దశాబ్దాల నాటి కల నెరవేరిన వేళ..
ABN , Publish Date - Jun 03 , 2026 | 12:18 AM
మండలంలోని కోర్రా పంచాయతీ శెట్టి బంధ గ్రామ ప్రజల దశాబ్దాల నాటి కల నెరవేరింది. రహదారి సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్న ఆ గ్రామానికి కూటమి ప్రభుత్వం దారి చూపింది. దీంతో ఇప్పుడు వారంతా ఆనందంగా రాకపోకలు సాగిస్తున్నారు.
రూ.1.1 కోట్లతో శెట్టిబంధ నుంచి పెదపాడుకు రహదారి నిర్మాణం
తీరిన రవాణా ఇబ్బందులు
కూటమి ప్రభుత్వంలో తమ కష్టాలు తీరాయని గ్రామస్థుల ఆనందం
డుంబ్రిగుడ, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కోర్రా పంచాయతీ శెట్టి బంధ గ్రామ ప్రజల దశాబ్దాల నాటి కల నెరవేరింది. రహదారి సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్న ఆ గ్రామానికి కూటమి ప్రభుత్వం దారి చూపింది. దీంతో ఇప్పుడు వారంతా ఆనందంగా రాకపోకలు సాగిస్తున్నారు.
మండలంలోని కోర్రా పంచాయతీ శెట్టిబంధ గ్రామంలో 40 కుటుంబాలు నివాసముంటున్నాయి. ఆ గ్రామానికి ఇప్పటి వరకు రహదారి సౌకర్యం లేకపోవడంతో గ్రామస్థులు నడిచి వెళ్లేవారు. కొండలు, గుట్టలు ఎక్కి సమీపంలోని పెదపాడు చేరుకునేవారు. అక్కడ నుంచి రహదారి సౌకర్యం ఉండడంతో వాహనాల్లో వెళ్లేవారు. అయితే గ్రామంలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే ఆస్పత్రికి తరలించాలంటే ఇబ్బందులు ఎదురయ్యేవి. ఎన్ని ప్రభుత్వాలు మారినా వీరి సమస్య పరిష్కారం కాలేదు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక వీరి చిరకాల కోరిక నెరవేరింది. శెట్టిబంధ నుంచి పెదపాడు వరకు 1.1 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణానికి ప్రభుత్వం రూ.1.1 కోట్లు మంజూరు చేసింది. గత ఏడాది ఏప్రిల్‌లో రహదారి నిర్మాణ పనులను ప్రారంభించగా, రెండు రోజుల క్రితం పనులు పూర్తయ్యాయి. దీంతో గ్రామస్థులు హాయిగా రాకపోకలు సాగిస్తున్నారు. దశాబ్దాల నాటి తమ కలను నెరవేర్చినందుకు కూటమి ప్రభుత్వానికి గ్రామస్థులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.