వారపు సంతలు వెలవెల
ABN , Publish Date - Mar 23 , 2026 | 11:25 PM
గిరిజన ప్రాంతంలోని వారపు సంతలు వెలవెలబోతున్నాయి. ప్రస్తుతం మారుమూల గ్రామాలకు సైతం రహదారి సౌకర్యం ఉండడంతో వర్తకులు నేరుగా గిరిజనుల వద్దకే వెళ్లి అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు.
మారుమూల గ్రామాలకు సైతం రహదారి సౌకర్యం ఉండడంతో గిరిజనుల నుంచి నేరుగా వర్తకులు కొనుగోలు
సంతలకు వచ్చే అటవీ ఉత్పత్తులు అంతంతమాత్రమే..
రోడ్డు లేని గ్రామాల గిరిజనులు తెచ్చిన సరుకులు మధ్యాహ్నంతో సరి
అనంతగిరి, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతంలోని వారపు సంతలు వెలవెలబోతున్నాయి. ప్రస్తుతం మారుమూల గ్రామాలకు సైతం రహదారి సౌకర్యం ఉండడంతో వర్తకులు నేరుగా గిరిజనుల వద్దకే వెళ్లి అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. దీంతో చాలా వరకు గిరిజనులు అటవీ ఉత్పత్తులను వారపు సంతలకు తీసుకురావడం మానేశారు. దీని వల్ల వారపు సంతలు వెలవెలబోతున్నాయి.
అరకులోయ మండలంలో శనివారం లోతేరు, శుక్రవారం అరకులోయ, బుధవారం కించుమండ, అనంతగిరి మండలంలో సోమవారం అనంతగిరి, బుధవారం కాశీపట్నం, డముకు, పెదబయలు మండల కేంద్రంలో సోమవారం వారపు సంతలు జరుగుతాయి. అలాగే ముంచంగిపుట్టు మండల కేంద్రంలో శనివారం, చింతపల్లిలో బుధవారం, జి.మాడుగులలో బుధవారం వారపులు సంతలు ఎన్నో ఏళ్లుగా జరుగుతున్నాయి. ఇవి గిరిజనులకు సూపర్ మార్కెట్లనే చెప్పవచ్చు. గిరిజనులు సేకరించిన అటవీ ఉత్పత్తులను వారపు సంతలకు తీసుకువచ్చి విక్రయించి, వారికి కావాల్సిన నిత్యావసర సరుకులను కొనుగోలు చేసి ఇళ్లకు తీసుకు వెళుతుంటారు. అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి వచ్చే వర్తకులు, వినియోగదారులతో వారపు సంతలు కళకళలాడుతుంటాయి. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. చాలా గ్రామాలకు రహదారి సౌకర్యం ఉండడంతో వ్యాపారులే నేరుగా గ్రామాలకు వెళ్లి గిరిజనులు సేకరించిన అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. దీంతో గిరిజనులు వారపు సంతలకు అటవీ ఉత్పత్తులు తీసుకు రావడం తగ్గించేశారు. ప్రస్తుతం రహదారి సౌకర్యం లేని గ్రామాల నుంచి గిరిజనులు తెచ్చిన అటవీ ఉత్పత్తులు మాత్రమే వారపు సంతల్లో కనిపిస్తున్నాయి. గతంలో ఉదయం ఆరు గంటలకు వారపు సంతలు మొదలై సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగేవి. ప్రస్తుతం ఉదయం 10 గంటలకు మొదలై మధ్యాహ్నం లోపు ఖాళీ అవుతున్నాయి. రహదారి లేని గ్రామాల గిరిజనులే వారపు సంతలకు అటవీ ఉత్పత్తులను తీసుకువచ్చి విక్రయించి, నిత్యావసర సరుకులను కొనుగోలు చేసి వెళుతున్నారు. వర్తకులు కూడా వారపు సంతలకు రావడం తగ్గించేశారు. నేరుగా గ్రామాలకే వెళ్లి గిరిజనుల నుంచి అటవీ ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్నారు. అయితే చుట్టు పక్కల గ్రామాల నుంచి వినియోగదారులు వస్తుండడంతో వారపు సంతలు కొంత వరకు మనుగడ సాగిస్తున్నాయి. రానున్న రోజుల్లో వారపు సంతలు కనుమరుగయ్యే పరిస్థితి ఉందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.