నకిలీ నియామకాలపై చర్యలేవి?
ABN , Publish Date - Jul 24 , 2026 | 12:51 AM
గూడెంకొత్తవీధి మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు, వ్యవసాయశాఖలో ఉద్యోగాలు కల్పిస్తున్నట్టు నకిలీ ఉత్తర్వులు ఇచ్చి గిరిజన నిరుద్యోగుల నుంచి రూ.లక్షలు కాజేసిన మోసగాళ్లపై చర్యలు తీసుకోవడానికి అధికారులు వెనుకంజ వేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. పాఠశాలల్లో నెల రోజులపాటు అనధికారికంగా విధులు నిర్వహించిన నకిలీ ఉద్యోగులను తొలగించి విద్యాశాఖ చేతులు దులిపేసుకుందే తప్ప భవిష్యత్తులో ఈ అక్రమ దందాను పూర్తిగా అరికట్టేందుకు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం, పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది.
- పాఠశాలలు, వ్యవసాయ శాఖల్లో ఉద్యోగాలు ఇచ్చినట్టు ఫేక్ ఉత్తర్వులు
- గిరిజన నిరుద్యోగుల నుంచి రూ.లక్షలు కాజేసిన మోసగాళ్లు
- స్కూళ్లలో నెల రోజుల పాటు విధులు నిర్వహించిన 49 మంది
- ‘ఆంధ్రజ్యోతి’ కథనంతో ఉద్వాసన పలికిన విద్యాశాఖ అధికారులు
- పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంపై అనుమానాలు
గూడెంకొత్తవీధి/చింతపల్లి, జూలై 23 (ఆంధ్రజ్యోతి): గూడెంకొత్తవీధి మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు, వ్యవసాయశాఖలో ఉద్యోగాలు కల్పిస్తున్నట్టు నకిలీ ఉత్తర్వులు ఇచ్చి గిరిజన నిరుద్యోగుల నుంచి రూ.లక్షలు కాజేసిన మోసగాళ్లపై చర్యలు తీసుకోవడానికి అధికారులు వెనుకంజ వేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. పాఠశాలల్లో నెల రోజులపాటు అనధికారికంగా విధులు నిర్వహించిన నకిలీ ఉద్యోగులను తొలగించి విద్యాశాఖ చేతులు దులిపేసుకుందే తప్ప భవిష్యత్తులో ఈ అక్రమ దందాను పూర్తిగా అరికట్టేందుకు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం, పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది.
సాధారణంగా ప్రభుత్వ శాఖలు, పాఠశాలల్లో విధులు నిర్వహించేందుకు విద్యాశాఖ అనుమతి, కలెక్టర్, సంబంధితశాఖ జిల్లా స్థాయి అధికారుల అనుమతి ఉండాలి. నియామకాలకు సంబంధించి పత్రికల్లో ప్రకటనలు ఇస్తారు. ప్రభుత్వ సంస్థలు, పాఠశాలల్లో స్వచ్ఛంద సంస్థలు కార్యక్రమాలు నిర్వహించాల్సి వచ్చినా కలెక్టర్, ఐటీడీఏ పీవో, జిల్లా విద్యాశాఖ అధికారి అనుమతి తప్పనిసరిగా ఉండాలి. అయితే గూడెంకొత్తవీధి మండలంలో పలు పాఠశాలల్లో సుమారు 49 మంది వ్యక్తులు నకిలీ ఉత్తర్వులతో ఒకేషనల్ ట్రైనర్, వలంటీర్(సపోర్టింగ్ రోల్), అటెండర్, రికార్డు అసిస్టెంట్, క్లర్కు, కంప్యూటర్ ఆపరేటర్లుగా విధులు నిర్వహిస్తుంటే విద్యాశాఖ అధికారులు ఎందుకు మౌనం వహించారనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వ పాఠశాలల్లో నకిలీ ఉత్తర్వులతో నిరుద్యోగులను చేర్చి వారి నుంచి మోసగాళ్లు నెల రోజుల వ్యవధిలో సుమారు రూ.1.5 కోట్ల వరకు కాజేశారు.
స్పందించని పోలీసుశాఖ
గిరిజన ప్రాంతంలో నకిలీ ఉత్తర్వులతో ప్రైవేటు వ్యక్తులు అక్రమ వసూళ్లకు పాల్పడుతూ అమాయక గిరిజన నిరుద్యోగులను మోసం చేసి, ప్రభుత్వ పాఠశాలల్లో లేని పోస్టులను కేటాయించిన ఉదంతం వెలుగులోకి వచ్చినా పోలీసుశాఖ స్పందించలేదు. గతంలో గిరిజన ప్రాంతంలో గొలుసు బిజినెస్, లాటరీలతో పాటు ఒక ట్రస్టు నిబంధనలకు విరుద్ధంగా అక్రమ వసూళ్లకు పాల్పతుందని గుర్తించిన పోలీసులు ఫిర్యాదు రాకపోయినా నాటి చింతపల్లి ఏఎస్పీ ప్రతాప్ శివకిశోర్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టి కార్యకలాపాలను నిలిపివేశారు. పోలీసుల చర్యల వల్ల అమాయక గిరిజనులు అక్రమ వ్యాపారాల ఉచ్చులో పడలేదు. తాజాగా గూడెంకొత్తవీధి మండలంలో రూ.లక్షలు వసూలు చేసి, నకిలీ నియామక పత్రాలను ప్రైవేటు వ్యక్తులు జారీ చేసి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మరోవైపు ఆదివాసీ నిరుద్యోగ యువతను మోసం చేసినా పోలీసు ఉన్నతాధికారులు ఇంత వరకు విచారణ ప్రారంభించలేదు. కనీసం ఈ అక్రమ దందా వెనుక ఎవరు ఉన్నారనేది పరిశీలించిన దాఖలాలు లేవు. దీంతో మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. సమగ్ర శిక్ష, భారత్ సేవక్ సమాజ్ పేరిట ఉద్యోగాలు ఇస్తామని గిరిజన నిరుద్యోగులను మోసం చేస్తున్న ఈ ముఠా నెట్‌వర్క్ ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఉందని తెలిసింది. అన్ని ప్రాంతాల్లో వీరు మధ్యవర్తులను ఏర్పాటు చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారని సమాచారం. దీనిపై కలెక్టర్, ఎస్పీ దృష్టి సారించి గిరిజన నిరుద్యోగులు మోసపోకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.