Share News

ఇదేం చెత్త పని?

ABN , Publish Date - Jul 06 , 2026 | 12:49 AM

మునిసిపాలిటీ ప్రజారోగ్య విభాగం అధికారుల నిర్లక్ష్యం పట్టణ వాసులకు శాపంగా మారింది. వీధులను శుభ్రం చేసిన సిబ్బంది వాహనాల్లో తరలించకుండా కుప్పలుగా పోగుచేసి నిప్పు పెడుతుండడంతో పట్టణ వాసులు అసౌకర్యానికి గురవుతున్నారు. దట్టంగా పొగ వెదజల్లుతుండడంతో వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు. అధి కారులు పట్టించుకోకపోవడంతో అవస్థలు పడుతున్నా మని వాపోతున్నారు.

ఇదేం చెత్త పని?
ఎలమంచిలి గాంధీనగర్‌లో రోడ్డు పక్కన చెత్తను కుప్పకు నిప్పుపెట్టడంతో ఎగుస్తున్న పొగ

- వీధుల్లో చెత్తకు నిప్పు పెడుతున్న పారిశుధ్య సిబ్బంది

- దట్టంగా పొగ వ్యాపిస్తుండడంతో జనం ఉక్కిరిబిక్కిరి

- పట్టించుకోని అధికారులు

ఎలమంచిలి, జూలై 5 (ఆంధ్రజ్యోతి): మునిసిపాలిటీ ప్రజారోగ్య విభాగం అధికారుల నిర్లక్ష్యం పట్టణ వాసులకు శాపంగా మారింది. వీధులను శుభ్రం చేసిన సిబ్బంది వాహనాల్లో తరలించకుండా కుప్పలుగా పోగుచేసి నిప్పు పెడుతుండడంతో పట్టణ వాసులు అసౌకర్యానికి గురవుతున్నారు. దట్టంగా పొగ వెదజల్లుతుండడంతో వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు. అధి కారులు పట్టించుకోకపోవడంతో అవస్థలు పడుతున్నా మని వాపోతున్నారు.

పట్టణంలో రోజూ పారిశుధ్య కార్మికులు ఇంటింటా తడి, పొడి చెత్తను సేకరించి వాహనాల్లో డంపింగ్‌ యార్డుకు తరలిస్తున్నారు. అయితే అధిక శాతం వీధుల్లో మాత్రం ఇలా జరగడం లేదు. చెత్తను వీధుల్లోనే కుప్పలుగా పోసి నిప్పు పెడుతున్నారు. ప్లాస్టిక్‌ వ్యర్థాలను సైతం కాల్చివేస్తున్నారు. ముఖ్యంగా పట్టణంలోని ప్రధాన రోడ్డు మీదుగా, మార్కెట్‌ అనుసంధాన వీధుల్లో చెత్తకు నిప్పు పెడుతున్నారు. దీంతో పొగ దట్టంగా వ్యాపిస్తోంది. ఈ పొగను పీల్చిన వారిలో వృద్ధులు, చిన్నారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పారిశుధ్య పనులను పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తు న్నాయి. ఇకనైనా వీధుల్లో చెత్తకు నిప్పు పెట్టకుండా చెత్తను వాహనాల్లో డంపింగ్‌ యార్డుకు తరలించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

పాయకరావుపేటలో...

పాయకరావుపేట రూరల్‌: మండలంలోని సత్యవరం- పెదరాంభద్రపురం రోడ్డులోని తాండవ బ్రిడ్జి సమీపంలో రోడ్డు పక్కన చెత్త వేస్తుండడంతో డంపింగ్‌ యార్డులా తయారైంది. ఈ ప్రాంతానికి మండలంలోని కొన్ని గ్రామాల నుంచి చెత్తను తీసుకు వచ్చి కాలుస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. దీంతో ఒక్కోసారి రసాయనాల వాసనలు వస్తున్నాయని, ఈ మార్గంలో ప్రయాణించాలంటే ఇబ్బందులు పడుతున్నామని వాహనచోదకులు చెబుతున్నారు. అలాగే చెత్తతో సాగునీటి కాలువను కప్పేస్తున్నారని, దీని వల్ల తుఫానుల సమయంలో పంట పొలాలు మునిగిపోయే ప్రమాదం ఉందని పెదరాంభద్రపురానికి చెందిన రైతులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి ఈ ప్రాంతంలో చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Updated Date - Jul 06 , 2026 | 12:49 AM