Share News

హెల్త్‌ సూపర్‌వైజర్‌పై చర్యలేవి?

ABN , Publish Date - Apr 09 , 2026 | 11:31 PM

సచివాలయ ఏఎన్‌ఎంపై వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై హెల్త్‌ సూపర్‌వైజర్‌పై పోలీసు కేసు నమోదైనప్పటికీ వైద్య ఆరోగ్యశాఖాధికారులు కనీస చర్యలు చేపట్టకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

హెల్త్‌ సూపర్‌వైజర్‌పై చర్యలేవి?
అనకాపల్లి డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న వైద్య సిబ్బంది

ఏఎన్‌ఎంను వేధించిన ఘటనపై పోలీసు కేసు నమోదైనా పట్టించుకోని వైద్య ఆరోగ్యశాఖాధికారులు

బాధితురాలికి న్యాయం చేయాలని గిరిజన సంఘాల డిమాండ్‌

విశాఖపట్నం, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): సచివాలయ ఏఎన్‌ఎంపై వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై హెల్త్‌ సూపర్‌వైజర్‌పై పోలీసు కేసు నమోదైనప్పటికీ వైద్య ఆరోగ్యశాఖాధికారులు కనీస చర్యలు చేపట్టకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి బాధితురాలు, గిరిజన సంఘాల నేతలు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. పాడేరు మండలం సలుగు గ్రామానికి చెందిన గుజ్జెలి రాజ్యలక్ష్మి అనకాపల్లి జిల్లా దేవరాపల్లి పీహెచ్‌సీ పరిధి గర్సింగి సచివాలయంలో ఏఎన్‌ఎంగా పని చేస్తున్నారు. ఈ క్రమంలో హెల్త్‌ సూపర్‌వైజర్‌ పుష్పరాజు ఆమెను వేధింపులకు గురి చేస్తుండడంతో పాటు తన మాట వినకపోతే ఉద్యోగం పోతుందంటూ బెదిరించడంతో ఆవేదనకు గురై మార్చి 29వ తేదీ రాత్రి రాజ్యలక్ష్మి మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను భర్త నాగరాజు హుటాహుటిన పాడేరు జిల్లా ఆస్పత్రిలో చేర్పించి చికిత్సలు చేయడంతో ఆమె ప్రాణాపాయం నుంచి బయట పడింది. దీంతో తనకు జరిగిన అన్యాయాన్ని ప్రజా, వైద్య ఉద్యోగుల సంఘాల నేతలకు తెలిపి, వారి సహకారంతో ఆమె స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఘటనపై దేవరాపల్లి పోలీసులు దర్యాప్తు

ఏఎన్‌ఎం రాజ్యలక్ష్మి ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు ఈ నెల 5న పలు సెక్షన్లతో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, ఆ కేసును దేవరాపల్లి పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ చేపడుతున్నారు. ఈ క్రమంలో బాధితురాలు, ఆమె తోటి ఏఎన్‌ఎంలను పోలీసులు కలిసి వివరాలు సేకరించారు. అలాగే వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల అనుమతితో పుష్పరాజును అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. కాగా తనపై పోలీసు కేసు పెట్టిన రాజ్యలక్ష్మి, ఆమెకు మద్దతుగా ఉన్న ఏఎన్‌ఎంలపై హెల్త్‌ సూపర్‌వైజర్‌ పుష్పరాజు పరోక్షంగా బెదిరింపులకు పాల్పడుతున్నాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 12 ఏళ్లుగా అక్కడే హెల్త్‌ సూపర్‌వైజర్‌గా పని చేస్తున్న ఆయన దేవరాపల్లి పీహెచ్‌సీలో వైద్యులు, ఇతర సిబ్బందిపై పెత్తనం చెలాయిస్తుంటారని బాధితులు తెలిపారు. గతంలో తన మాట వినని ఒక డాక్టర్‌ను అక్కడి నుంచి బదిలీ చే యించడంతో మిగిలిన సిబ్బంది ఆయనంటే భయపడుతున్నట్టు తెలిసింది. పుష్పరాజు భార్య అక్కడే సీనియర్‌ ఏఎన్‌ఎంగా పని చేయడం, ఆమె పనులను జూనియర్‌ ఏఎన్‌ఎంలకు అప్పగించడం, ఈ క్రమంలో ఆయన మాట వినని వారిని బెదిరించడం మామూలైపోయిందని వైద్య సిబ్బంది అంటున్నారు. ఆయనకు ఎదురు తిరిగిన రాజ్యలక్ష్మిని మరింతగా వేధింపులకు గురి చేయడం వల్లే ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని తోటి సిబ్బంది అంటున్నారు. అయితే ఇంత జరిగినా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఈ ఘటనపై కనీసం పట్టించుకోకపోవడం, ఎఫ్‌ఐఆర్‌ నమోదైన వ్యక్తిపై కనీస చర్యలు చేపట్టకపోవడంపై బాధితురాలు రాజ్యలక్ష్మి, గిరిజన సంఘాల నేతలు రాధాకృష్ణ, శెట్టి నాగరాజు, కాంగు చిన్ని, తదితరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై గురువారం తోటి వైద్య సిబ్బంది, సంఘ నేతలు డీఎంహెచ్‌వో కార్యాలయం ముందు ఆందోళన చేపట్టి, అనంతరం అనకాపల్లి కలెక్టర్‌ , జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారికి ఫిర్యాదులు చేశారు. ఏఎన్‌ఎంను వేధించిన హెచ్‌ఎస్‌ పుష్పరాజును అరెస్టు చేసి, సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Apr 09 , 2026 | 11:31 PM