Share News

బాగు పడే మార్గమేది?

ABN , Publish Date - Sep 30 , 2026 | 12:39 AM

సీలేరు- గూడెంకొత్తవీధి ప్రధాన రహదారి కోతకు గురై దారుణంగా ఉంది. తాజాగా కురిసిన వర్షాలకు రెయిన్‌ గేజ్‌ నుంచి ధారాలమ్మ దేవాలయం వరకు నిర్మాణ దశలో ఉన్న రహదారి దెబ్బతినడంతో వాహనచోదకులు ఇబ్బంది పడుతున్నారు.

బాగు పడే మార్గమేది?
రెయిన్‌ గేజ్‌ వద్ద అఽధ్వానంగా ఉన్న రహదారిపై అతికష్టంపై ప్రయాణిస్తున్న కారు

- అధ్వానంగా సీలేరు- జీకేవీధి రోడ్డు

- భారీ వర్షాలకు కోతకు గురికావడంతో రాకపోకలకు ఇబ్బందులు

గూడెంకొత్తవీధి, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి):

సీలేరు- గూడెంకొత్తవీధి ప్రధాన రహదారి కోతకు గురై దారుణంగా ఉంది. తాజాగా కురిసిన వర్షాలకు రెయిన్‌ గేజ్‌ నుంచి ధారాలమ్మ దేవాలయం వరకు నిర్మాణ దశలో ఉన్న రహదారి దెబ్బతినడంతో వాహనచోదకులు ఇబ్బంది పడుతున్నారు.

ఆర్‌వీనగర్‌ నుంచి పాలగెడ్డ వరకు సుమారు పదేళ్ల క్రితం రహదారి పూర్తిగా దెబ్బతింది. 2018లో ఈ రహదారి నిర్మాణానికి అప్పటి టీడీపీ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. టెండర్ల ప్రక్రియను ఆర్‌అండ్‌బీ ఇంజనీరింగ్‌ అధికారులు పూర్తి చేశారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ టెండర్లను రద్దు చేసింది. ఐదేళ్లపాటు ఈ రహదారి నిర్మాణాలను వైసీపీ పాలకులు, అధికారులు పట్టించుకోలేదు. దీంతో ఈ ప్రాంత ప్రజలు ఇటుగా రాకపోకలు సాగించేందుకు నరకయాతన అనుభవించేవారు. 2024లో అధికారంలోకి వచ్చిన ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం ఈ రహదారి నిర్మాణం చేపట్టేందుకు డీపీఆర్‌ను సిద్ధం చేసింది. 2025లో ఈ రహదారి నిర్మాణానికి రూ.18.5 కోట్లు మంజూరు చేసింది. టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి 2026 జూలైలో ఆర్‌అండ్‌బీ అధికారులు రహదారి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఆర్‌వీనగర్‌ నుంచి లంకపాకలు వరకు తారు రోడ్డు నిర్మాణాన్ని ఆర్‌అండ్‌బీ అధికారులు పూర్తి చేశారు. రెయిన్‌ గేజ్‌ నుంచి ధారాలమ్మ దేవాలయం వరకు ఎర్త్‌ వర్కు పూర్తయింది. తాజాగా కురిసిన భారీ వర్షాలకు రహదారి కోతకు గురై అడుగు, రెండు అడుగుల గోతులు ఏర్పడ్డాయి. దీంతో ఈ రహదారిపై ప్రయాణించే వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే ఈ రహదారి నిర్మాణానికి కాంట్రాక్టర్‌ ఇన్సూరెన్స్‌ చేయించారు. ఇన్సూరెన్సు కంపెనీ ప్రతినిధులు వచ్చి పాడైపోయిన రహదారిని సర్వే చేసే వరకు కాంట్రాక్టర్‌ మరమ్మతులు చేపట్టడం లేదు. ప్రస్తుతం ఐదు రోజులుగా ఈ రహదారిపై రాకపోకలు సాగిస్తున్న ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వెంటనే కలెక్టర్‌, ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించి రహదారి నిర్మాణం పూర్తి చేసే వరకు రాకపోకలకు అంతరాయం కలగకుండా తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని స్థానిక గిరిజనులు, పర్యాటకులు కోరుతున్నారు.

Updated Date - Sep 30 , 2026 | 12:39 AM