Share News

స్వర్ణ గ్రామం ఏదీ?

ABN , Publish Date - May 14 , 2026 | 01:01 AM

గ్రామ సచివాలయాలను స్వర్ణ గ్రామంగా పేరు మారుస్తూ ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఉత్తర్వులు ఇచ్చినా, ఇంకా సచివాలయాలుగానే కొనసాగుతుండడంతో క్షేత్రస్థాయిలో గందరగోళం నెలకొంది.

స్వర్ణ గ్రామం ఏదీ?
సచివాలయంగానే కొనసాగుతున్న పంచాయతీ కార్యాలయం

సచివాలయాల పేరు మార్పు కాగితాలకే పరిమితం

ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చి మూడు నెలలవుతున్నా చర్యలు శూన్యం

కనీసం కార్యాలయాలపై పేరు మార్చని వైనం

క్షేత్ర స్థాయిలో గందరగోళం

చోడవరం, మే 13 (ఆంధ్రజ్యోతి): గ్రామ సచివాలయాలను స్వర్ణ గ్రామంగా పేరు మారుస్తూ ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఉత్తర్వులు ఇచ్చినా, ఇంకా సచివాలయాలుగానే కొనసాగుతుండడంతో క్షేత్రస్థాయిలో గందరగోళం నెలకొంది. కార్యాలయాలపై ఇప్పటి వరకు సచివాలయాల పేరు మార్చలేదు. అధికారులు మాత్రం స్వర్ణ గ్రామంగా కాగితాల్లో మాత్రమే చూపిస్తున్నారు.

వైసీపీ హయాంలో అట్టహాసంగా గ్రామ పంచాయతీలను గ్రామ సచివాలయాలుగా మార్చి, అవసరానికి మించి సిబ్బందిని నియమించి వారిని ఖాళీగా కూర్చోపెట్టి వేతనాలు ఇవ ్వడం తీవ్ర విమర్శలకు దారితీసిన సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత సచివాలయాల వ్యవస్థను క్రమబద్ధీకరించే క్రమంలో కీలకమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగానే పంచాయతీల్లో జనాభా, ఆదాయం, ఇతర అంశాల ఆధారంగా ఆ సచివాలయాల్లో ఎంతమంది సిబ్బంది అవసరమో అంతమందిని మాత్రమే ఉంచి, అదనంగా ఉన్న సిబ్బందిని ఇతర శాఖలకు సర్దుబాటు కింద పంపించింది. ఈ ప్రక్రియ చేపట్టి సచివాలయాల్లో మిగులు సిబ్బందిని ఇతర శాఖలకు కేటాయింపు పూర్తి చేసింది. అలాగే సచివాలయాల పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా మండల స్థాయి అధికారిని కూడా నియమించింది. ఇంత వరకు బాగానే ఉన్నా పేరు మార్పు విషయంలో మాత్రం గందరగోళం నెలకొంది.

కాగితాల్లోనే పేరు మార్పు

గ్రామ సచివాలయాలను స్వర్ణ గ్రామంగా, వార్డు కార్యాలయాన్ని స్వర్ణ వార్డుగా పేరు మారుస్తూ ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి నెలలోనే ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం గ్రామ సచివాలయాన్ని స్వర్ణ పంచాయతీగా, పెద్ద పంచాయతీల్లో వార్డు సచివాలయాలను స్వర్ణ వార్డుగా మార్పు చేయాల్సి ఉంది. అయితే ఈ ఆదేశాలు వచ్చి మూడు నెలలు అవుతున్నా ఇంకా క్షేత్రస్థాయిలో పంచాయతీ కార్యాలయాలు సచివాలయాలుగానే కొనసాగుతున్నాయి. కనీసం కార్యాలయాలపై పేరు మార్చలేదు. దీంతో ప్రజల దృష్టిలో ఇంకా సచివాలయాలుగా కొనసాగుతుండగా, అధికారులు మాత్రం స్వర్ణ గ్రామంగా కాగితాల్లో నడిపిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి సచివాలయాల పేరు మార్పు చేసి గందరగోళానికి తెరదించాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - May 14 , 2026 | 01:01 AM