Share News

ఆదివాసీల ఇళ్లకు అదనపు సాయమేది?

ABN , Publish Date - Mar 18 , 2026 | 12:35 AM

జిల్లాలో గృహ నిర్మాణ లబ్ధిదారులకు అదనంగా అందాల్సిన ఆర్థిక ప్రోత్సాహం కోసం సుమారుగా ఏడాదిగా ఎదురు చూస్తున్నారు. పేదల సొంతింటి కలను నెరవేర్చడంలో భాగంగా ప్రతి ఇంటి లబ్ధిదారునికి ఆర్థిక ప్రోత్సాహం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గిరిజన ప్రాంతంలోని ఆదిమ జాతి గిరిజన లబ్ధిదారులకు రూ.లక్ష చొప్పున, సాధారణ గిరిజన లబ్ధిదారులకు రూ.75 వేలు చొప్పున అందించాలని 2025 మార్చి 10న జీవోను ప్రభుత్వం జారీ చేసింది. దీంతో తమ ఇళ్ల నిర్మాణానికి అదనపు ఆర్థిక సాయం అందుతుందని గిరిజన లబ్ధిదారులు సంబరపడ్డారు. కానీ ఇప్పటికీ అందకపోవడంతో నిరాశ చెందుతున్నారు.

ఆదివాసీల ఇళ్లకు అదనపు సాయమేది?
నందిగరువులో అసంపూర్తిగా ఉన్న పీఎం జన్‌మన్‌ ఇల్లు

- ఆదిమ జాతి గిరిజనులకు రూ.లక్ష, సాధారణ గిరిజనులకు రూ.75 వేలు చొప్పున అదనపు సాయమందిస్తామని ఏడాది క్రితం ప్రకటించిన ప్రభుత్వం

- ఇప్పటికీ విడుదలకాని నిధులు

- ఉమ్మడి అల్లూరి జిల్లా వ్యాప్తంగా 37,617 మంది లబ్ధిదారులు

- రూ.347 కోట్ల చెల్లింపులు పెండింగ్‌

- గిరిజనులకు తప్పని ఎదురుచూపులు

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

జిల్లాలో గృహ నిర్మాణ లబ్ధిదారులకు అదనంగా అందాల్సిన ఆర్థిక ప్రోత్సాహం కోసం సుమారుగా ఏడాదిగా ఎదురు చూస్తున్నారు. పేదల సొంతింటి కలను నెరవేర్చడంలో భాగంగా ప్రతి ఇంటి లబ్ధిదారునికి ఆర్థిక ప్రోత్సాహం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గిరిజన ప్రాంతంలోని ఆదిమ జాతి గిరిజన లబ్ధిదారులకు రూ.లక్ష చొప్పున, సాధారణ గిరిజన లబ్ధిదారులకు రూ.75 వేలు చొప్పున అందించాలని 2025 మార్చి 10న జీవోను ప్రభుత్వం జారీ చేసింది. దీంతో తమ ఇళ్ల నిర్మాణానికి అదనపు ఆర్థిక సాయం అందుతుందని గిరిజన లబ్ధిదారులు సంబరపడ్డారు. కానీ ఇప్పటికీ అందకపోవడంతో నిరాశ చెందుతున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక ప్రోత్సాహం కోసం ఉమ్మడి అల్లూరి జిల్లాలోని హౌసింగ్‌ లబ్ధిదారులు ఏడాదిగా ఎదురు చూస్తున్నారు. మామూలుగానే ప్రభుత్వం ఇచ్చే హౌసింగ్‌ స్కీమ్‌ సొమ్ముతో పాటు సొంతంగా మరికొంత సొమ్మును జోడి స్తేనే గాని ఇంటి నిర్మాణం పూర్తికాని పరిస్థితి. అయితే గిరిజనుల పేదరికం, ఆర్థిక స్థితిగతులను గుర్తించిన ప్రభుత్వం ఆదిమ జాతి గిరిజన లబ్ధిదారులకు రూ.లక్ష, సాధారణ గిరిజన లబ్ధిదారులకు రూ.75 వేలు చొప్పున ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తామని పేర్కొంది. దీంతో అందుకు తగ్గట్టుగా లబ్ధిదారులు తమ ఇళ్ల నిర్మాణాలకు ప్లాన్‌ చేసుకుని పనులు చేపడుతున్నారు. కానీ ఏడాది గడుస్తున్నప్పటికీ ప్రత్యేక ప్రోత్సాహం ఊసే లేకపోవడంపై లబ్ధిదారులు పెదవి విరుస్తున్నారు. అలాగే లబ్ధిదారులు తమ కాళ్లరిగేలా హౌసింగ్‌ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.

రూ.347 కోట్లు పెండింగ్‌

ఉమ్మడి అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 23 మండలాల పరిధిలో మొత్తం 37,617 మంది హౌసింగ్‌ లబ్ధిదారులకు రూ..347 కోట్లు ప్రత్యేక ప్రోత్సాహక నిధులు చెల్లించాల్సి ఉందని లెక్కలు చెబుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ప్రధానమంత్రి జన్‌మన్‌ ఇళ్లుకు సంబంధించి మొత్తం ఆదిమ జాతి గిరిజన లబ్ధిదారులు 28,691 మంది కాగా, వారిలో 26,147 మంది మాత్రమే రూ.లక్ష చొప్పున ప్రత్యేక ప్రోత్సాహానికి ఎంపికయ్యారు. దీంతో వారికి ప్రత్యేక ప్రోత్సాహకంగా రూ.261 కోట్లు చెల్లించాల్సి ఉంది. అలాగే రూ.75 వేలు చొప్పున ప్రత్యేక ప్రోత్సాహకానికి సంబంధించి సాధారణ గిరిజన లబ్ధిదారులు 11,470 మంది ఎంపికయ్యారు. వీరికి సంబంధించి రూ.86 కోట్లు నిధులు పెండింగ్‌లో ఉన్నాయి. రెండు కేటగిరీల్లోని 37,617 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.347 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ప్రభుత్వం ఆ పెండింగ్‌ నిధులను విడుదల చేస్తే తమ ఇళ్లను పూర్తి చేసుకుంటామని లబ్ధిదారులు చెబుతున్నారు.

Updated Date - Mar 18 , 2026 | 12:35 AM