Share News

వెల్ఫేర్‌ ఉత్తిమాటే!

ABN , Publish Date - Aug 08 , 2026 | 12:35 AM

విశాఖ ఉక్కు కర్మాగారంలో వెల్ఫేర్‌ సెంటర్లు కొందరికి అక్రమార్జన కేంద్రాలుగా మారిపోయాయి.

వెల్ఫేర్‌ ఉత్తిమాటే!

స్టీల్‌ సిటీలో కొందరి అక్రమార్జనకు కేంద్రాలుగా మారిన కమ్యూనిటీ సెంటర్లు

ఉద్యోగుల కుటుంబాల కోసం నిర్మించిన యాజమాన్యం

నిర్వహణ గుర్తింపు సంఘానికి అప్పగింత

దుర్వినియోగం అవుతున్నట్టు ఆరోపణలు

తప్పుడు వివరాలతో ముందుగానే బుకింగ్‌

డెకరేషన్‌ నుంచి అన్నీ వారు చెప్పిన వారికే...

లేనిపక్షంలో చుక్కలు చూపిస్తారు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖ ఉక్కు కర్మాగారంలో వెల్ఫేర్‌ సెంటర్లు కొందరికి అక్రమార్జన కేంద్రాలుగా మారిపోయాయి. ముందుగానే హాళ్లను బుక్‌ చేసుకొని, ఆ తరువాత వాటిని వేరే వారికి అధిక ధరకు ఇవ్వడం, లైటింగ్‌, డెకరేషన్‌ అన్నీ తామే చేస్తామని ఎక్కువ మొత్తాలు వసూలుచేయడం నిత్యకృత్యంగా మారింది.

విశాఖ ఉక్కు యాజమాన్యం ఉద్యోగుల సంక్షేమం కోసమని రెండు కమ్యూనిటీ వెల్ఫేర్‌ సెంటర్లు (సీడబ్ల్యుసీ) నిర్మించింది. సీడబ్ల్యుసీ-1ని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కళాక్షేత్రంగా, సీడబ్ల్యుసీ -2ని ఆంధ్ర కేసరి కళాక్షేత్రంగా వ్యవహరిస్తున్నారు. వీటిలో ఉద్యోగులు, వారి కుటుంబీకుల కోసం గ్రంథాలయాలు, ఇండోర్‌ గేమ్స్‌కు ఏర్పాట్లు ఉన్నాయి. ఉద్యోగుల ఇళ్లలో ఏమైనా కార్యాలు ఉన్నట్టయితే ఈ హాళ్లలో నిర్వహించుకుంటుంటారు. ఉద్యోగి కుటుంబాలకైతే రూ.10 వేలే అద్దె తీసుకుంటారు. అదే బయట వారికైతే రూ.30 వేలు వసూలు చేస్తారు. వీటి నిర్వహణ బాధ్యతలను గుర్తింపు సంఘానికి యాజమాన్యం అప్పగించింది. గత మూడేళ్లుగా గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించకపోయినా, పాత సంఘం ప్రతినిధులే వాటిని నిర్వహిస్తున్నారు. వీటిలో ఏది కావాలన్నా ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవలసిందే. బుక్‌ అయిన వెంటనే ఆ తేదీ బ్లాక్‌ చేస్తారు. అయితే కొందరు నాయకులు వాటిని అక్రమార్జనకు ఉపయోగించుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వారి ఇళ్లలో ఎటువంటి శుభకార్యాలు లేకపోయినా...డిమాండ్‌ ఉండే తేదీలను ముందుగానే ఏదో ఒక ఉద్యోగి పేరుతో బుక్‌ చేసేస్తున్నారు. ఆ తరువాత ఎవరైనా వస్తే వారితో బేరసారాలు సాగించి అదనపు మొత్తాలు వసూలు చేస్తున్నారు.

అదనపు లావాదేవీలు

అద్దెలో వచ్చే అదనపు మొత్తంతో నాయకులు సరిపెట్టుకోవడం లేదు. ఆ శుభకార్యానికి అవసరమైన లైటింగ్‌, డెకరేషన్‌ కూడా తాము చెప్పిన వారి దగ్గరే చేయించుకోవాలనే నిబంధన పెడుతున్నారు. ఈ సీడబ్ల్యుసీలలో డెకరేషన్‌, లైటింగ్‌ ఏర్పాట్లు చేయడానికి కాంట్రాక్టర్లతో వేలం నిర్వహించి, ఎవరు ఎక్కువ ఇస్తే వారికే ఆ బాధ్యత అప్పగించారు. దాంతో వారు తప్ప ఇంకెవరూ అక్కడ పనులు చేసేందుకు వీలుండడం లేదు. ఈ నేపథ్యంలో వారు పెద్ద పెద్ద మొత్తాలు డిమాండ్‌ చేస్తున్నారు. ఒక పెళ్లి కార్యక్రమం కోసం డెకరేషన్‌కు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు అడుగుతున్నారు. అదే బయట వారిని తెచ్చుకుంటే లక్ష రూపాయల్లో అయిపోతుంది. కానీ ఇక్కడ ఆ అవకాశం ఇవ్వడం లేదు. తాము కాంట్రాక్టు తీసుకున్నామని, ఇంకెవరూ రావడానికి వీల్లేదంటూ వారు అడ్డం పడుతున్నారు. సీడబ్ల్యుసీలను నిర్వహించే నాయకులు ఈ విషయంలో మౌనం వహిస్తున్నారు. ప్రతి ఉద్యోగి కుటుంబంలో ఏవో కార్యక్రమాలు జరుగుతాయి. వాటిని యాజమాన్యం కల్పించిన సౌకర్యంతో తక్కువ ఖర్చుతో పూర్తి చేసుకుందామంటే...మధ్య దళారులు ఒప్పుకోవడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు.

పట్టుబడితే అసౌకర్యమే

ఏ ఉద్యోగి అయినా పంతానికి పోయి బయట వ్యక్తికి డెకరేషన్‌, లైటింగ్‌ వంటి పనులు అప్పగిస్తే...ఆ శుభకార్యంలో గందరగోళం సృష్టిస్తున్నారు. కరెంటు వైర్లు తప్పించేయడం, ఏసీలు పనిచేయకుండా ఆపేయడం వంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. అదే నాయకులతో గొడవపడితే... భోజనాల సమయంలో ఆ చుట్టుపక్కల పనిచేసే వారందరినీ అక్కడి రప్పించి, అతిఽథులు రాక ముందే వంటకాలన్నీ అయిపోయేలా చేస్తున్నారు.

ఈ సీడబ్ల్యుసీల నిర్వహణలో చాలాకాలంగా వివాదాలు నడుస్తున్నాయి. రికార్డుల నిర్వహణ సరిగ్గా లేదని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఉద్యోగులు మానవ వనరుల విభాగంలో ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ఎలాగూ గుర్తింపు సంఘం లేదు కాబట్టి, వాటి నిర్వహణ బాధ్యతలు యాజమాన్యమే తీసుకోవాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. దళారుల బెడద లేకుండా చూడాలని కోరుతున్నారు.

Updated Date - Aug 08 , 2026 | 12:35 AM