ఎప్పటికి దారికొచ్చేనో?
ABN , Publish Date - Jun 16 , 2026 | 10:52 PM
దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న చందంగా ఉంది లంబసింగి రహదారి పరిస్థితి. ఆంధ్ర కశ్మీర్ లంబసింగికి సమీపంలో ఉన్న ప్రముఖ పర్యాటక కేంద్రం చెరువులవేనం రహదారి నిర్మాణానికి కూటమి ప్రభుత్వం గత ఏడాది జనవరిలో 2.4 కోట్ల పీఎం జన్‌మన్ నిధులను మంజూరు చేసింది.
అధ్వానంగా చెరువులవేనం రహదారి
ఏడాదిన్నర క్రితం రోడ్డు నిర్మాణానికి రూ.2.4 కోట్లు మంజూరు చేసిన కూటమి ప్రభుత్వం
అటవీ శాఖ అనుమతులు ఇవ్వక ప్రారంభంకాని పనులు
మరో మూడు నెలల్లో ప్రారంభంకానున్న పర్యాటక సీజన్
అప్పట్లోగా పూర్తయితే పర్యాటకులు, స్థానికులకు ఎంతో మేలు
చింతపల్లి, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న చందంగా ఉంది లంబసింగి రహదారి పరిస్థితి. ఆంధ్ర కశ్మీర్ లంబసింగికి సమీపంలో ఉన్న ప్రముఖ పర్యాటక కేంద్రం చెరువులవేనం రహదారి నిర్మాణానికి కూటమి ప్రభుత్వం గత ఏడాది జనవరిలో 2.4 కోట్ల పీఎం జన్‌మన్ నిధులను మంజూరు చేసింది. పంచాయతీరాజ్ ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు. ఏడాదిన్నర గడిచినా అటవీశాఖ అనుమతులు మంజూరు చేయకపోవడంతో ఇప్పటికీ పనులు ప్రారంభంకాలేదు. ప్రస్తుతం రహదారి అధ్వానంగా తయారైంది. దీంతో స్థానిక గిరిజనులు, పర్యాటకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
పాడేరు రెవెన్యూ డివిజన్ పరిధిలో 2025లో మంజూరైన పీఎం జన్‌మన్ రహదారుల నిర్మాణ పనులన్నీ ప్రారంభమయ్యాయి. కేవలం చెరువులవేనం రహదారి పనులు మాత్రమే ప్రారంభంకాలేదు. పంచాయతీరాజ్ ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు రహదారి నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు. అనుమతులు కోరుతూ అటవీశాఖ అధికారులకు ఇంజనీరింగ్ అధికారులు లేఖ రాశారు. దీంతో చింతపల్లి డివిజన్ అటవీశాఖ ఉన్నతాధికారులు వెంటనే సర్వే పూర్తి చేసి అనుమతుల ఫైల్‌ను గత ఏడాది జూన్‌లో రాష్ట్ర ఉన్నతాధికారులకు పంపించారు. అయితే ఇప్పటి వరకు అనుమతుల మంజూరుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
చినుకు పడితే రోడ్డు బురదమయం
చెరువులవేనం రోడ్డు అధ్వానంగా ఉండడంతో స్థానిక ఆదివాసీలు, పర్యాటకులు ఇబ్బంది పడుతున్నారు. చినుకుపడితే రహదారి బురదమయమైపోయి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీంతో ఆదివాసీలు, సందర్శకులు కాలినడకన వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. మరో మూడు నెలల్లో పర్యాటక సీజన్ ప్రారంభం కానున్నది. చెరువులవేనం ప్రకృతి అందాలను వీక్షించేందుకు భారీ సంఖ్యలో పర్యాటకులు తరలివస్తారు. పర్యాటక సీజన్ ప్రారంభానికి ముందుగానే రహదారి నిర్మాణం చేపడితే సందర్శకులు, ఆదివాసీలకు ఉపయోగకరంగా వుంటుంది. ఈ సమస్యను స్థానికులు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకుండాపోయింది. ఇప్పటికైనా కలెక్టర్, అటవీశాఖ ఉన్నతాధికారులు స్పందించి పర్యాటక సీజన్ ప్రారంభానికి ముందుగా రహదారి నిర్మాణం పూర్తి చేయాలని స్థానికులు, పర్యాటకులు కోరుతున్నారు.