Share News

మాస్టర్‌ ప్లాన్‌ అమలు కాకపోతే ఎలా!?

ABN , Publish Date - Mar 07 , 2026 | 01:13 AM

జిల్లా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో శుక్రవారం పలు అంశాలపై మాట్లాడారు.

మాస్టర్‌ ప్లాన్‌ అమలు కాకపోతే ఎలా!?

ఇరవై ఏళ్లయినా కార్యరూపం దాల్చని ప్రతిపాదనలు

నిర్మాణానికి నోచుకోని రహదారులు

టీడీఆర్‌లో స్థానంలో నగదు ఇవ్వాలి

అసెంబ్లీలో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు

పరిశ్రమలకు భూములు సేకరించినప్పుడు

పరిహారం అందరికీ ఒకేలా ఇవ్వాలన్న ఎమ్మెల్యే గంటా

విశాఖపట్నం, మార్చి 6 (ఆంధ్రజ్యోతి):

జిల్లా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో శుక్రవారం పలు అంశాలపై మాట్లాడారు. ప్రభుత్వ శాఖలు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. నష్టం జరగకుండా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.

రాష్ట్రంలో నగరాభివృద్ధి సంస్థలు ఆయా ప్రాంతాల అభివృద్ధి కోసం మాస్టర్‌ ప్లాన్‌లు రూపొందిస్తున్నాయని, వాటిలో ప్రతిపాదించిన రహదారులను 20 ఏళ్లైనా నిర్మించకపోతే వాటి పరిస్థితి ఏమిటని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రశ్నించారు. మాస్టర్‌ ప్లాన్‌లో 40, 60, 80, 100 అడుగుల రహదారులు అంటూ ప్రతిపాదిస్తున్నారని, ఆ భూముల్లో నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం లేదని ఆరోపించారు. దశాబ్దాలు గడిచిపోతున్నా ఆయా ప్రాంతాల్లో ఆ రహదారులు అభివృద్ధి చేయడం లేదని, దానివల్ల అక్కడి భూయజమానులు నష్టపోతున్నారని వివరించారు. అలాంటప్పుడు ఆ మాస్టర్‌ ప్లాన్లు కొనసాగించాలా?, మార్పులు చేయాలా?...అనే విషయంపై ప్రభుత్వం ఆలోచన చేయాలన్నారు. అదేవిధంగా రహదారుల కోసం ప్రజల భూములు తీసుకుంటూ టీడీఆర్‌లు ఇస్తున్నారని, వాటికి ప్రస్తుతం డిమాండ్‌ లేదని, రేటు కూడా రావడం లేదన్నారు. అందుకని భూ సేకరణ సమయంలో బాధితులకు నగదు రూపంలో పరిహారం ఇవ్వాలని కోరారు. అదే విధంగా పట్టణాల్లో పురపాలక శాఖ ప్రభుత్వ భవనాల నిర్మాణానికి వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నదని, నిర్వహణ లేక అవి కొద్దికాలానికే శిథిలావస్థకు చేరుకుంటున్నాయని పల్లా ఆందోళన వ్యక్తంచేశారు. వాటి నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఎస్టేట్‌ విభాగాన్ని ఏర్పాటుచేస్తే విలువైన ఆస్తులను రక్షించవచ్చునని సూచించారు.

అందరికీ ఒకేలా పరిహారం ఇవ్వాలి: గంటా

ఐటీ కంపెనీలు, పరిశ్రమలకు అవసరమైన భూములను ప్రజల నుంచి సేకరించినప్పుడు లేదా సమీకరించినప్పుడు వారికి చెల్లించే పరిహారం విషయంలో ప్రభుత్వం ఏకీకృత విధానాన్ని అమలు చేయాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సూచించారు. మండలాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని అన్ని గ్రామాల్లో ఒకే రకమైన మార్కెట్‌ ధరను నిర్ణయించాలని కోరారు. ముఖ్యంగా ఆనందపురం మండలం తర్లువాడలో గూగుల్‌ డేటా సెంటర్‌ కోసం సేకరించిన భూములకు ఒక విధంగా, పక్క గ్రామాల్లో మరో విధంగా పరిహారం ఇవ్వడంపై రైతులు సంతృప్తిగా లేరని వివరించారు. పరిహారంపై స్పష్టత లేకపోవడం వల్ల పంపిణీలోను అవకతవకలకు అవకాశం ఉంటుందని, స్పష్టమైన విధానాలు రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.

Updated Date - Mar 07 , 2026 | 01:13 AM