Share News

డీఆర్‌ డిపోలపై పర్యవేక్షణేది?

ABN , Publish Date - Mar 08 , 2026 | 11:29 PM

మన్యంలోని డీఆర్‌ డిపోలపై పర్యవేక్షణ కొరవడింది. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజా పంపిణీ వ్యవస్థలో లోపాలను సరిచేసేందుకు ప్రతి నెలా నిర్వహించాల్సిన ఆహార సలహా మండలి సమావేశాలను అటకెక్కించడంతో ఈ దుస్థితి నెలకొంది.

డీఆర్‌ డిపోలపై పర్యవేక్షణేది?
కొయ్యూరు మండలంలోని కొమ్మిక గ్రామంలో డీఆర్‌ డిపో

అటకెక్కిన ఆహార సలహా మండళ్లు

గత వైసీపీ ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యం

ప్రజా పంపిణీ వ్యవస్థలో లోటుపాట్లను సరిచేసేందుకు ఏర్పాటు చేసే సమావేశాలకు తిలోదకాలు

డీఆర్‌ డిపోల్లో పెచ్చుమీరిన అవినీతి

గిరిజనులకు సక్రమంగా సరుకులు అందని పరిస్థితి

కొయ్యూరు, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): మన్యంలోని డీఆర్‌ డిపోలపై పర్యవేక్షణ కొరవడింది. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజా పంపిణీ వ్యవస్థలో లోపాలను సరిచేసేందుకు ప్రతి నెలా నిర్వహించాల్సిన ఆహార సలహా మండలి సమావేశాలను అటకెక్కించడంతో ఈ దుస్థితి నెలకొంది.

మన్యంలో డీఆర్‌ డిపోల నిర్వహణ, అమ్మకాల తీరు, లోటుపాట్లు సరిచేసి ప్రభుత్వ ఆశయానికి తగినట్టుగా ప్రజా పంపిణీ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు నిర్దేశించిన ఆహార సలహా మండళ్లకు గత వైసీపీ ప్రభుత్వంలో తిలోదకాలిచ్చింది. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, ప్రజలు, తహశీల్దార్‌, పౌరసరఫరాల విభాగాధికారితో కలిపి 16 మందితో ఆహార సలహా మండలిని ఏర్పాటు చేసింది. ఇలా ప్రతి మండలానికి ఒక సలహా మండలిని ఏర్పాటు చేసింది. మండలి సభ్యులు ఆయా మండలాల్లో ప్రతీ మూడు నెలలకు ఒకసారి సమావేశమై పౌరసరఫరాల విభాగంలో లోటుపాట్లపై చర్చించడం, వాటిని సక్రమమైన దారిలో నడిపించేలా నిర్ణయాలు తీసుకునేవారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సమావేశాలు జరగకపోవడంతో డీఆర్‌ డిపోల్లో అవినీతి, అక్రమాలు పెచ్చుమీరాయన్న ఆరోపణలు ఉన్నాయి. డిపోలను నిత్యం తెరిచి ఉంచాలనే నిబంధన కూడా గాలిలో కలిసింది. మన్యం వ్యాప్తంగా మారుమూల కొండలపై గల పలు గ్రామాల గిరిజనులకు అందాల్సిన సరుకుల్లో బియ్యం మినహా రాయితీపై ప్రభుత్వం సరఫరా చేస్తున్న నిత్యావసరాలు అందడం లేదు. వాస్తవానికి నిబంధనల ప్రకారం తహశీల్దార్‌ ప్రతీ మూడు నెలలకు విధిగా ఆహార సలహా మండలి సమావేశం నిర్వహించాల్సి ఉంది. ఇలా సమావేశమై డీఆర్‌ డిపోల నిర్వహణ, సమస్యలపై చర్చించాలి. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో దీనిని అమలు చేయగా, వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ పద్ధతికి చరమగీతం పాడింది. కాగా కొయ్యూరులో 2018 నవంబరులో ఈ సమావేశం నిర్వహించారు. ఆ తరువాత నుంచి ఇప్పటి వరకు సమావేశం నిర్వహించలేదు. దీంతో డీఆర్‌ డిపోల్లో అవినీతి పెరిగిపోయింది. అలాగే మారుమూల గ్రామాల్లో ఉచిత బియ్యంతో పాటు రాయితీ సరుకులు సక్రమంగా అందని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి ప్రతి నెలా ఆహార సలహా మండలి సమావేశం నిర్వహించి డీఆర్‌ డిపోలను గాడిలో పెట్టాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Mar 08 , 2026 | 11:29 PM