Share News

మారుమూల పల్లెలకూ సంక్షేమ ఫలాలు

ABN , Publish Date - Aug 06 , 2026 | 11:24 PM

గిరిజన ప్రాంతంలో ప్రతి మారుమూల పల్లెకు సైతం ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర షెడ్యూల్‌ తెగల కమిషన్‌ చైర్మన్‌ ఎస్‌.బొజ్జిరెడ్డి అన్నారు.

మారుమూల పల్లెలకూ సంక్షేమ ఫలాలు
మాట్లాడుతున్న ఎస్‌టీ కమిషన్‌ చైర్మన్‌ ఎస్‌.బొజ్జిరెడ్డి, పక్కన కలెక్టర్‌ నిషాంతి

రాష్ట్ర షెడ్యూల్‌ తెగల కమిషన్‌ చైర్మన్‌ ఎస్‌.బొజ్జిరెడ్డి

అధికారులు సమన్వయంతో గిరిజనులకు సేవలందించాలని సూచన

పాడేరు, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతంలో ప్రతి మారుమూల పల్లెకు సైతం ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర షెడ్యూల్‌ తెగల కమిషన్‌ చైర్మన్‌ ఎస్‌.బొజ్జిరెడ్డి అన్నారు. జిల్లాలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై వివిధ శాఖల అధికారులతో గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధానంగా గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు అంగన్‌వాడీ సేవలను పక్కాగా అందించాలన్నారు. అలాగే భూమి, అటవీ సాగు భూములకు హక్కుల కల్పనపై ఆరా తీశారు. అర్హులైన గిరిజనులందరికీ అటవీ హక్కు పత్రాలు అందించాలని, ఈ క్రమంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. గిరిజన గ్రామాల్లో గృహ నిర్మాణాలు, తాగునీటి సదుపాయాల కల్పన ప్రక్రియలు వేగవంతం చేయాలన్నారు. భవనాలు లేని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో బాలలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వాటిని గుర్తించి భవనాల నిర్మాణానికి చర్యలు చేపట్టాలన్నారు. తన పర్యటనలో పలు శాఖలకు చెందిన అధికారులు అందుబాటులో లేరని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కమిషన్‌ దృష్టికి వచ్చిన గిరిజన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. అధికారులు అందుకు అనుగుణంగా సమన్వయంతో పని చేసి గిరిజనుల మన్ననలు పొందాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో కలెక్టర్‌ టి.నిషాంతి. జాయింట్‌ కలెక్టర్‌ టి.శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, ఎస్‌టీ కమిషన్‌ సభ్యులు గొర్ల సునీత, కద్రకా మల్లేశ్వరరావు, కె.కృష్ణారావు, కిల్లో సాయిరామ్‌, ఆర్డీవో ఎం.భుజంగరావు, గిరిజన సంక్షేమ శాఖ డీడీ పీబీకే.పరిమిళ, ఐసీడీఎస్‌ పీడీ ఝాన్సీబాయి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Aug 06 , 2026 | 11:24 PM