Share News

నకిలీలలపై చర్యలేవి?

ABN , Publish Date - Aug 04 , 2026 | 12:24 AM

మన్యంలో కాంట్రాక్టు పద్ధతిలో సమగ్ర శిక్ష ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తామని ఒక సంస్థ ప్రచారం చేయడంతో గిరిజన నిరుద్యోగులు నమ్మి వేలాది రూపాయలు ఇచ్చి మోసపోయారు.

నకిలీలలపై చర్యలేవి?
సప్పర్ల ఆశ్రమ పాఠశాలలో ఉద్యోగం కోసం రూ.50 వేలు సత్య విజయ్‌కుమార్‌కు ఇస్తున్న గిరిజన నిరుద్యోగి(ఫైల్‌ ఫొటో)

ప్రభుత్వ పాఠశాలలు, వ్యవసాయ శాఖలో ఉద్యోగాల పేరిట నకిలీ నియామక పత్రాలతో బురిడీ

గిరిజన యువత నుంచి రూ.లక్షలు వసూలు చేసిన విశాఖ వాసి

మోసపోయామని ఆలస్యంగా గుర్తించిన పలువురు బాధితులు

నెల రోజుల క్రితం జీకే వీధి పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందన కరువు

‘ఆంధ్రజ్యోతి’లో వరుస కథనాలు రావడంతో 49 మంది తొలగింపు

ఆశ్రమ పాఠశాలల్లో కొనసాగుతున్న వైనం

గూడెంకొత్తవీధి/చింతపల్లి, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): మన్యంలో కాంట్రాక్టు పద్ధతిలో సమగ్ర శిక్ష ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తామని ఒక సంస్థ ప్రచారం చేయడంతో గిరిజన నిరుద్యోగులు నమ్మి వేలాది రూపాయలు ఇచ్చి మోసపోయారు. తమకు ఇచ్చినవి నకిలీ నియామక పత్రాలు అని ఆలస్యంగా తెలుసుకుని గగ్గోలు పెడుతున్నారు. ఈ దందాకు విశాఖపట్నానికి చెందిన సత్య విజయ్‌కుమార్‌ సూత్రధారి అని చెబుతున్నారు. ఇతనికి జీకే వీధి మండలంలో నలుగురు మధ్యవర్తులు ఉండగా, జిల్లా వ్యాప్తంగా చాలా మంది ఉన్నారని తెలిసింది. నెల రోజుల క్రితం జీకే వీధి పోలీసులను ఆశ్రయించినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై ‘ఆంధ్రజ్యోతి’లో వరుస కథనాలు వచ్చినా పోలీసులు స్పందించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

గూడెంకొత్తవీధి మండలంలోని గిరిజన సంక్షేమశాఖ, ప్రభుత్వ, మండల పరిషత్‌ యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు ఇప్పిస్తానని సుమారు 49 మంది నిరుద్యోగుల నుంచి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు నగదు తీసుకుని విశాఖపట్నానికి చెందిన సత్య విజయ్‌కుమార్‌ సమగ్ర శిక్ష, భారత్‌ సేవక్‌ సమాజ్‌ పేరిట నకిలీ నియామక ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారాన్ని ‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలతో బయటపెట్టడంతో సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్‌ వీఏ స్వామినాయుడు స్పందించి ప్రభుత్వ పాఠశాలల్లో అనధికారికంగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేయడంతో మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు 49 మందిని తొలగించారు. ఈవ్యవహారంపై సమగ్ర విచారణకు జిల్లా అధికారులు, పోలీసులు కనీస చర్యలు చేపట్టకపోవడంతో సత్య విజయ్‌కుమార్‌, మధ్యవర్తులు ఇప్పటికీ నకిలీ ఉత్తర్వులు జారీ చేస్తూ ప్రభుత్వ పాఠశాలలు, వ్యవసాయశాఖలో అక్రమ నియామకాలు చేపడుతున్నారని తెలిసింది. ఏజెన్సీ పదకొండు మండలాల పరిధి ప్రభుత్వ పాఠశాలల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని కేవలం పది రోజుల వ్యవధిలో 50 మందికి నకిలీ ఉత్తర్వులు జారీ చేసి రూ.కోటి వరకు వసూలు చేసినట్టు సమాచారం.

స్వచ్ఛందంగా పని చేస్తారని చెప్పడంతో..

సంస్థ నుంచి జీతాలు ఇస్తామని, స్వచ్ఛందంగా పని చేస్తారని విజయ్‌కుమార్‌ నకిలీ నియామక పత్రాల్లో పేర్కొనడంతో పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు నిరుద్యోగులను అనుమతించారు. అయితే వీరికి ఆరు నెలలుగా జీతాలు రాకపోవడంతో నిరుద్యోగులు ఆలోచనలో పడ్డారు. సప్పర్ల గిరిజన సంక్షేమశాఖ ఆశ్రమ పాఠశాలలో కిల్లో సతీశ్‌ రికార్డు అసిస్టెంట్‌గా, గెమ్మెలి రాజ్‌కుమార్‌ అటెండర్‌గా, పాంగి శ్రీను హిందీ టీచర్‌గా, వంతల హిమబిందు కంప్యూటర్‌ ఆపరేటర్‌గా, వంతల మెసయ్య హెల్త్‌ అసిస్టెంట్‌గా, పెదబడర గిరిజన సంక్షేమశాఖ బాలుర ఆశ్రమ పాఠశాలలో వంతల చంద్రరావు అటెండర్‌గా, లకే హరిబాబు వాచ్‌మన్‌గా, చింతపల్లి బాలికల ఆశ్రమ పాఠశాలలో కొర్ర భవాని శంకర్‌ రికార్డు అసిస్టెంట్‌గా, గాలికొండ గిరిజన సంక్షేమశాఖ ప్రాథమిక పాఠశాలలో లకే హరిబాబు టీచర్‌గా విజయకుమార్‌ ఇచ్చిన నకిలీ నియామక పత్రాలతో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు పని చేస్తున్నారు.

మోసపోయామని గుర్తించిన పలువురు నిరుద్యోగులు

విశాఖపట్నానికి చెందిన సత్య విజయ్‌కుమార్‌ సమగ్ర శిక్ష ఉద్యోగిగా చెప్పుకుంటూ నిరుద్యోగ యువతను బురిడీ కొట్టిస్తున్నాడని తెలిసింది. అతను రవికుమార్‌, సతీశ్‌కుమార్‌, కుమార్‌ అనే పేర్లతో నిరుద్యోగులను పరిచయం చేసుకున్నాడని, ఉద్యోగం ఇప్పిస్తానని ఒక్కొక్కరి నుంచి సుమారు రూ.2.5 లక్షల వరకు తీసుకున్నాడని తెలిసింది. మోసపోయామని ఆలస్యంగా తెలుసుకున్న నిరుద్యోగులు డీఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు సోమవారం చింతపల్లి వచ్చారు. అయితే ఆయన అందుబాటులో లేకపోవడంతో వెనుదిరిగి వెళ్లిపోయారు. నెల రోజుల క్రితమే జీకే వీధి పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, అందుకే డీఎస్పీని కలవడానికి వచ్చామని వారు తెలిపారు. ఉద్యోగాల కోసం అప్పులు చేసి రూ.లక్షలు సత్య విజయ్‌కుమార్‌కి ఇచ్చామని, తమ డబ్బులు తిరిగి ఇప్పించేలా పోలీసు అధికారులు, జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Updated Date - Aug 04 , 2026 | 12:24 AM