Share News

వంతెనలకు మోక్షమెన్నడో...

ABN , Publish Date - Jun 10 , 2026 | 12:37 AM

జిల్లాలో ఆర్‌అండ్‌బీ రహదారుల్లో పలుచోట్ల వంతెనలు, కల్వర్టులు శిథిలావస్థకుచేరి ప్రమాదకరంగా తయారయ్యాయి. మరోవైపు ఇప్పటికే కూలిపోయిన వంతెనల స్థానంలో కొత్త వంతెనలు నిర్మాణానికి నోచుకోలేదు. నిధుల మంజూరు ప్రతిపాదనలకే పరిమితమైంది. దీంతో ఆయా మార్గాల్లో ప్రయాణించేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

వంతెనలకు మోక్షమెన్నడో...
నాలుగేళ్ల క్రితం వడ్డాది వద్ద పెద్దేరు నదిపై కుంగిన వంతెన

కొన్నిచోట్ల కూలిపోయి.. మరికొన్నిచోట్ల కుంగిపోయి..

వాహనాల రాకపోకలకు తీవ్ర ఇక్కట్లు

ప్రతిపాదనలకే పరిమితమైన వడ్డాది, విజయరామరాజుపేట కొత్త వంతెనల నిర్మాణం

గోవాడ, కృష్ణాదేవిపేట వద్ద శిథిలావస్థలో..

దేవరాపల్లి, కోటవురట్ల మండలాల్లో అసంపూర్తిగా అప్రోచ్‌ రోడ్లు

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో ఆర్‌అండ్‌బీ రహదారుల్లో పలుచోట్ల వంతెనలు, కల్వర్టులు శిథిలావస్థకుచేరి ప్రమాదకరంగా తయారయ్యాయి. మరోవైపు ఇప్పటికే కూలిపోయిన వంతెనల స్థానంలో కొత్త వంతెనలు నిర్మాణానికి నోచుకోలేదు. నిధుల మంజూరు ప్రతిపాదనలకే పరిమితమైంది. దీంతో ఆయా మార్గాల్లో ప్రయాణించేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

చోడవరం నియోజకవర్గం బుచ్చెయ్యపేట మండల వడ్డాది సమీపంలో పెద్దేరు నదిపై పురాతన వంతెన 2022వ సంవత్సరం మే నెల 11వ తేదీ అర్ధరాత్రి కుంగిపోయింది. పిల్లర్లు గాల్లోకి వేలాడుతుండడంతో వంతెనపై వాహనాల రాపోకలు నిలిపివేశారు. దీంతో చోడవరం, మాడుగుల, పాడేరు ప్రాంతాల నుంచి రావికమతం, రోలుగుంట, నర్సీపట్నం వైపు వాహనాల రాకపోకలకు తీవ్రఅంతరాయం ఏర్పడింది. కొద్ది రోజుల తరువాత వంతెన కుంగిన ప్రదేశంలో రాళ్లు, మట్టి వేసి రోలింగ్‌చేయించి, తేలికపాటి వాహనాల రాకపోకలకు అనుమతించారు. అనంతరం ఈ వంతెనకు దిగువున నదిపై కాజ్‌వే నిర్మించారు. ఇది ఎత్తు తక్కువ వుండడంతో వర్షాకాలంలో పెద్దేరు నదిలో వరద పెరిగితే వాహనాల రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఇక్కడ పాత వంతెన స్థానంలో కొత్త వంతెన నిర్మాణం నాలుగేళ్ల నుంచి ప్రతిపాదనలకే పరిమితమైంది.

