కొత్త పీహెచ్‌సీల ప్రతిపాదన ఏమైనట్టో?
ABN , Publish Date - Jul 24 , 2026 | 12:44 AM
ఏజెన్సీలో మండలాల విస్తీర్ణం అధికంగా ఉండడంతో పాటు మారుమూల ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్‌సీలు) లేని పరిస్థితుల దృష్ట్యా ఆయా ప్రాంత గిరిజనులకు వైద్య సేవలు సకాలంలో, సక్రమంగా అందడం లేదని గుర్తించిన అధికారులు కొత్తగా ఆరు పీహెచ్‌సీలు ఏర్పాటు చేయాలని మూడేళ్ల క్రితం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కార్యరూపం దాల్చలేదు. కూటమి ప్రభుత్వంలో కొత్త పీహెచ్‌సీలు ఏర్పాటవుతాయని గిరిజనులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
- మూడేళ్ల క్రితం ప్రభుత్వానికి కలెక్టర్ నివేదిక
- అప్పట్లో కనీసం పట్టించుకోని వైసీపీ ప్రభుత్వం
- ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 35 పీహెచ్‌సీలు
- కొత్తవి మంజూరైతే 41కి చేరే అవకాశం
- కూటమి ప్రభుత్వంపై మారుమూల గిరిజనుల ఆశలు
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
ఏజెన్సీలో మండలాల విస్తీర్ణం అధికంగా ఉండడంతో పాటు మారుమూల ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్‌సీలు) లేని పరిస్థితుల దృష్ట్యా ఆయా ప్రాంత గిరిజనులకు వైద్య సేవలు సకాలంలో, సక్రమంగా అందడం లేదని గుర్తించిన అధికారులు కొత్తగా ఆరు పీహెచ్‌సీలు ఏర్పాటు చేయాలని మూడేళ్ల క్రితం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కార్యరూపం దాల్చలేదు. కూటమి ప్రభుత్వంలో కొత్త పీహెచ్‌సీలు ఏర్పాటవుతాయని గిరిజనులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఏజెన్సీ 11 మండలాల పరిధిలో ఏడు లక్షల మంది గిరిజన జనాభాకు మండల, గ్రామ స్థాయిలో 35 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. అలాగే జిల్లా కేంద్రం పాడేరులో రెండు వందల పడకల జిల్లా ఆస్పత్రి, అరకులోయ, చింతపల్లిలో వంద పడకల ఏరియా ఆస్పత్రులు, ముంచంగిపుట్టులో యాభై పడకల సామాజిక ఆరోగ్య కేంద్రం ఉన్నాయి. అయినప్పటికీ మన్యంలోని మారుమూల ప్రాంతాల్లో గిరిజనులకు సకాలంలో వైద్య సేవలు అందని దుస్థితి చాలా ఏళ్లుగా కొనసాగుతున్నది. ముఖ్యంగా ఏజెన్సీలో కొయ్యూరు, పెదబయలు, జి.మాడుగుల, హుకుంపేట, పాడేరు మండలాల్లో ఆ పరిస్థితి ఉంది. మండల కేంద్రాలకు 50 నుంచి 60 కిలోమీటర్ల దూరంలో గ్రామాలు ఉండడం, ఆయా గ్రామాలకు ఎటువంటి రోడ్డు సదుపాయం లేకపోవడంతో పాటు పీహెచ్‌సీలకు సైతం 20 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లోని గిరిజనులకు ఎటువంటి అనారోగ్య సమస్య ఏర్పడినా సకాలంలో వైద్య సేవలు అందని పరిస్థితి కొనసాగుతున్నది. దీంతో మన్యంలో మారుమూల ప్రాంతాల్లో మరిన్ని పీహెచ్‌సీలను ఏర్పాటు చేయాలనే డిమాండ్ చాలా ఏళ్లుగా ఉంది.
ఆరు ప్రాంతాల్లో పీహెచ్‌సీల ఏర్పాటుకు ప్రతిపాదనలు
జిల్లాలో కొత్తగా మరో ఆరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ మూడేళ్ల క్రితం అప్పటి కలెక్టర్ సుమిత్‌కుమార్ రాష్ట్ర వైద్యారోగ్యశాఖకు ప్రతిపాదనలు పంపారు. ఏజెన్సీలో హుకుంపేట మండలం మజ్జివలస, పెదబయలు మండలం పెదకోడాపల్లి, పాడేరు మండలం డోకులూరు, కొయ్యూరు మండలంలో నడింపాలెం, జి.మాడుగుల మండలంలో మద్దిగరువు, సొలంభం ప్రాంతాల్లో కొత్తగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ కోరారు. మన్యంలో ప్రైవేటు వైద్య సేవలు అందుబాటులో లేకపోవడంతో గిరిజనులు ప్రభుత్వం అందించే వైద్య సేవలపైనే పూర్తిగా ఆధారపడతారు. అందువల్ల ఏజెన్సీలో కొత్త పీహెచ్‌సీలు ఏర్పాటు చేస్తే ఆయా ప్రాంతాల్లోని గిరిజనులకు చాలా మేలు జరుగుతుందని వైద్యారోగ్యశాఖాధికారులకు కలెక్టర్ సూచించారు. కానీ అప్పటి వైసీపీ ప్రభుత్వం కొత్త పీహెచ్‌సీల ఏర్పాటు ప్రతిపాదనలపై కనీసం స్పందించలేదు.
కూటమి ప్రభుత్వంపైనే గిరిజనుల ఆశలు
ప్రస్తుత కూటమి ప్రభుత్వం గిరిజనుల సంక్షేమం, అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తుండడంతో తమ ప్రాంతంలో కొత్త పీహెచ్‌సీల ఏర్పాటునకు సానుకూలంగా చర్యలు చేపడుతుందని గిరిజనులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీలో రోడ్డు, రవాణా సదుపాయాలు సంపూర్ణంగా లేకపోవడంతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సైతం దూరంగా ఉండడంతో మారుమూల ప్రాంత వాసులు వైద్య సేవలకు నోచుకోని దుస్థితి కొనసాగుతున్నది. ఈ తరుణంలో మన్యంలో కొత్త పీహెచ్‌సీల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం చొరవ చూపితే తమకు న్యాయం జరుగుతుందని మారుమూల ప్రాంత గిరిజనులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 35 పీహెచ్‌సీలుండగా, కొత్తవి మంజూరైతే 41కి చేరతాయి.