మలేరియాకు మందులేవి?
ABN , Publish Date - Aug 12 , 2026 | 12:30 AM
ఏజెన్సీలోని ఆస్పత్రుల్లో మలేరియా రోగులకు అవసరమైన మందులు ఇవ్వడం లేదని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్రతో పాటు పలువురు జడ్పీటీసీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.
- అల్లూరి జిల్లాలో పీహెచ్‌సీ నుంచి జిల్లా ఆస్పత్రి వరకు అంతటా కొరత
- కేసులు పెరుగుతున్నా మందులు ఎందుకు సిద్ధం చేసుకోలేదు
- జడ్పీ స్థాయీ సంఘ సమావేశాల్లో సభ్యుల నిలదీత
విశాఖపట్నం, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): ఏజెన్సీలోని ఆస్పత్రుల్లో మలేరియా రోగులకు అవసరమైన మందులు ఇవ్వడం లేదని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్రతో పాటు పలువురు జడ్పీటీసీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాకాలంలో మలేరియా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి జిల్లా ఆస్పత్రి వరకు మందులు అడిగితే లేవని చెబుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి మలేరియా కేసులు పెరుగుతున్నాయని, అటువంటప్పుడు అవసరమైన మందులు ఎందుకు సిద్ధం చేసుకోలేదని నిలదీశారు. మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో చైర్‌పర్సన్ సుభద్ర అధ్యక్షతన స్థాయీ సంఘ సమావేశాలు జరిగాయి. నాలుగో స్థాయీ సంఘ సమావేశంలో వైద్య, ఆరోగ్యశాఖపై జరిగిన చర్చ సందర్భంగా చైర్‌పర్సన్ సుభద్ర మాట్లాడుతూ ముంచంగిపుట్టులో మలేరియా జ్వరంతో బాధపడే రోగులు పీహెచ్‌సీకి వెళితే ఒక డోసు వేసి రెండో డోసు నుంచి బయట మందుల షాపుల్లో కొనుక్కుని తీసుకురావాలని సూచిస్తున్నారని వ్యాఖ్యానించారు. అనంతగిరి, పెదబయలు జడ్పీటీసీ సభ్యులు గంగరాజు, బొంజిబాబు మాట్లాడుతూ గ్రామాల్లో మలేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్న సమయంలో పీహెచ్‌సీలలో మందులు లేవని చెబుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై అల్లూరి సీతారామరాజు జిల్లా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ నీలవేణి బదులిస్తూ మలేరియా వ్యాధికి సంబంధించి మందుల కొరత ఉందన్నారు. చైర్‌పర్సన్ సుభద్ర మాట్లాడుతూ పాడేరు దరి అంట్లమామిడిలో పారిశుధ్యలోపంతో మలేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని పేర్కొన్నారు. దీనికి జిల్లా మలేరియా అధికారి తులసి బదులిస్తూ ఈ ఏడాది ఇంత వరకు 2,417 మలేరియా కేసులు నమోదయ్యాయన్నారు. సాధారణ మలేరియాకు మందులు, ప్లాస్మోడియం మలేరియాకు సంబంధించి 14 ఏళ్లలోపు పిల్లలకు ఇంజెక్షన్లు, మందులు అందుబాటులో ఉన్నాయని, 14 ఏళ్లుపైబడిన వారికి ఇంజెక్షన్ల కొరత ఉందన్నారు. మలేరియా సీజన్ కావడంతో ప్రతి పీహెచ్‌సీ నుంచి జిల్లా ఆస్పత్రి వరకు మందుల కొనుగోలుకు బడ్జెట్ ఉందని పేర్కొంటూ ఇదే విషయాన్ని ఇప్పటికే చెప్పామన్నారు. మందులు సరఫరా చేయాలని కలెక్టర్ ద్వారా ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు.
ఆశ్రమ పాఠశాలకు కొత్త భవనం నిర్మించాలి
అనంతగిరి జడ్పీటీసీ సభ్యుడు గంగరాజు మాట్లాడుతూ మండలంలో శిథిలావస్థకు చేరిన ఎండ్లపల్లివలస ఆశ్రమ పాఠశాల స్థానంలో కొత్త భవనం నిర్మించాలని కోరారు. చైర్‌పర్సన్ మాట్లాడుతూ చింతపల్లిలో అప్‌గ్రేడ్ చేసిన ఉన్నత పాఠశాలల్లో వసతులు లేవని, పాడేరు కేజీబీవీ హాస్టల్‌ను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఉమ్మడి జిల్లాలో అన్ని ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థులకు అన్ని రకాల సదుపాయాలు కల్పించడం, వేడి ఆహారం అందించడం, మరుగుదొడ్లు శుభ్రంగా ఉండేలా చూడడంతో పాటు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
తొలుత రెండు, ఆరు, ఒకటి, ఏడో స్థాయీ సంఘ సమావేశాల్లో విద్య, హౌసింగ్, డ్వామా, పంచాయతీరాజ్, సంక్షేమశాఖలపై చర్చించారు. హౌసింగ్, విద్యాశాఖలపై జరిగిన చర్చల సందర్భంగా కొందరు సభ్యులు అడిగిన ప్రశ్నలకు జవాబు ఇచ్చే సమయంలో అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యాశాఖపై చర్చ సందర్భంగా కె.కోటపాడు కేజీబీవీలో బాలికలు అస్వస్థతకు గురికావడానికి తల్లిదండ్రులు ఇళ్ల నుంచి తీసుకువచ్చిన ఆహారమే కారణమని అనకాపల్లి జిల్లా సమగ్ర శిక్ష అభియాన్ ఏపీసీ శ్రీరాములు చెప్పడాన్ని సభ్యులు తప్పుబట్టారు. కేజీబీవీ కిచెన్‌లో ఉన్న ఇబ్బందులను తొలగించాలని సూచించారు. సమావేశాల్లో పలువురు సభ్యులతో పాటు సీఈవో పి.నారాయణమూర్తి, ఇతర అధికారులు పాల్గొన్నారు.