Share News

చక్కాగా తీర్చిదిద్దబడి..

ABN , Publish Date - May 24 , 2026 | 11:23 PM

మండలంలోని సుంకరమెట్ట పంచాయతీ కె.బెడ్డగుడ గ్రామంలో ఉన్న మండల ప్రజాపరిషత్‌ ప్రాథమిక పాఠశాల రూపురేఖలు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి. కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా అందంగా తయారైంది. దివీస్‌ లేబొరేటరీస్‌ లిమిటెడ్‌ సహకారంతో భవనాల ఆధునికీకరణ, మౌలిక వసతులు కల్పించారు.

చక్కాగా తీర్చిదిద్దబడి..
ఆధునికీకరించిన తరువాత ఇలా..

మారిన కె.బెడ్డగుడ ఎంపీపీ స్కూల్‌ రూపురేఖలు

దివీస్‌ లేబొరేటరీస్‌ సహకారంతో ఆధునికీకరణ

రూ.24.73 లక్షలతో వసతుల కల్పన

అరకులోయ, మే 24 (ఆంధ్రజ్యోతి): మండలంలోని సుంకరమెట్ట పంచాయతీ కె.బెడ్డగుడ గ్రామంలో ఉన్న మండల ప్రజాపరిషత్‌ ప్రాథమిక పాఠశాల రూపురేఖలు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి. కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా అందంగా తయారైంది. దివీస్‌ లేబొరేటరీస్‌ లిమిటెడ్‌ సహకారంతో భవనాల ఆధునికీకరణ, మౌలిక వసతులు కల్పించారు.

కె.బెడ్డగుడ ఎంపీపీ ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు 37 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. అయితే ఈ పాఠశాల అరకొర వసతులతో అధ్వానంగా ఉండేది. పాఠశాల ప్రాంగణంలో మరో భవనం అసంపూర్తిగా ఉండేది. మరుగుదొడ్లు, నీటి సదుపాయం లేక విద్యార్థులు ఇబ్బందులు పడేవారు. ప్రహరీ గోడకు బదులు కర్రలతో దడి కట్టి ఉండేది. ఈ పాఠశాల దుస్థితిని శారదా ట్రస్టు నిర్వాహకులు దివీస్‌ లేబొరేటరీస్‌ లిమిటెడ్‌ యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఆ కంపెనీ జనరల్‌ మేనేజర్‌ వై.ఎస్‌.కోటేశ్వరరావు, డిప్యూటీ మేనేజర్‌ పి.జగదీశ్‌, మేనేజర్‌ డి.సురేశ్‌కుమార్‌ ఆ పాఠశాలను ఆరు నెలల క్రితం సందర్శించారు. ఈ విషయాన్ని దివీస్‌ ఫార్మా కంపెనీ సీఎండీ డాక్టర్‌ మురళి కె.దివి దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన వెంటనే స్పందించి పాఠశాల ఆధునికీకరణకు సుమారు రూ.24.73 లక్షలు ఇచ్చారు. ఈ నిధులతో పాఠశాల రూపురేఖలను పూర్తిగా మార్చేశారు. ప్రస్తుతం భవనాల ఆధునికీకరణతో పాటు పక్కన అసంపూర్తిగా ఉన్న భవనాన్ని పూర్తి చేశారు. పిల్లలు ఆడుకునేందుకు ప్లే పార్కు, మంచినీటి సదుపాయం, మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. పాఠశాల చుట్టూ ప్రహరీ గోడ నిర్మించారు. తరగతి గదుల్లో అక్షరమాల, బొమ్మలను వేయించారు. పాఠశాల పునఃప్రారంభం నాటికి పూర్తి స్థాయిలో భవనాలు అందుబాటులోకి రానున్నాయి. కార్పొరేట్‌ స్కూల్‌కు దీటుగా పాఠశాల తయారుకావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - May 24 , 2026 | 11:23 PM