బుచ్చెయ్యపేట మండలం విజయరామరాజుపేట వద్ద తాచేరుపై బ్రిటీష్‌ హయాంలో నిర్మించిన వంతెన 2023లో కుప్పకూలింది. దీంతో విశాఖ, అనకాపల్లి, చోడవరం వైపు నుంచి మాడుగుల, పాడేరు ప్రాంతాలకు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తాత్కాలిక కాజ్‌వే నిర్మించే వరకు ట్రాఫిక్‌ను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించారు. అయితే ఇవి సింగిల్‌ రోడ్లు కావడంతో తరచూ ట్రాఫిక్‌ స్తంభించేది. తాచేరుపై తక్కువ ఎత్తులో కాజ్‌వే నిర్మించడంతో వర్షా కాలంలో నదిలో వరద ప్రవాహం పెరిగి కాజ్‌వే కొట్టుకుపోవడం పరిపాటిగా మారింది. గత రెండేళ్లలో ఈ అప్రోచ్‌ రోడ్డు మూడుసార్లు గండి పడి కొట్టుకుపోయింది. ఇక్కడ కూడా శాశ్వత వంతెన నిర్మాణం ప్రతిపాదనలకే పరిమితం అయ్యింది.

చోడవరం మండలం గోవాడ సమీపంలో శారదా నదిపై వంతెన బలహీనంగా మారింది. సుమారు 60 టన్నుల సామర్థ్యం వున్న ఈ వంతెన మీద నుంచి వంద టన్నులకు పైబడి బరువుతో గ్రానైట్‌ శిలలను రవాణా చేసే భారీ వాహనాలు వెళుతున్నాయి. ఈ క్రమంలో వంతెనపై ప్రకంపనలు వస్తున్నాయి. అధిక లోడుతో వెళ్లే వాహనాలను అధికారులు కట్టడిచేయకపోవడంతో గోవాడ వంతెన ప్రమాదానికి చేరువలో వుంది. గొలుగొండ మండలం కృష్ణాదేవిపేట వద్ద బొడ్డేరు నదిపై బ్రిటీష్‌ హయాంలో నిర్మించిన సైతం శిథిలావస్థకు చేరింది. ఇక్కడ కొత్త వంతెన నిర్మించాలని చాలా ఏళ్ల నుంచి ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

అసంపూర్తిగా పనులు...

మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లి మండలం కలిగొట్ల వద్ద వంతెన నిర్మించి అప్రోచ్‌ రోడ్డు పనులను అసంపూర్తిగా వదిలేశారు. కోటవురట్ల మండలం జల్లూరు వద్ద వరహా నదిపై వంతెన నిర్మించారు. అప్రోచ్‌ రోడ్డును మెటల్‌ వేసి రోలింగ్‌చేసి వదిలేశారు. తారు రోడ్డు వేయలేదు. నర్సీపట్నం- అడ్డరోడ్డు మధ్య కోటవురట్ల మండలం రామచంద్రపురం వద్ద గెడ్డపై వంతెన రెండేళ్ల కిందట కుంగిపోయింది. కొత్తగా వంతెన నిర్మాణానికి రూ.2 కోట్లు అవసరమని అధికారులు ప్రతిపాదనలు పంపారు. అనకాపల్లి మండలం వెంకుపాలెం వద్ద వంతెన శిథిలావస్థకు చేరింది. సబ్బవరం మండలం పాత రోడ్డు జంక్షన్‌ నుంచి గుల్లేపల్లి వెళ్లే రోడ్డులో అంతకాపల్లి వద్ద కల్వర్టు శిథిలావస్థకు చేరింది. ఇక్కడ కొత్త కల్వర్టు నిర్మించాలని ఈ మార్గంలో ప్రయాణించే పలు గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

నిధులు మంజూరులో తీవ్రజాప్యం

గత వైసీపీ ప్రభుత్వం రహదారుల, వంతెనల నిర్వహణ, మరమ్మతులు, కొత్తవాటి నిర్మాణం విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించింది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత రహదారులు చాలావరకు బాగుపడినప్పటికీ వంతెనల నిర్మాణానికి నిధులు మంజూరు కావడంలేదు. ప్రధానంగా ఉమ్మడి జిల్లాకు రవాణా విషయంలో కీలకమైన వడ్డాది, విజయరామరాజుపేట వద్ద ఏళ్ల తరబడి కొత్త వంతెనలు నిర్మాణానికి నోచుకోవడంలేదు.

Updated Date - Jun 10 , 2026 | 12:37 AM