చెత్త సమస్య పరిష్కారంలో చిత్తశుద్ధి ఏది?
ABN , Publish Date - Feb 08 , 2026 | 12:54 AM
అనకాపల్లి పట్టణంలో చెత్త సమస్యకు పరిష్కారం లభించేలా లేదు. పాలకులు మారుతున్నా డంపింగ్‌యార్డు కోసం స్థల సేకరణ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. దీంతో తీవ్ర దుర్గంధం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
- పట్టణ నడిబొడ్డున డంపింగ్ యార్డుతో ప్రజల అవస్థలు
- తీవ్ర దుర్గంధంతో సతమతం
- శివారు ప్రాంతాలకు తరలించాలని ఎన్నో ఏళ్లుగా డిమాండ్
- కార్యరూపం దాల్చని స్థల సేకరణ ప్రతిపాదనలు
- పట్టించుకోని పాలకులు
(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)
అనకాపల్లి పట్టణంలో చెత్త సమస్యకు పరిష్కారం లభించేలా లేదు. పాలకులు మారుతున్నా డంపింగ్‌యార్డు కోసం స్థల సేకరణ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. దీంతో తీవ్ర దుర్గంధం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
పట్టణంలో నిత్యం టన్నుల కొద్దీ వెలువడుతున్న చెత్తను ప్రత్యేకంగా ఊరికి దూరంగా డంపింగ్ యార్డును ఏర్పాటు చేసి తరలించాల్సి ఉండగా దశాబ్దాల కిందట నుంచి జీవీఎంసీ జోనల్ కార్యాలయ ఆవరణలోనే చెత్తను నిల్వ చేస్తూ డంపింగ్‌యార్డుగా మార్చేశారు. వర్షాకాలంలో ఈగలు, దోమలు ముసురుకుంటున్నాయి. ఎండాకాలం వచ్చిందంటే చాలు చెత్త గుట్టల నుంచి వెలువడే దుర్వాసనతో పరిసరాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పరిసరాల్లో ప్రజలు తరచూ అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణంలో 65 వేలకు పైగా కుటుంబాల నుంచి రోజుకు 50 నుంచి 80 మెట్రిక్ టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. జీవీఎంసీ అధికారులు రెండు లారీల్లో చెత్తను విశాఖపట్నం జిల్లా మధురవాడకు సమీపంలోని జిందాల్‌కు చెందిన చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రానికి తరలిస్తున్నారు. కేవలం రెండు వాహనాల్లో మాత్రమే చెత్తను తరలిస్తుండడంతో ప్రతి రోజు వస్తున్న చెత్తతో డంపింగ్‌యార్డులో దాదాపు సగం చెత్త గుట్టలుగా పేరుకుపోతోంది. దశాబ్ద కాలంగా పట్టణంలో దుర్వాసనతో అవస్థలు పడుతున్నారు. జీవీఎంసీ జోనల్ కార్యాలయం ఆవరణలోని డంపింగ్‌యార్డును పట్టణ శివారు ప్రాంతానికి తరలించాలని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నా, పట్టించుకున్న నాథుడే కరువయ్యారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో డంపింగ్ యార్డుకు స్థలాన్ని కేటాయిస్తామని అప్పటి పాలకులు హడావిడి చేసినా ఆచరణకు నోచుకోలేదు. ఐదేళ్లలో కనీసం స్థలాన్ని సేకరించలేకపోయారు. గతంలో శారదా కాలనీలో డంపింగ్ యార్డు కోసం ఒక స్థలాన్ని, అదే విధంగా అచ్చెయ్యపేటలో మరో స్థలాన్ని పరిశీలించినా స్థానికులు అభ్యంతరం చెప్పడంతో అధికారులు వెనకడుగు వేశారు. తరువాత డంపింగ్‌యార్డు ఏర్పాటు ఊసెత్తడం లేదు.
అమలుకు నోచుకోని హామీ
గత సార్వత్రిక ఎన్నికల ముందు ప్రస్తుత ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అనకాపల్లి పట్టణ నడిబొడ్డున ఉన్న డంపింగ్ యార్డును పరిశీలించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు ఇబ్బందికరంగా మారిన డంపింగ్ యార్డును ఇక్కడ నుంచి తరలిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు డంపింగ్ యార్డు ఏర్పాటు విషయంపై జీవీఎంసీ అధికారులతో చర్చించిన దాఖలాలు లేవని ప్రజలు విమర్శిస్తున్నారు. కనీసం స్థలాన్ని కేటాయించేందుకు ప్రయత్నాలు జరగడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి జీవీఎంసీ కార్యాలయ ఆవరణలో ఉన్న డంపింగ్ యార్డును వేరొకచోటుకు తరలించేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.