సాగునీరు అందే దారేది?
ABN , Publish Date - Aug 05 , 2026 | 01:07 AM
మండలంలోని దద్దిగుమ్మి చెక్‌డ్యామ్ శిథిలం కావడంతో సుమారు 400 ఎకరాలకు సాగునీరు అందడం లేదు. దీంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వం కనీసం మరమ్మతులకు చర్యలు తీసుకోకపోవడంతో ఈ దుస్థితి నెలకొందని వాపోతున్నారు.
- శిథిలమైన దద్దిగుమ్మి చెక్‌డ్యామ్
- పూడుకుపోయిన పంట కాలువ
- 400 ఎకరాలకు నీరు అందక ఇబ్బందులు
కొయ్యూరు, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): మండలంలోని దద్దిగుమ్మి చెక్‌డ్యామ్ శిథిలం కావడంతో సుమారు 400 ఎకరాలకు సాగునీరు అందడం లేదు. దీంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వం కనీసం మరమ్మతులకు చర్యలు తీసుకోకపోవడంతో ఈ దుస్థితి నెలకొందని వాపోతున్నారు.
మండలంలోని అంతాడ పంచాయతీ పరిధిలో గల అంతాడ, రాజుపేట, కొత్తపల్లి, తదితర గ్రామాల్లోని పొలాలకు అంతాడ సమీపంలో ఉన్న దద్దిగుమ్మి చెక్‌డ్యామ్ ద్వారానే సాగునీరు వస్తుంది. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఈ చెక్‌డ్యామ్ ద్వారా ఆయా గ్రామాలకు చెందిన సుమారు 400 ఎకరాలకు సాగునీరు పుష్కలంగా అందేది. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ చెక్‌డ్యామ్‌కు కనీస మరమ్మతులు చేయలేదు. చెక్‌డ్యామ్ కాలువలోని పూడికలు తీయలేదు. దీంతో చెక్‌డ్యామ్ ప్రధాన గోడ కొండవాగు ప్రవాహ ఉధృతికి పూర్తిగా శిథిలమైంది. చెక్‌డ్యామ్ గర్భం, పంట కాలువ పూడుకుపోవడంతో నీరు వృథాగా పోతోంది. గత మూడేళ్లుగా అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల్లో చెక్‌డ్యామ్ ఆయకట్టు కింది సాగు చేసే రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. ప్రస్తుతం ఎన్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో పాటు ఈ చెక్‌డ్యామ్ శిథిలం కావడంతో సాగునీరు రాక పొలాలన్నీ బీడు భూములుగా మారాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ చెక్‌డ్యామ్ మరమ్మతులతో పాటు చెక్‌డ్యామ్ గర్భం, పంట కాలువలో పూడిక తీయించి సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.