శిథిలమైనా చలనమేది?
ABN , Publish Date - Jun 21 , 2026 | 10:58 PM
మండలంలోని పలు ప్రాథమిక పాఠశాలల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో చాలా వరకు గ్రామస్థులు ఏర్పాటు చేసిన పాకల్లో కొనసాగుతున్నాయి. కనీస వసతులు లేక ఇబ్బందుల మధ్య విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు.
కూలిపోయేందుకు సిద్ధంగా మండలంలోని పలు ప్రాథమిక పాఠశాలల భవనాలు
చాలా వరకు గ్రామస్థులు ఏర్పాటు చేసిన పాకల్లోనే కొనసాగింపు
కనీస వసతులు లేక విద్యార్థుల అవస్థలు
పట్టించుకోని అధికారులు
కొయ్యూరు జూన్ 21 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పలు ప్రాథమిక పాఠశాలల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో చాలా వరకు గ్రామస్థులు ఏర్పాటు చేసిన పాకల్లో కొనసాగుతున్నాయి. కనీస వసతులు లేక ఇబ్బందుల మధ్య విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు.
మండలంలోని గుమ్మళ్లపాలెం, బంగారమ్మపేట, పనసలపాడు, చీడిపల్లి, నల్లబిల్లి, తదితర గ్రామాల్లో పలు ప్రాథమిక పాఠశాలల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. గుమ్మళ్లపాలెంలో పాఠశాల భవనాన్ని ఎనిమిదేళ్ల క్రితం కూల్చివేసినా ఇప్పటి వరకు పునర్నిర్మించకపోవడంతో గ్రామస్థులు ఏర్పాటు చేసిన పాకలోనే కొనసాగుతోంది. బంగారమ్మపేట పాఠశాలకు మూడు దశాబ్దాల క్రితం నిర్మించిన భవనం శిథిలం కాగా, దాని పక్కనే 15 సంవత్సరాల క్రితం మరో భవనం నిర్మించారు. అయితే ఆ భవనంలో వసతి చాలక వరండాలోనూ, చెట్లు నీడన విద్యార్థులకు పాఠాలు బోధించాల్సి వస్తోంది. మాలమాకవరం పంచాయతీ పనసలపాడు గ్రామంలోని గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాల భవనం ఆరేళ్ల క్రితం శిథిలావస్థకు చేరింది. దీంతో గ్రామస్థులు ఆ భవనం పక్కనే అప్పట్లో తాత్కాలికంగా పాకను ఏర్పాటు చేశారు. ఇప్పటికీ అందులోనే పాఠశాల కొనసాగుతోంది. బూదరాళ్ల పంచాయతీ చీడిపల్లిలో ఏడు సంవత్సరాల క్రితమే పాఠశాల భవనం రేకులు ధ్వంసం కాగా, అందులోనే తరగతులు కొనసాగిస్తున్నారు. గొర్రెలమెట్ట పాఠశాల భవనం రేకులు గత సంవత్సరం ఈదురుగాలులకు ఎగిరిపోగా, స్థానిక చర్చి ఆవరణలో పాఠశాల కొనసాగుతోంది. అలాగే నల్లబిల్లి పాఠశాల భవన నిర్మాణం పూర్తికాకపోవడంతో వంట షెడ్డులో తరగతులు నిర్వహిస్తున్నారు. మండలంలోని చుట్టుబంధ, తోటలూరు, వెలగలపాలెం, బకులూరుతో పాటు మరో 10 పాఠశాలల భవనాలు శిథిలావస్థకు చేరి ఏ క్షణాన కూలుతాయో తెలియని పరిస్థితి ఉంది. దీనిపై ఎంఈవో సింహాచలాన్ని వివరణ కోరగా, శిథిలావస్థకు చేరిన భవనాల పునర్నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, త్వరలో నిధులు మంజూరయ్యే అవకాశం ఉందన్నారు. అసంపూర్తి భవన నిర్మాణాల కూడా నిధులు వచ్చిన వెంటనే పనులు చేపడతామని పేర్కొన్నారు.