Share News

ఇంకా తెలవారదేమి...

ABN , Publish Date - Jan 20 , 2026 | 11:22 PM

మన్యంలో పొగమంచు దట్టంగా కురుస్తున్నది. దీంతో ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించని పరిస్థితి నెలకొంది.

ఇంకా తెలవారదేమి...
పాడేరు- జి.మాడుగుల మెయిన్‌ రోడ్డులో మంగళవారం ఉదయం పొగమంచు

మన్యంలో ఉదయం 10 గంటల వరకు దట్టంగా పొగమంచు

లైట్ల వెలుతురులోనే వాహనాల రాకపోకలు

అరకులోయలో 5.7 డిగ్రీలు

పాడేరు, జనవరి 20(ఆంధ్రజ్యోతి): మన్యంలో పొగమంచు దట్టంగా కురుస్తున్నది. దీంతో ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించని పరిస్థితి నెలకొంది. మంగళవారం ఉదయం పాడేరుతో పాటు అనేక ప్రాంతాల్లో ఉదయం 10 గంటల వరకు దట్టంగానే పొగమంచు కమ్మేసింది. దీంతో వాహనాలు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించాయి. జనం ఉన్నిదుస్తులు ధరించి, చలి మంటలు కాగుతూ చలి నుంచి ఉపశమనం పొందుతున్నారు.

అరకులోయలో అత్యల్ప ఉష్ణోగ్రత

ఏజెన్సీలో మంగళవారం కొయ్యూరు, చింతపల్లి మినహా మిగిలిన ప్రాంతాల్లో సింగిల్‌ డిజిట్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అరకులోయలో 5.7, జి.మాడుగులలో 5.9, ముంచంగిపుట్టులో 7.7, పెదబయలులో 9.6, హుకుంపేటలో 9.7, చింతపల్లిలో 11.3, కొయ్యూరులో 14.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

కొయ్యూరులో..

కొయ్యూరు: మండలంలో పొగమంచు దట్టంగా కురుస్తోంది. మంగళవారం ఉదయం 10 గంటలు దాటినా మంచు తెరలు వీడలేదు. ప్రధాన రహదారులను పొగమంచు కమ్మేయడంతో వాహనాలు దగ్గరకు వచ్చే వరకు కనిపించడం లేదు. దీంతో వాహనదారుల లైట్ల వెలుతురులో నెమ్మదిగా రాకపోకలు సాగించారు. పొగమంచు ప్రభావం ఇలాగే కొనసాగితే మామిడి, జీడిమామిడి తోటలకు తీవ్ర నష్టం తప్పదని రైతులు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - Jan 20 , 2026 | 11:22 PM