ.40 లక్షలు మంజూరు చేసింది. ఈ పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌ శ్లాబ్‌ వరకు చేశారు. అయితే బిల్లులు విడుదల కాకపోవడంతో అర్థంతరంగా పనులు నిలిపివేశారు. దీంతో గత నాలుగేళ్లుగా అసంపూర్తి భవనం దర్శనమిస్తోంది. తరగతి గదులు చాలక విద్యార్థులు వరండాల్లో విద్యాభ్యాసం చేయాల్సిన దుస్థితి నెలకొంది. అలాగే మరుగుదొడ్ల నిర్మాణం కూడా పూర్తికాకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి ఈ నిర్మాణాలు పూర్తి చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

లోతేరు టీడబ్ల్యూ హైస్కూల్‌లో..

అరకులోయ: మండలంలోని లోతేరులో గల గిరిజన సంక్షేమశాఖ బాలుర ఆశ్రమోన్నత పాఠశాలలో చాలీచాలని తరగతి గదులతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఏడేళ్ల క్రితం ప్రారంభించిన అదనపు తరగతి గదుల భవన నిర్మాణాలు నిధుల కొరత వల్ల నిలిచిపోవడంతో విద్యార్థులకు కష్టాలు తప్పడం లేదు. వసతి గృహ భవన సముదాయంతో పాటు అదనపు తరగతి గదుల భవన నిర్మాణాలు శ్లాబ్‌ వరకు చేపట్టినా ఆ తరువాత ముందుకు సాగలేదు. కాంట్రాక్టర్‌కు బిల్లులు విడుదల చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని తెలిసింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ నిర్మాణాలను పూర్తి చేయాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Jul 27 , 2026 | 11:23 PM