ఉల్లంఘనులపై చర్యలేవీ?
ABN , Publish Date - Jun 21 , 2026 | 12:52 AM
జిల్లాలో అక్రమ ఇసుక, గ్రావెల్ తవ్వకాలు జోరుగా సాగుతున్నా గనుల శాఖ విజిలెన్స్ యంత్రాంగం ప్రేక్షక పాత్ర పోషిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శారదా, వరహా, పెద్దేరు నదీ పరివాహక ప్రాంతాల్లో భారీస్థాయిలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి.
- అక్రమ ఇసుక, గ్రావెల్ దందాపై నిఘా కరువు
- అన్ని మండలాల్లో అనధికార తవ్వకాలు
- ఎక్కడికక్కడ ఇసుక, గ్రావెల్ నిల్వ కేంద్రాలు
- మొక్కుబడి తనిఖీలతో గనుల శాఖ, విజిలెన్స్ కాలక్షేపం
(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)
జిల్లాలో అక్రమ ఇసుక, గ్రావెల్ తవ్వకాలు జోరుగా సాగుతున్నా గనుల శాఖ విజిలెన్స్ యంత్రాంగం ప్రేక్షక పాత్ర పోషిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శారదా, వరహా, పెద్దేరు నదీ పరివాహక ప్రాంతాల్లో భారీస్థాయిలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి.
ప్రభుత్వం ఇసుక తవ్వకాల కోసం నదీ పరివాహక ప్రాంతాల్లో 20 ప్రదేశాలను మాత్రమే ఎంపిక చేసి ఇసుక సేకరణకు అనుమతిచ్చింది. కానీ అక్రమార్కులు నదీ తీర ప్రాంతాల్లో ఎక్కడికక్కడ ఇసుక అక్రమ తవ్వకాలు జరిపి రవాణా చేసుకొని జేబులు నింపుకుంటున్నారు. జిల్లాలో ప్రభుత్వం తగినన్ని ఇసుక నిల్వలు లేవనే ఉద్దేశంతో శ్రీకాకుళం, రాజమహేంద్రవరం నుంచి ఇసుక రవాణా చేసుకొని నిల్వ చేసుకొని అమ్ముకొనేలా అనకాపల్లి, నక్కపల్లి, నర్సీపట్నం, అచ్యుతాపురం, మాడుగుల, సబ్బవరం, చోడవరంలలో స్టాక్ పాయింట్లకు అనుమతి ఇచ్చింది. అక్రమ ఇసుక తవ్వకాల పుణ్యమాని ప్రస్తుతం స్టాక్ పాయింట్లు కనుమరుగయ్యాయి. మరోవైపు గ్రావెల్ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఇసుక, గ్రావెల్ అక్రమ రవాణా కారణంగా ప్రభుత్వానికి రావాల్సిన రాయల్టీ ఆదాయం కోల్పోతుండగా, అక్రమార్కులు మాత్రం లక్షలు ఆర్జిస్తున్నారు. అనకాపల్లి మండలం గొలగాం, భట్టపూడి, కుంచంగి, కూండ్రం, సంపతిపురం, సత్యనారాయణపురం గ్రామాల్లో గ్రావెల్ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. సబ్బవరం మండలం గంగవరంలో రాత్రి వేళ గ్రావెల్ తవ్వకాలు జరిపి రవాణా చేస్తున్నారు. పరవాడ, అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల్లో పలుచోట్ల ఇసుక, గ్రావెల్ దందా కొనసాగుతోంది. జిల్లాలో ఇసుక, గ్రావెల్ తవ్వకాలు, అక్రమ నిల్వ కేంద్రాలు దాదాపు అన్ని మండలాల్లో ఏర్పాటు చేశారు. ట్రాక్టరు ఇసుక లోడు దూరాన్ని బట్టి రూ.4 నుంచి రూ.6 వేలు వరకు ధర నిర్ణయించగా, ట్రాక్టర్ గ్రావెల్ లోడు రూ.3 వేల ధర పెట్టి దండుకుంటున్నారు. అచ్యుతాపురం, పరవాడ, రాంబిల్లి మండలాల్లో కొత్తగా ఏర్పాటవుతున్న ఫార్మా కంపెనీలకు మెరక పనులకు స్థానిక నేతలే గ్రావెల్ తరలింపు కాంట్రాక్టు పనులు తీసుకొని ప్రభుత్వ భూముల్లో గ్రావెల్ కొల్లగొడుతూ సొమ్ము చేసుకుంటున్నా విజిలెన్స్, రెవెన్యూ శాఖల అఽధికారులు అటుగా కన్నెత్తైనా చూడడం లేదనే విమర్శలున్నాయి.
మామూళ్ల మత్తులో....
అక్రమ తవ్వకాల నియంత్రణ బాధ్యత కలిగిన గనుల శాఖ, రెవెన్యూ, పోలీసు శాఖాధికారులు సమన్వయంతో పని చేయాల్సి వున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందనే ఆరోపణలు ఉన్నాయి. కొందరు అధికారులు తమ వాటాలు తీసుకొని అక్రమ తవ్వకాలకు పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారనే విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. దీంతో అక్రమార్కులు ఎలాంటి భయం లేకుండా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం, మాడుగుల, చీడికాడ, దేవరాపల్లి పరిసరాల్లోని తోటలు, ఖాళీ ప్రదేశాల్లో రాత్రి వేళ నదుల నుంచి ఇసుక రవాణా చేసుకొని నిల్వ చేస్తున్నారు. పగలు ఎవరికీ అనుమానం రాకుండా అమ్ముకొని జేబులు నింపుకుంటున్నారు. వాస్తవానికి ప్రస్తుతం కాలనీల్లో పేదల ఇళ్ల నిర్మాణాలు జరగడం లేదు. కానీ ఉచిత ఇసుక పేరుతో కొందరు ఇసుక రవాణా చేస్తూ, ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకొంటున్నారు. గ్రావెల్ తవ్వకాలు చేపట్టాలంటే రెవెన్యూ, గనులు, స్థానిక పంచాయతీల అనుమతులు తప్పనిసరి. తవ్విన గ్రావెల్‌ను రవాణా చేయాలంటే చెల్లుబాటు అయ్యే అనుమతి పత్రాలు, రవాణా చలానాలు ఉండాలి. అయితే జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు పొందకుండానే కొందరు స్థానిక నేతలు రాత్రి వేళలో గ్రావెల్ తవ్వకాలు జరిపి స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. గ్రామాల శివార్లలో, రహదారుల పక్కన పెద్దఎత్తున గ్రావెల్ నిల్వలు ఏర్పాటుచేసి, అవసరమైన వారికి విక్రయిస్తున్నారు. అదే విధంగా నదీ పరివాహక ప్రాంతాల్లో అక్రమంగా తవ్విన ఇసుకను నిల్వ చేసి విక్రయుస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు.