Share News

స్పెషల్‌ డ్రైవ్‌ పరీక్షలు ఎప్పుడో!

ABN , Publish Date - May 05 , 2026 | 12:52 AM

ఆంధ్ర విశ్వవిద్యాలయం స్పెషల్‌ డ్రైవ్‌ పరీక్షల నిర్వహణలో తాత్సారం చోటుచేసుకుంటోంది.

స్పెషల్‌ డ్రైవ్‌ పరీక్షలు ఎప్పుడో!

  • డిగ్రీ, పీజీ, ప్రొఫెషనల్‌ కోర్సుల్లో బ్యాక్‌లాగ్స్‌ ఉన్నవారికి ఏయూ మరో అవకాశం

  • సుమారు పది వేల దరఖాస్తులు రాక

  • పరీక్షల నిర్వహణపై కొరవడిన స్పష్టత

  • విడుదల కాని షెడ్యూల్‌

  • వేగంగా ప్రక్రియను పూర్తి చేయాలని కోరుతున్న విద్యార్థులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ఆంధ్ర విశ్వవిద్యాలయం స్పెషల్‌ డ్రైవ్‌ పరీక్షల నిర్వహణలో తాత్సారం చోటుచేసుకుంటోంది. 2010-2025 మధ్య డిగ్రీ, పీజీ, ప్రొఫెషనల్‌ కోర్సులు చదివిన విద్యార్థులెవరికైనా బ్యాగ్‌లాగ్స్‌ (పాస్‌కాని సబ్జెక్టులు) ఉన్నట్టయితే స్పెషల్‌ డ్రైవ్‌ పేరిట మరో అవకాశం కల్పించాలని వర్సిటీ అధికారులు నిర్ణయించి, డిసెంబరులో నోటిఫికేషన్‌ ఇచ్చారు. రిజిస్ర్టేషన్‌కు మార్చి రెండో వారం వరకూ అవకాశం కల్పించారు. సుమారు పది వేల దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో సబ్జెక్టుకు (థియరీ) రూ.1,500 చొప్పున రెండు నుంచి ఐదు సబ్జెక్టులకు ఫీజు కట్టినవారు ఉన్నారు. దరఖాస్తుల్లో దాదాపు 60 శాతం వరకు డిగ్రీ, మరో 30 శాతం పీజీ కోర్సులకు సంబంధించినవి ఉన్నట్టు చెబుతున్నారు. మిగిలినవి ప్రొఫెషనల్‌ కోర్సులు అయిన ఎంపీఈడీ, బీపీఈడీ, లా వంటి కోర్సులవి ఉన్నట్టు చెబుతున్నారు. దరఖాస్తు గడువు పూర్తయి దాదాపు ఆరు వారాలు కావస్తోంది. ఇంతవరకూ పరీక్షల షెడ్యూల్‌ విడుదల కాలేదు. వర్సిటీ అధికారులను కలిసి పరీక్షల నిర్వహణకు సంబంధించిన సమాచారం అడుగుతున్నా ఏమీ చెప్పడం లేదని దరఖాస్తుదారులు చెబుతున్నారు.

మరింత సమయం పట్టే చాన్స్‌

తొలుత ఏప్రిల్‌ తొలి వారంలో పరీక్షలు నిర్వహించాలని అధికారులు భావించారు. అయితే, భారీగా దరఖాస్తులు రావడంతో వాటిని స్ర్కూట్నీ చేసేందుకు కొంత సమయం పట్టింది. ఆ తరువాత అధికారులు శతాబ్ది ఉత్సవాలు నిర్వహణలో తలమునకలు కావడంతో ఈ ప్రక్రియ ముందుకుసాగని పరిస్థితి ఏర్పడింది. మే నెలలో అయినా పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తారని అంతా భావించారు. అయితే, ప్రస్తుతం రెగ్యులర్‌ కోర్సులకు సంబంధించిన పరీక్షలు జరుగుతుండడంతో స్పెషల్‌ డ్రైవ్‌ పరీక్షలు నిర్వహించకపోవచ్చునని చెబుతున్నారు. స్పెషల్‌ డ్రైవ్‌ పరీక్షలకు మరింత సమయం పట్టే అవకాశం ఉందంటున్నారు. అయితే, వీలైనంత వేగంగా పరీక్షలు నిర్వహించాలని అభ్యర్థులు కోరుతున్నారు.

దరఖాస్తుకు అవకాశం

స్పెషల్‌ డ్రైవ్‌ పరీక్షలు రాయాలనుకునే అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు మార్చి రెండో వారం వరకు అవకాశం కల్పించారు. అయితే, ఇంకా ఎవరైనా విద్యార్థులు పరీక్షలు రాయాలని భావిస్తే కొంత అపరాధ రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చునని అధికారులు చెబుతున్నారు. కొద్దిరోజుల్లో పరీక్షలు షెడ్యూల్‌ విడుదల చేస్తామని పేర్కొంటున్నారు.

Updated Date - May 05 , 2026 | 12:52 AM