పూర్తయ్యే మార్గమేది?
ABN , Publish Date - Apr 14 , 2026 | 12:30 AM
మండలంలోని బోడిదేముడుమెట్ట నుంచి పోకలపాలెం వరకు రహదారి నిర్మాణ పనులు రెండేళ్ల క్రితం నిలిచిపోవడంతో వాహనచోదకులు ఇబ్బందులు పడుతు న్నారు.
రెండేళ్ల క్రితం అర్ధంతరంగా నిలిచిన బోడిదేముడుమెట్ట- పోకలపాలెం రోడ్డు పనులు
వర్షాలకు పలు చోట్ల కొట్టుకుపోయిన మట్టి
నాలుగు గ్రామాల ప్రజలకు తప్పని రవాణా కష్టాలు
కొయ్యూరు, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి): మండలంలోని బోడిదేముడుమెట్ట నుంచి పోకలపాలెం వరకు రహదారి నిర్మాణ పనులు రెండేళ్ల క్రితం నిలిచిపోవడంతో వాహనచోదకులు ఇబ్బందులు పడుతు న్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో బిల్లులు సక్రమంగా మంజూరుకాకపోవడంతో కాంట్రాక్టర్ చేతు లెత్తేయడం వలన ఈ రహదారి అసంపూర్తిగా దర్శనమిస్తోంది.
మండలంలోని బూదరాళ్ల పంచాయతీ బోడిదేముడుమెట్ట నుంచి పోకలపాలెం వరకు కొత్తపల్లి, చల్దిగెడ్డ, చీడిపల్లి, పోకలపాలెం గ్రామాలను కలుపుతూ సుమారు నాలుగు కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు నిర్మాణానికి 2024లో గత వైసీపీ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దీంతో గిరిజన సంక్షేమశాఖ ఇంజనీరింగ్ విభాగం అధికారుల పర్యవేక్షణలో రహదారి నిర్మాణంలో భాగంగా కాంట్రాక్టర్ మట్టి పనులు చేశారు. ఇంకా కల్వర్టులు నిర్మించాల్సి ఉంది. అయితే బిల్లులు సక్రమంగా మంజూరుకాకపోవడంతో కాంట్రాక్టర్ పనులను నిలిపివేశారు. కాగా రెండేళ్లుగా కురుస్తున్న వర్షాలకు బోడిదేముడుమెట్ట నుంచి పోకలపాలెం వరకు పలుచోట్ల మట్టి కోతకు గురై రాకపోకలకు ఇబ్బందిగా మారింది. వర్షా కాలం వస్తే రహదారి పూర్తిగా బురదమయంగా మారి నడిచి వెళ్లినా మోకాలు లోతు దిగబడిపోతుంది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి ఈ రహదారి నిర్మాణాన్ని పూర్తి చేయాలని నాలుగు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.