Share News

మత్స్యకారులకు జగన్‌ చేసేందేమిటో?

ABN , Publish Date - Jul 14 , 2026 | 01:22 AM

రాష్ట్రంలో జరిగిన ప్రతి సంఘటనను రాజకీయంగా వాడుకునేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

మత్స్యకారులకు  జగన్‌ చేసేందేమిటో?

రాజకీయ గలాటా కోసమే పరామర్శా?

మత్స్యకారుల సూటి ప్రశ్న

విశాఖపట్నం, జూలై 13 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్రంలో జరిగిన ప్రతి సంఘటనను రాజకీయంగా వాడుకునేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక సంఘటనలో బాధితులకు పరామర్శ పేరుతో గలాటా చేసే దిశగా జగన్‌, అతని అనుయాయుల వ్యవహారశైలి ఉందనే వాదన ఉంది. ఈ నేపథ్యంలో గత వారం సముద్రంలో గల్లంతైన మత్స్యకార కుటుంబాలను పరామర్శించేందుకు మంగళవారం జగన్‌ నగరానికి వస్తున్నారు. అయితే శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన మాజీ మంత్రి, వైసీపీ నేత సీదిరి అప్పలరాజు కుమారుడు వేగంగా వాహనం నడిపి ఒకరి మృతికి కారణమైనా బాధిత కుటుంబానికి కనీసం సంతాపం వ్యక్తం చేయని జగన్‌ మత్స్యకారులకు ఏరకంగా మేలు చేస్తారని ప్రశ్నిస్తున్నారు.

జగన్‌ విశాఖ పర్యటనలో మత్స్యకారులకు చేసే న్యాయం ఏమిటనే ప్రశ్న చర్చకు వచ్చింది. తన పాలనలో ఏటా మత్స్యకార భరోసా పేరిట సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు రూ.10వేలు ఇవ్వడం మినహా ఇతరత్రా చేసిందేమిటని గంగ పుత్రులు ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో విద్యుత్‌బిల్లు ఎక్కువగా వచ్చిందని, ఇతరత్రాకారణాలతో పలువురికి మత్య్సకార భరోసా ఇవ్వకుండా నిలిపివేసిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. జగన్‌ పాలనలో సముద్రంలో చేపలవేటకు వెళ్లి చనిపోయినవారు, గాయాలతో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన వారికి రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ఇచ్చిన హామీని అమలుచేయలేకపోయారు. ఐదేళ్ల పాలనలో పలు కారణాలతో విశాఖ జిల్లాలో మృతిచెందిన 63మందికి కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత మాత్రమే రూ.3.15 కోట్లు విడుదలచేసిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. వైసీపీ హయాంలో మత్స్యకారులకు ఒరిగిందేమీలేదని, కూటమి వచ్చిన తరువాతే పరిహారం పంపిణీ చేశారని చెబుతున్నారు. కూటమి ప్రభుత్వంలో మత్స్యకారులకు రూ.20వేలు చొప్పున సాయం అందించారని, మిగిలిన వారికి సోమవారం రూ.11.28 కోట్లు ప్రభుత్వం విడుదలచేసిందని, రెండుమూడు రోజుల్లో తమ ఖాతాల్లోకి సొమ్ము జమకానుందని తెలిపారు.

వైసీపీ హయాంలో ఫిషింగ్‌ హార్బర్‌లో అగ్ని ప్రమాద ంసంభవించి కాలిపోయిన బోట్లకు అప్పటి జగన్‌ ప్రభుత్వం ఇచ్చిన పరిహారానికి తోడుగా విపక్షంలో ఉన్న టీడీపీ నేతలు చందాలు వేసుకుని కొంతమొత్తం, అధిష్ఠానం మరికొంత మొత్తం అందజేశారు. ప్రమాదంలో బోటు కాలిపోయిన యజమానులు, అందులో పనిచేసిన మత్స్యకారులకు కూటమి ప్రభుత్వమే పరిహారం ఇచ్చి ఉదారంగా ఆదుకుందని చెబుతున్నారు.

గత వారం సముద్రంలో బోటు గల్లంతైన విషయాన్ని ముందుగా తెలుసుకున్న ఓ వైసీపీ నాయకుడు వెంటనే అధికారులకు చెప్పకుండా తన సొంత రాజకీయాలకు వాడుకోవడంతో బోటులోని మత్స్మకారుల ఆచూకీ లభించలేదని గుర్తుచేస్తున్నారు. ప్రమాదం జరిగిన తరువాత 72 గంటల పాటు నేవీ, కోస్టుగార్డు సిబ్బంది విస్తృతంగా గాలించినా ఆచూకీ దొరకలేదని ప్రాథమికంగా నిర్ధారించారు. దీంతో గల్లంతైన వారికి రూ.10 లక్షలు పరిహారం ఇచ్చారు. గల్లంతైన వారి కుటుంబంలో ఒకరికి జీవీఎంసీ లేదా ఏదైనా కంపెనీలో అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగం ఇవ్వడానికి మంత్రులు హామీ ఇచ్చారు. బోటు కోల్పోయి ప్రాణాలతో బయటపడ్డ కారె చిన్నాకు మరో బోటు కోసం కేంద్రం నుంచి సబ్సిడీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్‌ మంగళవారం వస్తున్న విషయం మత్స్యకార సంఘాల నాయకులకు కూడా సమాచారం లేకపోవడం గమనార్హం.

నేడు నగరానికి వైసీపీ అధ్యక్షుడు జగన్‌

విశాఖపట్నం, జూలై 13 (ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం నగరంలోలో పర్యటించనున్నారు. ఇటీవల బోటు ప్రమాదంలో గల్లంతైన ఆరుగురు మత్సకారుల కుటుంబాలతోపాటు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన బోటు యజమాని కారె చిన్నను జగన్‌ పరామర్శిస్తారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని, అక్కడి నుంచి రోడు మార్గంలో కేజీహెచ్‌ సమీపంలోని జబ్బర్‌ తోటకు చేరుకుని బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడుతారు. తిరిగి ఒంటి గంటకు ఎయిర్‌పోర్టుకు చేరుకుని విజయవాడ వెళతారు.

Updated Date - Jul 14 , 2026 | 01:22 AM