Share News

తవ్వేస్తాం.. అమ్మేస్తాం!

ABN , Publish Date - May 17 , 2026 | 11:12 PM

వీఎంసీ 88వ వార్డు పరిధి గంగవరంలో గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. గంగవరం సర్వే నంబరు 58లో గల జగనన్న కాలనీ(ప్రస్తుతం ఎన్టీఆర్‌ కాలనీ)లోని రోడ్లను ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు.

తవ్వేస్తాం.. అమ్మేస్తాం!
గంగవరం రెవెన్యూ పరిధిలో జగనన్న కాలనీలోని రోడ్డు తవ్వేసిన దృశ్యం

గంగవరంలో చెలరేగిపోతున్న అక్రమార్కులు

దర్జాగా ఎన్టీఆర్‌ కాలనీలో గ్రావెల్‌, మట్టి అక్రమ తవ్వకాలు

వెదుళ్లనరవ, దువ్వాడ, తదితర ప్రాంతాల్లో నిల్వ చేసి విక్రయాలు

కన్నెత్తి చూడని గనులు, రెవెన్యూ శాఖల అధికారులు

సబ్బవరం, మే 17 (ఆంధ్రజ్యోతి): జీవీఎంసీ 88వ వార్డు పరిధి గంగవరంలో గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. గంగవరం సర్వే నంబరు 58లో గల జగనన్న కాలనీ(ప్రస్తుతం ఎన్టీఆర్‌ కాలనీ)లోని రోడ్లను ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. గనులు, రెవెన్యూ శాఖల అధికారులు కనీసం కన్నెత్తి చూడకపోవడంతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు.

గంగవరంలో గత వైసీపీ ప్రభుత్వం జగనన్న కాలనీ పేరిట పేదలకు సెంటు స్థలం కేటాయించిన విషయం తెలిసిందే. నివాసయోగ్యం కాని ప్రదేశంలో ఈ స్థలాలు కేటాయించడంతో ఇళ్లు నిర్మించుకునేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు. అయితే అధికారుల ఒత్తిడితో కొందరు ఇళ్లు నిర్మించుకున్నా అక్కడ నివాసం ఉండడం లేదు. దీంతో కొందరు అక్రమార్కులు ఈ కాలనీలోని రోడ్లను తవ్వేసి గ్రావెల్‌, మట్టిని దర్జాగా తరలించుకుపోతున్నారు. దీనిని వెదుళ్లనరవ, దువ్వాడ, తదితర ప్రాంతాల్లో నిల్వ చేసి విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ఈ కాలనీలో 10 అడుగుల మేర గోతులు కనిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా గనులు, రెవెన్యూ శాఖల అధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

ఇల్లు నిర్మించుకోవాలంటే కష్టమే..

కాలనీలో ఇల్లు నిర్మించుకోవాలంటే ఇకపై కష్టమే. ఎందుకంటే దాదాపు అన్ని ప్లాట్ల వద్ద అక్రమార్కులు భారీగా గ్రావెల్‌, మట్టి తవ్వేశారు. వీటిని పూడ్చి ఇల్లు నిర్మించుకోవాలంటే అసాధ్యం. ఇప్పటికే గంగవరం, నంగినారపాడు రెవెన్యూ పరిధిలోని లేఅవుట్లలో సుమారు 800 ప్లాట్లు గల్లంతైనట్టు అధికారులు గుర్తించారు. ఇప్పుడు అక్రమార్కులు రోడ్లను సైతం తవ్వేస్తున్నారు. అధికారులు, వీఎంఆర్‌డీఏ సిబ్బంది అండదండలతోనే అక్రమార్కులు బరితెగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా కలెక్టర్‌ స్పందించి గ్రావెల్‌ అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు లేఅవుట్‌లోని స్థలాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - May 17 , 2026 | 11:12 PM