పక్కాగా ఏర్పాట్లు
ABN , Publish Date - Oct 16 , 2026 | 11:29 PM
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను పక్కాగా చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.నిషాంతి ఆదేశించారు.
అధికారులకు కలెక్టర్ నిషాంతి ఆదేశం
ఎన్నికల అధికారులకు దశలవారీగా శిక్షణ
కోడ్ ఆఫ్ కాండక్టు కచ్చితంగా అమలు చేయాలి
మారుమూల ప్రాంతాలకు ఎన్నికల సామగ్రి తరలింపుపై ప్రత్యేక దృష్టి సారించాలి
పాడేరు, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి):
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను పక్కాగా చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.నిషాంతి ఆదేశించారు. కలెక్టరేట్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై శుక్రవారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలోని 11 మండలాల్లో 11 జడ్పీటీసీ, 172 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలను నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధం కావాలన్నారు. ప్రధానంగా ఎన్నికల సంఘం సూచించిన మార్గదర్శకాలు, నిబంధనలను కచ్చితంగా అనుసరించి ఎన్నికల ప్రక్రియ చేపట్టాలన్నారు. ఈక్రమంలో రిటర్నింగ్ అధికారులు, మండల స్థాయి అధికారులు, సిబ్బందికి దశలవారీగా అవసరమైన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఎన్నికల నిర్వహణలో పాల్గొనే అధికారులు, సిబ్బందికి ఎన్నికల విధులపై సంపూర్ణ అవగాహన కల్పించాలని కలెక్టర్ పేర్కొన్నారు. మండలానికి ఒకరు చొప్పున ఎన్నికల రిటర్నింగ్ అధికారులుంటారని, వారికి రాష్ట్ర స్థాయి మాస్టర్ ట్రైనర్ల ద్వారా శిక్షణ ఇస్తారని, తర్వాత వారంతా మండలాల్లో సిబ్బందికి శిక్షణ ఇస్తారన్నారు. ప్రతి మండలంలో ఎన్నికల కోడ్ను కచ్చితంగా అమలు చేసేందుకు అధికారులు పక్కాగా చర్యలు చేపట్టాలని, అధికారులు అప్రమత్తంగా ఉంటూ, ప్లయింగ్ స్వ్కాడ్లు, స్టాటికల్ సర్వేలెన్స్ టీమ్లు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, మారుమూల ప్రాంతాల్లోని పోలింగ్పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రవాణా సదుపాయాలు, ఎన్నికల సామగ్రి తరలింపునకు అవసరమైన వాహనాలను సిద్ధం చేసుకోవాలన్నారు. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత ఉండాలని, ఎటువంటి లోటుపాట్లకు తావులేకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన విషయాలను జిల్లా పంచాయతీ అధికారి కేపీ.చంద్రశేఖర్, డివిజనల్ పంచాయతీ అధికారి పీఎస్.కుమార్ అధికారులకు వివరించారు. ఈ సమావేశంలో ఎస్పీ అమిత్బర్దార్, జాయింట్ కలెక్టర్ టి.శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, సబ్కలెక్టర్ కె.సాహిత్, జిల్లా పరిషత్ సీఈవో పి.వాసుదేవరావు, మండల ప్రత్యేకాధికారులు, ఎంపీడీవోలు, తహశీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.