సోలార్ సామగ్రి దొంగలపై చర్యలేవి..?
ABN , Publish Date - Apr 03 , 2026 | 10:58 PM
జీకేవీధి, చింతపల్లి మండలాల్లో సోలార్ విద్యుత్ సామగ్రి దొంగలపై చర్యలు తీసుకోవడంలో ఏపీఈపీడీసీఎల్ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఏడాది క్రితం సోలార్ విద్యుత్ సామగ్రి దొంగల వ్యవహారాన్ని కూటమి నాయకులు బయటపెట్టారు. అప్పట్లో దర్యాప్తు చేస్తున్నామంటూ విజిలెన్స్ అధికారులు హడావిడి చేశారు. సోలార్ విద్యుత్ సామగ్రి దొంగల సమాచారం పక్కాగా సేకరించినప్పటికి విజిలెన్స్ అధికారులు కనీస చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
ఏడాది క్రితం విజిలెన్స్ దర్యాప్తు
కనీస చర్యలు తీసుకోని ఈపీడీసీఎల్
దర్జాగా తిరుగుతున్న దోషులు
పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేసిన కూటమి నేతలు
చింతపల్లి/గూడెంకొత్తవీధి, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): చింతపల్లి, జీకేవీధి మండలాల్లో గత టీడీపీ ప్రభుత్వం 2016 నుంచి 2019 వరకు విడతల వారీగా శివారు గిరిజన గ్రామాలకు సోలార్ విద్యుత్ ప్లాంట్‌లను ఏర్పాటు చేసింది. ఈ ప్లాంట్‌ల ద్వారా గిరిజనులకు విద్యుత్ సరఫరా చేశారు. ఒక్కొక్క విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు రూ.25 నుంచి రూ.50 లక్షల వరకు ప్రభుత్వం ఖర్చు చేసింది. చింతపల్లి, జీకేవీధి మండలాల్లో 123 ప్లాంట్లు ఏర్పాటు చేసింది. అయితే 2020 నుంచి సోలార్ విద్యుత్ ప్లాంట్‌లు ఉన్న గిరిజన గ్రామాలకు ఈపీడీసీఎల్ అధికారులు విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసి గ్రిడ్ విద్యుత్ సరఫరా చేశారు. గ్రిడ్ విద్యుత్ అందుబాటులోకి రావడంతో గ్రామాల్లో సోలార్ ప్లాంట్ల వినియోగం నిలిచిపోయింది. ఇదే అదనుగా భావించిన కొంతమంది ఈపీడీసీఎల్ శాఖ పరిధిలో పనిచేసే ఉద్యోగులమని చెప్పుకుంటూ సోలార్ ప్లాంట్‌లోని బ్యాటరీలు, సోలార్ ప్లేట్లు దొంగిలించి మైదాన ప్రాంతాల్లో విక్రయించుకుని సొమ్ము చేసుకున్నారు. ఈ వ్యవహారంలో కోట్ల రూపాయలను దోచుకున్నారే ఆరోపణలు ఉన్నాయి. ఈ అక్రమాలను కూటమి నాయకులు 2024 నవంబరులో వెలుగులోకి తీసుకొచ్చారు. పత్రికల్లోనూ సోలార్ అక్రమాలపై కథనాలు వచ్చాయి. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఈపీడీపీఎల్ ఉన్నతాధికారులు విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో నాటి విజిలెన్స్ ఎస్పీ వెంకట రామకృష్ణ ప్రసాద్ పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్ వెంకినాయుడు, ఎస్‌ఐలు ప్రమీల, మురళీకృష్ణ దర్యాప్తు చేశారు. రెండు మండలాల్లోని సోలార్ విద్యుత్ ప్లాంట్లు కలిగిన గ్రామాలను సందర్శించి సామగ్రిని ఎవరు తీసుకొని వెళ్లారనే కోణంలో విచారణ చేపట్టారు. విజిలెన్స్ అధికారులు విచారణలో సోలార్ సామగ్రి మాయం వెనుక కొంతమంది వైసీపీ నాయకులు, పాత్రికేయుల హస్తం ఉన్నట్టు గుర్తించారు. ఈపీడీసీఎల్ చేపట్టిన విచారణలో దోషులపై చర్యలు ఉంటాయని కూటమి నాయకులు, ప్రాంతీయ ఆదివాసీలు భావించారు. కానీ విచారణ జరిగి ఏడాది గడిచినా దోషులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో గూడెంకొత్తవీధికి చెందిన కొంతమంది కూటమి నాయకులు తాజాగా సోలారు సామగ్రి దొంగిలించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని మరోసారి పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఇప్పటికైన ఈపీడీసీఎల్ అధికారులు దోషులపై చర్యలు తీసుకుంటారా? మౌనం వహిస్తారా అనేది వేచి చూడాలి.