Share News

బేబీ కిట్లు ఏవీ.. ఎక్కడ?

ABN , Publish Date - May 31 , 2026 | 11:14 PM

ప్రభుత్వాస్పత్రిలో పుట్టిన నవజాత శిశువులకు ఇప్పటికీ ఎన్టీఆర్‌ బేబీ కిట్లు అందడం లేదు. గత వైసీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని నీరుగార్చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ పథకాన్ని పునరుద్ధరిస్తూ రూ.51.14 కోట్ల నిధులను కేటాయించి 2025 మే 19న జీవో నంబరు 61 విడుదల చేసింది.

బేబీ కిట్లు ఏవీ.. ఎక్కడ?
లోతుగెడ్డ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బేబీ కిట్‌ అందజేస్తున్న వైద్యాధికారి(ఫైల్‌)

నవజాత శిశువులకు అందుబాటులోకి రాని ఎన్టీఆర్‌ బేబీ కిట్లు

జీవో విడుదల చేసి ఏడాది గడిచినా అమలుకాని వైనం

శిశువుల సంరక్షణకు అవస్థలు పడుతున్న బాలింతలు

చింతపల్లి, మే 31 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వాస్పత్రిలో పుట్టిన నవజాత శిశువులకు ఇప్పటికీ ఎన్టీఆర్‌ బేబీ కిట్లు అందడం లేదు. గత వైసీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని నీరుగార్చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ పథకాన్ని పునరుద్ధరిస్తూ రూ.51.14 కోట్ల నిధులను కేటాయించి 2025 మే 19న జీవో నంబరు 61 విడుదల చేసింది. ఆస్పత్రిలో ప్రసవం పొందిన తల్లులకు నవజాత శిశువుల సంరక్షణకు అవసరమైన రూ.1,410 విలువైన సామగ్రిని కిట్‌ ద్వారా అందజేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే జీవో విడుదల చేసి ఏడాది గడిచినా ఈ పథకం ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. దీంతో బాలింతలు శిశువుల సంరక్షణకు అవస్థలు పడుతున్నారు.

నవజాత శిశువుకి ఏడాది వయస్సు వచ్చే వరకు ప్రత్యేక శ్రద్ధతో సంరక్షించాలి. శిశువుకి వెచ్చదనం ఇవ్వాలి. దీని కోసం శిశువుల బెడ్‌ను ఉపయోగించాలి. శిశువులకు వేసే దుస్తులు, టవెల్స్‌, ఆయిల్‌, సబ్బు, షాంపూ ప్రత్యేకంగా ఉండాలి. ఈ విధంగా శిశువులను సంరక్షించడం వల్ల వ్యాధులకు దూరంగా ఉండడంతో పాటు శిశు మరణాలు నియంత్రించవచ్చు. శిశువుల సంరక్షణకు ఉపయోగించే బేబీ కిట్‌ మార్కెట్‌లో రూ.1500 నుంచి రూ.1800 ధరకు లభిస్తున్నాయి. అయితే గిరిజనులు, నిరుపేద కుటుంబాలకు చెందిన తల్లులకు బేబీ కిట్లు కొనుగోలు చేసుకునే ఆర్థిక పరిస్థితి ఉండదు. దీంతో గిరిజన ప్రాంతంలో శిశువుల సంరక్షణకు పాత దుస్తులను ఉపయోగిస్తుంటారు. దీంతో శిశువుల్లో వ్యాధులు ప్రబలుతున్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన నాటి టీడీపీ ప్రభుత్వం 2016లో ఎన్టీఆర్‌ బేబీ కిట్ల పంపిణీని ప్రారంభించింది. ఆస్పత్రిలో ప్రసవం పొందిన ప్రతి తల్లికి బేబీ కిట్‌ అందజేసేవారు. దీంతో తల్లులకు బేబీ కిట్లు కొనుగోలు చేసే ఆర్థిక భారం తగ్గింది.

పథకాన్ని రద్దు చేసిన గత వైసీపీ ప్రభుత్వం

2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఎన్టీఆర్‌ బేబీ కిట్ల పంపిణీ పథకాన్ని రద్దు చేసింది. ప్రభుత్వాస్పత్రులలో ప్రసవం పొందిన తల్లులకు కిట్ల పంపిణీని నిలిపివేసింది. దీంతో తల్లులు బేబీ కిట్లు కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గిరిజన ప్రాంతంలో శీతాకాలం చలి వణికిస్తుంది. ఈ సమయంలో శిశువుల సంరక్షణకు కచ్చితంగా బేబీ కిట్లు ఉండాలి. గిరిజనులందరూ బేబీ కిట్లు కొనుగోలు చేసుకునే ఆర్థిక పరిస్థితి లేదు. దీంతో గత ఆరేళ్లగా తల్లులు శిశువులను సంరక్షించేందుకు నానా అవస్థలు పడుతున్నారు.

ఏడాదిగా ఎదురుచూపు

బేబీ కిట్ల కోసం ప్రసవానికి ఆస్పత్రిలో చేరిన గర్భిణులు, బాలింతలు ఏడాదిగా ఎదురుచూస్తున్నారు. జీవో విడుదల చేసిన నెల రోజుల్లో బేబీ కిట్లు అందుబాటులోకి వస్తాయని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ప్రకటించింది. దీంతో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమికోన్నత, ఏరియా, జిల్లా ఆస్పత్రుల్లో నాణ్యమైన బేబీ కిట్లు అందుబాటులోకి వస్తాయని గర్భిణులు, బాలింతలు ఆశపడ్డారు. అయితే ఈ పథకం ఇప్పటి వరకు అందుబాటులోకి రాకపోవడంతో వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

బేబీ కిట్లలో 11 రకాల వస్తువులు

నవజాత శిశువులకు పంపిణీ చేసే ఎన్టీఆర్‌ కిట్‌లో 11 రకాల వస్తువులను అందజేయనున్నట్టు వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ జీవోలో పేర్కొంది. ప్రధానంగా దోమతెర కలిగిన బేబీ బెడ్‌, బేబీ మాంకితోష్‌, బేబీ డ్రెస్‌, టవెల్‌, న్యాపీ, జాన్‌సన్‌ 200 గ్రాముల పౌడర్‌, 100 మిల్లీలీటర్ల షాంపూ, 200 మిల్లీలీటర్ల ఆయిల్‌, బేబీ సబ్బు, సబ్బు బాక్స్‌, రేటెల్‌ బొమ్మను కిట్‌ ద్వారా అందజేయనున్నట్టు తెలిపారు. ఇప్పటికైనా వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు స్పందించి సాధ్యమైనంత త్వరగా ఎన్టీఆర్‌ బేబీ కిట్ల పంపిణీ ప్రక్రియను పునఃప్రారంభించాలని గర్భిణులు, బాలింతలు కోరుతున్నారు.

Updated Date - May 31 , 2026 | 11:14 PM