Share News

రబీ సాగుకు నీరేది?

ABN , Publish Date - Jan 23 , 2026 | 12:14 AM

మన్యంలో రబీ సీజన్‌లో పంటల సాగుకు నీటి సమస్య ఏర్పడుతున్నది. దీంతో ఖరీఫ్‌లో మాత్రమే వ్యవసాయం సంపూర్ణంగా జరుగుతుండగా, రబీ సీజన్‌లో ఆశించిన స్థాయిలో వ్యవసాయాన్ని చేయలేకపోతున్నామని గిరి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిరిజన ప్రాంతంలో వ్యవసాయానికి పాలకులు సంపూర్ణంగా సహకరించని పరిస్థితి చాలా ఏళ్లుగా కొనసాగుతున్నది. ఫలితంగా రబీ సీజన్‌లో వరి పంటకు సాగునీరు లేని దుస్థితి ఏర్పడుతున్నది.

రబీ సాగుకు నీరేది?
హుకుంపేట మండలం కొట్నాపల్లి ప్రాంతంలో పంట పొలాల్లో సంచరిస్తున్న పశువులు

- మన్యంలో రబీ వరి సాగుకు నీటి కష్టాలు

- వర్షాధారంతోనే గిరి రైతుల పంటలు

- ఖరీఫ్‌లో 48 వేల హెక్టార్లలో సాగు

- రబీలో 8 వేల హెక్టార్లకే పరిమితం

- సాగునీటి వనరులు అభివృద్ధి చేయాలని ఆదివాసీలు వేడుకోలు

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

మన్యంలో రబీ సీజన్‌లో పంటల సాగుకు నీటి సమస్య ఏర్పడుతున్నది. దీంతో ఖరీఫ్‌లో మాత్రమే వ్యవసాయం సంపూర్ణంగా జరుగుతుండగా, రబీ సీజన్‌లో ఆశించిన స్థాయిలో వ్యవసాయాన్ని చేయలేకపోతున్నామని గిరి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిరిజన ప్రాంతంలో వ్యవసాయానికి పాలకులు సంపూర్ణంగా సహకరించని పరిస్థితి చాలా ఏళ్లుగా కొనసాగుతున్నది. ఫలితంగా రబీ సీజన్‌లో వరి పంటకు సాగునీరు లేని దుస్థితి ఏర్పడుతున్నది.

ఏజెన్సీ ప్రాంతంలో సాగునీటి సదుపాయాలు సంపూర్ణంగా లేకపోవడంతో గిరిజన రైతులు వర్షాధారంగా మాత్రమే తమ పంటలను సాగు చేస్తున్నారు. ఏజెన్సీలో వాణిజ్యపరంగా కాకపోయినప్పటికీ గిరిజన రైతులు తమ ప్రధాన ఆహార అవసరాల కోసం వరి పంటను సాగు చేస్తుంటారు. అయితే అధిక శాతం పంటలన్నీ వర్షాధారంగానే పండిస్తుంటారు. మే, జూన్‌, జూలై నెలల్లో ఏజెన్సీలో వర్షాలు కురుస్తుంటాయి. దీంతో ఖరీఫ్‌ వరి పంటలకు సాగు నీటి సమస్య తలెత్తదు. ఎక్కడ చూసినా నీటి వనరులు అందుబాటులో వుండడంతో ఖరీఫ్‌ సీజన్‌లో వరి పంట ఆశాజనకంగానే ఉంటుంది. అందువల్లే ఏజెన్సీలో ఖరీఫ్‌ సీజన్‌లో అధిక విస్తీర్ణంలో 48 వేల హెక్టార్లలో వరిని పండిస్తారు. కానీ ఆ తర్వాత నుంచి వర్షాల సీజన్‌ ముగియడంతో రబీలో పంటల సాగుకు నీటి సమస్య నెలకొంటున్నది. అయితే వర్షాలు కాకుండా ఇతర సాగునీటి సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో రబీ సీజన్‌లో ఆశించిన స్థాయిలో పంటల సాగును చేపట్టలేకపోతున్నారు. ముఖ్యంగా గిరిజనులకు అవసరమైన వరి సాగు సైతం పరిమితమైపోతున్నది. అందువల్లే రబీ సీజన్‌లో వరి సాగు కేవలం 8 వేల హెక్టార్లకే పరిమితమైపోతున్నది.

సాగునీరు లేమితో పాటు పశువుల సంచారం

మన్యంలో రబీ సీజన్‌లో వరి పంటను సాగు చేసేందుకు సాగునీటి సమస్య మొదటి కాగా, పశువుల సంచారం రెండో సమస్యగానే మారింది. రబీ సీజన్‌లో వర్షాలు, సాగునీరు అందుబాటులో లేక అనేక మంది రైతులు వరిని పండించని పరిస్థితి కొనసాగుతున్నది. దీంతో రబీలో పంటల సాగు ఉండదనే ఆలోచనతో గిరిజనులు తమ పశువులను స్వేచ్ఛగా వదిలేస్తారు. పశువులన్నీ పంట పొలాలు, కాస్త పచ్చిక ఉన్న ప్రదేశాల్లో సంచరిస్తాయి. ఒకవేళ అనుకోని విధంగా రబీలో పంటలు వేసినా పొలాల్లోకి సైతం పశువులు చొరబడి పంటలను నాశనం చేస్తుంటాయి. దీంతో రబీలో పంట వేసినా పశువులు సంచరిస్తాయనే భయంతో గిరి రైతులు రబీ వరిపై అంతగా దృష్టిసారించడం లేదని తెలుస్తున్నది. కాగా ఏజెన్సీలో రబీ సీజన్‌లో పంటలకు అవసరమైన సాగునీటి సదుపాయాలను కల్పించాలని గిరిజన రైతులు కోరుతున్నారు.

Updated Date - Jan 23 , 2026 | 12:14 AM